Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్సిజన్ పంపించురా నాయనా!
నిన్ను అభిమానంతో
నా కళ్ళనిండా నింపుకున్నందుకు
గుండెల మీద నీ పచ్చబొట్టు పొడిపించుకున్నందుకు
నా ఆత్మతో నేనే
సావు పాట పాడుకుంటున్నట్టున్నది
ఆక్సిజన్ పంపించురా అయ్యా!
మరణశయ్య మీద పడుకొని
ఐదొద్దులు, పదొద్దులని
నేను చేసిన పాపాలను
లెక్కబెట్టుకుంటున్నట్టున్నది
ఆశకింత సుక్కలమందు పోసి
కుక్క బతుకును చేసి
ఎంగిలి ఇస్తారాకుల్ల
పొర్లాడే మెతుకును చేసినవు
ఓట్లకు ముందు
చేతుల్ల చేయి పెట్టి
కడుపుల తలకాయ ఆనిచ్చి
మీ తలలో నాలుకనని
మెలక మాటలు మాట్లాడినవు
ఒడ్డెక్కినంక ఇప్పుడు
తెడ్డొక్కటే కాదు
ఇంకెన్నో చూపిస్తున్నవు
ఏందిరా అయ్యా!
శ్వాస ఆడని ప్రతీసారి
కరోనా గుర్తుకు రాట్లే
నువ్వే, నీ మోసమే గుర్తొస్తాంది
ఆక్సిజన్ అందక
సస్తనో లేదో తెల్వదుగని
సిచ్ఛాఫ్ పెట్టుకున్నవని
తలుచుకుంటే చాలు
నా పై ప్రాణాలు పైన్నే పోతున్నయి
పానమడ్డంపెట్టి ప్రచారం చేత్తే
నా ఊపిరితీత్తానికొచ్చిన
కరోనా పురుగు
నువ్వే అయితవని
కలల కూడా కల కనలేదు
వలవలవల ఏడుస్తూ సాపిత్తానా
నా గోస ఎన్నటికైనా
నిన్ను ముడుతది
సావడం మాకు కొత్తకాదు
మాలాంటి బీదబిక్కోళ్ళను
పావులుగా వాడుకోవడం
మీకు కొత్తకాదు
కానీ
శ్వాసతో బేరమాడుతున్న
ఈ కొత్తరకం
వ్యాపారమేందిరా అయ్యా!
పైకి తెల్లగనున్నగ
కనబడుతరు గని
లోపలన్ని పురుగుబుద్దులేరా మీవి
- తండ హరీష్ గౌడ్
సెల్ 8978439551