Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రివ్వున వీచిన గాలి
కిటికీల్ని పలకరించింది
టప టపమంటూ
కిటికీ రెక్కలు బదులిచ్చాయి
నిటారుగా నిలబడ్డ గది గోడలు
ఆ ముచ్చట్లు వింటూ
ముసి ముసిగా నవ్వుకున్నాయి
అప్పటిదాకా స్తబ్దంగా వున్న
గదిలో ఎదో కదలిక మొదలయింది
కుర్చీలో కువ కువ
టేబుల్ గుండెల్లో దడ దడ
పేపర్ వెయిట్ లేని కాగితాలు
పతంగుల్లా ఎగిరాయి
న్యూస్ పేపర్ రెపరెప లాడింది
నీళ్ళ బాటిల్ గజగజ వణికింది
అటూ ఇటూ కదిలి
కలమొకటి
టేబుల్ మీంచి జారి కింద పడింది
అప్పటిదాకా గదినిండా పరుచుకున్న వెల్తురు
చటుక్కున లేచి ఎంచక్కా వెళ్ళిపోయింది
తలకింద చేతులు పెట్టుకుని
నేలమీద పడుకున్న నాలో
ఏదో తలుక్కున మెరిసింది
'వాతావరణానికీ' నాకూ
మాట కలిసింది
లోన గడ్డకట్టుకున్నదేదో కరుగుతున్నది
కొత్త చిగురేదో విచ్చుకుంటున్నది
- వారాల ఆనంద్,
సెల్ 9440501281