Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీ జరం గోలితో సోలి వాలే
గాలి జరం గాదు
పెయిని పెట్రోల్‌లో ముంచి బూడిద చేసే
ఖతర్నాక్ కరోన జ్వరం
ఒక్కసారి వచ్చిందా సచ్చేదాక యిడువది
రోజులు, వారాల కొద్ది ఒంటిని
మంట బెట్టే తుంటరి
దీని పక్కన పారాసిటమాల్
పనికిరాని మాత్రే
డోలో డొల్లనే
అజిత్రో మైసిన్ ఆంటి బయాటిక్స్
డోంట్ కేర్
ఎంతకూ తెల్లారని, సల్లారని అగ్గిగుండం
ఆస్పత్రిల బెడ్లు లేవు,
ఆక్సిజన్, వాక్సినేషన్ బుడ్లులేవు
వెంటిలేటర్ లేదు, ఇంటిలేటర్ లేదు
మా ఊపిరి మొక్కలు
కరోన పాదాల కింద
జరం జడలు కరోనా కట్టడిల ముట్టడి
నెత్తినిండా మెత్తుతున్న గునపాలు ఒంటినిండా సుత్తెల, సూదుల బాదుడు గడియ, గడియకు
మారే గండాలు గత్తర్లు
స్టెరాయిడ్స్ స్టెబిలైజర్స్ తో
మా దేహలు మందుల బొందలు.
మా ప్రాణాల్ని పాతరేస్తున్న పాజిటివ్‌లు.
పల్లాల సప్పుడిని పత్తకు లేకుండా,
దీపాలు ముట్టిత్తే, దిగదుడ్సినట్లు పోతదని
మూఢత్వంలో మునకలు.
చావుల వేవ్ గా రెండో రువ్వడుందని
గ్లోబ్ గొల్లు గొల్లున ఘల్లుమన్నా...
దేశ భారీ క్రూరత్వాల
కుంభ మేళాలు, కుర్చీ ర్యాలీలు కుమ్మేసిన మానవ హనన
పాపాల పుట్ట పలిగిన విస్పోటనం.
సావు సంతల్ల, నరక యాతన జాతర్ల
కోవిడ్ కొండల మీద
మా శ్వాసల్ని సమాధులు చేసే...
క్రూరత్వాల ముందు
కరోనా బిర్రెంత, బిషాదెంత?
- జూపాక సుభద్ర