Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు...''
దిగంతాల కావల నినదించిన గళా రవళి అందెశ్రీ కవితా ఝరి
ఒక్కసారిగా ఉలిక్కిపడింది తెలుగు సాహితీ సీమ! ఒకే ఒక్క చరణం!! ప్రపంచమంతా ఒక్కసారి ఈ మహా వాక్యం విని వెను తిరిగి చూసి విస్తుపోయింది! ఒట్టి మట్టి మనిషిలో మహాకవిని తలపించే లోకజ్ఞత?
అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యమన్న అక్షరలక్షాధికారీ, మాటల కోటీశ్వరుడూ, ఫ్రెంచ్ కవితల మంచి రీతుల్నీ, షెల్లీ కవనపు హల్లీసకాల్నీ, డాలీ, గిబ్బన్, విట్మన్, డిలాన్, ఆడెన్, పుష్కిన్, గోర్కీల సాహితీ వైభోగాల్నీ, పాల్ ఎల్వార్డ్ పల్లవించిన వైప్లవ్య శ్వాసనూ, మయకోవిస్కీ మధురిమలనూ అద్దుకొని, స్విన్ బర్న్ గళ గళన్మంగళ కళా కాహళ హళాహళిలో కరిగి, రగిలిన మహాకవి నేపథ్యం ఒక మహా అధ్యయనపు సాహితీ మహా ప్రస్థానం! ఛందస్సులు సర్ప పరిష్వంగాలై అల్లుకున్నా, మరుభూమిలాంటి అలంకారాలు వెంటవున్నా, తన కవితాకాశపు, ఆవేశపు అనుభూతులకు అదనపు సొబగులయ్యేలా మలచుకున్న నేపథ్యంతో అలరారినవాడూ, మహా 'సిరి' గలవాడూ కాబట్టే ఈ యుగం నాదే అని గడుసుగా చెప్పుకొని చెల్లిపోగలిగిన వాడు మహాకవి! ఇపుడే యుగం నడుస్తుందో తెలీదు గానీ శ్రీశ్రీ ఒక మహౌన్నత స్ఫూర్తి శిఖర దీప స్తంభం! తల వెనక్కి విరిచి చూసినా అందనంత ఎత్తులో నిలబడి నినదించిన ఒక విప్లవ గళం!
అందె శ్రీ ఒట్టి మనిషి! ఒంటి 'శ్రీ' మనిషి ! ఒట్టి మట్టి మనిషి!! బడిలేదు, అమ్మ ఒడి లేదు! ఆదరించిన వాడు లేడు! కడుపునిండిన బాల్యం కాదు. అక్షరమంటే మక్కువ, పుస్తకమంటే ప్రాణం! మస్తకమంతా అంతులేని భావ సంఘర్షణల ఎగసిపడే లావాల అంతర్మధనం! అరకొర చదువులు, కడుపునింపని కాఠిన్యపు బతుకు వెతలు.
నాగేటి చాలుల్లో భూమి తల్లి చేరువగా అంబాడిన ఈ మట్టి మనిషికి భూగోళమే నలుచదరమై తన హదినే పలకగా పరిచి, అక్షరంగా మలచి పాఠాలు నేర్పింది! ప్రకతే అమ్మగా మారి తానే బలమై, బలపమై గీతనే గీతాలుగా పల్లవింపజేసింది! జ్ఞానమే నేనంది, పలికించెడి దాన్ని నేనే అంది! నువ్వు పలికితే భవహరమే కాదు యావత్తూ విశ్వమే నీ ముందు సాగిల పడుతుందని నమ్మబలికింది!!
'గిజిగాడి' గూటిలో అల్లుకున్న ఈత పరకల నేత అల్లికలోని నైపుణ్యాన్ని చూసి పాడమంది! మరకతమై వెలుగులీనే 'ఆరుద్ర' పురుగు అందాల్ని చూడమంది! తూరుపు నుదిటి మీద సిందూరమై వెలిగి, జగతికాభరణమై వెలుగుల్ని విసిరే ఆదిత్య పద పల్లవ రాజీవాల కాంతి ఖడ్గాల్ని పరవశంతో పాడి అందెగా రవళించి అందె శ్రీ వై వెలగమంది! నడిచిపోయే నల్ల మేఘాల్లో ఊయల లూగిన ఉదకాలని వెదికి పరవశించమంది!
''విశ్వవీణకు వర్ష ధారలే తంత్రులుగ
మ్రోగినవి సంగీత మోహనాలు
భూతలమె వేదికగ భువనాలే శ్రోతలుగ...''
''తొలకరి చినుకు రాలి
సీతాకోకచిలుకల్లా పలకరిస్తే
నాగేటి చాళ్ళు నీళ్లొసుకున్న బీళ్లు
నేల తల్లి కనుపాపల మగ్గం మీద
చినుకు హరిత వస్త్రాల్ని నేస్తుంది...''
''లోకాన్ని నిర్మాణం చేసిన
చేతులకు చిరునామాలుండవ్
ఆ లోకుల పై బడి బతికే వాడికె
చిరునామాలు చిత్ర మేమది?''
కాదేదీ కవిత కనర్హమనకున్న అందెశ్రీ కి పురుగు నుంచి పులుగు దాకా, పువ్వు నుంచి పున్నమి వెలుగు దాకా, జగతికాభరణాలైన జనన మరణాల దాకా, పంచ భూతాలన్నీ సహస్రాధిక కావ్య వస్తువులై అలరారాయి.
పాదాల కిందపడి నలిగే గడ్డి పోచల ఆర్తనాదాల్ని విన్న రొమాంటిక్ యుగ ప్రకతి కవి వర్డ్స్ వర్త్ ని తలపిస్తూ ప్రధానంగా ప్రకతిలో పరవశించినా జలగల్ని పట్టి జీవించే ముదుసలి కోసం మానవీయ కోణాన్ని దర్శించిన వర్డ్స్ వర్త్ లానే 'మనిషి' ని దర్శించడం మొదలు పెట్టిన అందెశ్రీ కి మాయమపోతున్న మనిషి తారసిల్లాడు! ఒక్కసారిగా ముప్పిరి గొన్న మానవీయ కోణం ప్రకతిని దాటి సమాజపు ప్రాంగణంలో పల్లవించింది!
'నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నడొ గాని కంటికి కనరాని
ఆ మనిషి కోసం' వాపోవడం మొదలెట్టాడు.
విశ్వమంతా అన్వేషిస్తూనే వున్నాడు!!
ప్రకతి ఒడిలో, ఆకాశపు బడిలో అక్షరాల జడిలో ఆశువై గళమెత్తిన అందె శ్రీ, తెలంగాణా జన గర్జన గళమై, నినాదమై, తెలంగాణా ఉద్యమ గీతమై నిలిచాడు. ఉద్యమ బావుటాగా వెల్లివిరిశాడు.
తెలంగాణ 'గోస' గానమైంది!
'యప్పడుపు కూడు భుజించుట కంటే'... హలాన్నే నమ్ముకుని బతుకుతానన్న పోతన నడయాడిన ఓరుగల్లు సమీపాన ఎక్కడో కుగ్రామం లో పుట్టిన ఈ నిరాడంబరమైన మట్టిలో వొదిగివున్న మాణిక్యపు వెలుగులు దిగంతాలు వ్యాపించాయి. ఖండ ఖండాంతరాలు సరిహద్దులు చెరిపేశాయి! అంటార్కిటికా తప్ప అన్నీ ఈ మట్టి మనిషిని స్వాగతించారు!
ఆఫ్రికా ఖండాతర హదయ సీమలో గంభీరంగా పరచుకున్న అమెజాన్ రారమ్మంది, తొలినాటి నాగరికతల నైలునదీ తీరం స్వాగతించింది! ఇగూజ్ జలపాతమే కాదు, ఓల్గా, ఓబ్ లే కాదు, చైనా యాంగ్జీ లు, రైన్, థేమ్స్, కాంగో, మిసిసిపీ...నయాగరాల ఒయ్యారాలు అన్నీ తనవే నన్నారు! పురుడుపోసుకోబోతున్న ఒక మహనదీ పరీవాహక జల కావ్యానికి భూగోళాన్ని చుట్టుకున్న సమస్త జీవనదులన్నీ ద్వారాలు తెరిచి స్వాగతించారు!
కవితా ఝరి రసప్రవాహమై విశ్వమంతా పర్చుకుంది! అక్షరానికై వగచిన అందెశ్రీ వాకిట డాక్టరేట్ డిగ్రీలు సైతం వినమ్రంగా వాలారు! వాషింగ్టన్ డీసీ అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, గౌరవ డాక్టరేట్‌ని అందించి తన్ని తాను సమ్మానించుకుంది. సన్మానాలే, సత్కారాలే గీటురాయి అయితే అందెశ్రీ కి అందినవి లెక్కకు మిక్కిలివి!
ప్రవేశాలకు కూడా నోచుకోని పీఠాల హదయ ద్వారాలు బార్లా తెరుచుకున్నారు! యుగయుగాల నుండీ మట్టి మనుషుల్ని ఎడం పెట్టిన సంప్రదాయం ఈ మట్టి మనిషిని గుండెల్లో పొదవుకుని ప్రక్షాళన చేసుకుంది! దత్త పీఠం హత్తుకుంది! మట్టి చేతికి స్వర్ణ కంకణం తొడిగి పసిడి తొడుగు కొక పవిత్రతను పులుముకుంది.
అన్నింటినీ మించి, తాను పుట్టిన తెలంగాణ గడ్డపై ఏ గుడిలో సుప్రభాత సేవతో యే దేవుడు తరిస్తున్నాడో లేదో తెలియదు గానీ, ఏ బడి వడి దూరమైందో ఆ బడి వాకిళ్ల లో తను రాసిన 'జయ జయ హే' గీతంతో, లక్షల కంఠాలు మేలుకొలుపుతో, స్వాగతించే అతి అరుదైన గౌరవం దక్కించుకున్న భాగ్యాన్ని అందుకున్న అందెశ్రీ కంటే అత్యంత భాగ్యవంతుడు ఇంకెవరు కాగలరు?
- వి.విజయకుమార్,
సెల్ 8555802596-