Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ మట్టి
నేలను గీతలు గీసాము నిలువునా చీల్చాము
రేగిన ధూళి మీద రాజ్యం నీళ్లు జల్లింది
నల్ల కట్టల నాగమల్లి నవ్వు కుంచె
తడి మన్ను కాన్వాస్‌పై
కాంక్రీట్ చిత్రలేఖనం రంగులు పూసింది
మట్టి మాయమైంది కాదు చచ్చిపోయింది
కాదు మాయమైంది కాదు హత్య జరిగింది
అయ్యో! ఎవరు చేశారు ఈ మహాపాపం
విత్తు విచ్చుకునే వేల
మొక్కని ప్రసవించే నిండు చూలాలని
కనికరం కూడా లేకపోయింది
ఏ దిక్కు సాక్ష్యం చెప్పాలి?
ఆకాశానికి తెలుసు నిజం
అయితే ఎవరు మాట్లాడిస్తారు?
మేధావులంతా చలించి కదిలారు
కలాలు గళాలు నూరి వాదించి శోధించి
దస్తాలు దస్తాలు రిపోర్టులు రాశారు
నేరం రుజువైంది
ఉరికంభమెక్కి పలుగు పార ఉరేసుకున్నాయి
ఈ దేశంలో ఇదే న్యాయం
ఏ చెట్టు
మట్టి చిరునామా చెదిరాక
ఇక చెట్టెక్కడ ఉంది
మాను కూలి దేహం ముక్కలయింది
ఆకు రాలిన రెమ్మలు ఎండిపోయి
ఎక్కడో చలిమంటలో
హేమంతానికి చలి కాస్తున్నాయి
రెమ్మలు తెగిన కొమ్మలు ఎగుమతవుతున్నాయి
అలజడి రేగిన ఆకులన్నీ
గలగలా ఘోషించాయి
పక్షి దీన పరాధీనురాలయింది
వేసవికి ముందే వసంతం కాలిపోయింది
చెట్టు ఖాళీ అయింది కాదు మాయమైంది
కాదు ఖాళీ అయింది లేదు చచ్చిపోయింది
కలేభరమైనా కనిపించలేదు
ఎంక్వయిరీలు వేశారు
నీటిలో లవణాలు
ఎక్కడో ఇంచుమందం మిగిలిపోయిన
సవుడు నేల రేణువుల్ని విచారించారు
కళ్లు లేని భూతద్దాల మేధావులు
చివరికి చెట్టు కనిపించక పోవడానికి మట్టి కారణమని తేల్చేశారు మహానుభావులు
ఏ మనిషి
మట్టిని మాటేసి చెట్టుని కాటేసాక
ఇంకెక్కడ మనిషి!
గాలి రాకాసి అలకి ఏకాంతపు చీకటిలో
ప్రత్యూష నక్షత్రంలా రాలిపోతున్నాడు
ఆకు సడిలేని గాలి
తేమ తడిలేని గాలి
మట్టి వాసన లేని గాలి
తుమ్మెద ఝమ్మనలేని గాలి
పువ్వు పరిమలించలేని గాలి
ప్రాణం లేని గాలి- ఆక్సీజన్ లేని గాలి
విష నాలుక చాస్తుంది
కర్మఫలం కాకపోతే
కోతలో మిగిలిపోయిన చెట్టుకింద
ఆక్సిజన్ సిలిండర్‌తో మనిషి
మలిసంధ్య ఒత్తిలా వెలిగిపోతున్నాడు
ఊపిరాడక ఊగిపోతున్నాడు
ఇప్పుడు గాలి ముఖచిత్రంలో
మట్టి చెట్టు రక్త వర్ణాలుగా మిగిలిపోయాయి
మనిషి మత్యు దుర్ఘంద దీపమై కదిలిపోతున్నాడు
తప్పదూ.. బతికి బట్టకట్టాలంటే
మళ్ళీ పచ్చగా ప్రయాణం సాగించాల్సిందే
- వెంకటేష్ పువ్వాడ,
సెల్ 7204709732