Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పిట్ట
పిడికెడన్నా లేదు..
నడి రేయి నుంచే
దూరిపోతోంది చెవుల్లోకి
కర్ణకఠోరంగా..!
నాలుగు గింజలన్నా పట్టని
ఆ బుజ్జి పొట్ట
ఇన్ని ప్రకంపనలను
ఎట్లా పుట్టిస్తుందో
చెట్టు చెట్టంతా
ప్రతిధ్వనిస్తోంది దీని ధాటికి..!
దాని గొంతున
ఆ కీస్ పిట్టని మా బుజ్జోడే ఇరికించినట్టున్నడు
తారాస్థాయికి రెచ్చిపోయి
గాత్ర కచేరీ చేస్తోంది పొద్దెరగని ఆత్రంతో
భయం గుప్పిట్లోంచి ఇప్పుడిప్పుడే సొమ్మసిల్లిన
నిశ్శబ్ద నీరవ నగరం బెంబేలెత్తుతోంది
ఇది వసంత పులకింత
ఎంతమాత్రమూ కాదు ఆ గొంతున
మార్దవమూ మాధుర్యమూ లేదు
ఈ హెచ్చరికా సందేశమ్ ఏమిటో
ఎవరైనా విచ్చి చెపితే బాగుండు
'ఇన్నోళ్లెవరో..ఇననోళ్లేవరో 'అంటూ
డప్పు సప్పుడు కొట్టే
మాపల్లె అంకూస్ కన్నా
వాటంగా చాటింపేస్తుందీ వసపిట్ట
దాని భాష అర్ధం కాదుగానీ,
ఏదో లోతైన గంభీర భావనే..!
అవునూ..
పుట్టలనీ..పిట్టలనీ ప్రేమించే నేనేనా..
బుజ్జి ప్రాణి మీద ప్రేలాపనలు
విధి వైపరీత్యమేమో..!
గత కొన్నాళ్ల నుంచీ
కునుకే కరువైన బికారులం
చితిమంటల కమురు వాసన
మనసుపొరల్లోంచి కదలడమే లేదు
అనాద దేహాల క్యూలు
దహనవాటికా ప్రాంగణంలోనే కాదు
కంటి గూటిలో వరుసగానే
నదీ ప్రవాహంలో
కొట్టుకుపోతున్న శవాలగుంపు
కుక్కలు పీక్కుతింటున్న..
పార్థివ దేహాల కాళ్ళూ చేతులు
బంధుమిత్రులొక్కరుగా కనబడని శత్రువుకు చిక్కి
నిష్క్రమిస్తున్న వేళ
నిన్నెలా ఆస్వాదిస్తానే పక్షినేస్తమా
దుఃఖిత మానవిని మన్నించవే..!
- నాంపల్లి సుజాత
9848059893