Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టణాన్ని
తప్పించుకు పోయె
బైపాస్ రహదారిని చూసి
అందలం అందమా ఆనందం అందమా
ఏది ఏమైనా
ప్రమాదాలు జరగకుంటే చాలు కదా
ఎవరు గెలిచినా ఎవరు నిలిచినా
ఎప్పుడూ ప్రతిపక్షమే
ఇక్కడ అభివద్ధి ఎప్పుడూ
అందనంత దూరమే
మానేరు నీళ్లను కాళ్లకు అంటకుండా
ప్రవాహాన్ని తప్పించుకొని
వంతెనలపై నడుస్తున్న
ఊర్లకు ఊర్లను చూసి
ఆనందం పొందుదామా అపభ్రంశం చెందుదామా ఎట్లా అయితే ఏంది
మనిషి తడవక పోవడం ముఖ్యం కదా
నేత కార్మికుల బతుకు భారం కాకుండా ఉండడానికి బతుకమ్మ చీరలు అయితేనేమి
యజమానులకు బతకనేర్చిన
బట్టలు అయితేనేమి
కార్మిక కుటుంబాల నోటికి
5 వేళ్ళు పోతే మేలు కదా
కొడుకులు చూడని ముసలి తల్లి తండ్రులకు బతుకు దారిని చేరలేని దివ్యాంగులకు
చేతి కర్ర ఆసరా అయితే అదే పదివేలు కదా
బెంగటీలిన మనిషికి
గుండె ధైర్యం నింపే ఓదార్పులా
గండి పడ్డ ఎండిన చెరువుకు నీటి పలకరింపులా నడి ఎండల్లో పచ్చని చెట్టు నీడలా
తోడు ఉంటే వేసవిలో
పూసే మల్లెమొగ్గల పరిమళంలా
వ్యాపిస్తే అదే ఆహ్లాదం కదా
ఇప్పటికిదే
అభివద్ధి ఆనవాలు కదా
అందలానికి చిరునామా కదా
- జూకంటి జగన్నాథం