Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువులన్నీ
ఆన్లైన్లోనే
ఆవలించి
ఫీజులన్నీ పీల్చుకొన్నయి
ఆ తర్వాత
సెలవులొచ్చి
పరీక్షలన్నీ
పై తరగులకు
ప్రమోటయి
పిల్లలందరిని
ఊపిరి పీల్చుకొమ్మన్నయి
కానీ
అందరికీ ఇప్పుడు
ఒకే ఒక పరీక్ష
ఇమ్యూనిటీ టెస్టు
పాసయ్యామా
బతికిపోతాం
లేదా
పైకి పోతాం
ఎవరి అంత్యక్రియలకు
ఎవరూ హాజరు కాలేనప్పుడు
ఉండడానికి
లేకపోవడానికి
పెద్ద తేడా లేదు
చావంటే
ఎంతో కొంత ఆనవాళ్ళతో
వస్తుందనుకున్నాం
ఇన్నాళ్లు
ఇదేంది
మరీ ఇంత ఊహించకుండానా
ఊపిరాడకుండానా
మనిషి చావుకు
చాలా ముందే
మానవత్వం చచ్చి పోతాందే...
దాన్ని కూడా
బతికించుకోలేకపోతున్నాం గదా!
ఆయువు కోసం
ఒకడు తండ్లాడుతాంటే
ఆదాయం కోసం
ఇంకొకడి నోట్లో నీళ్ళూరుతానయి
చావు సైక్లోన్ లెక్క
దూసుకొస్తాంటె
అర్జెంటుగా అధికారానికి
ఆకలేసె
మూకుమ్మడిగా
భక్తి ముంచుకొచ్చె
ఊపిరి తీసుకోవడానికి
ఇంత ఆక్సీజన్‌ను
ఇవ్వలేని దేశంలో
ముందు చూపును
కోల్పోయిన మూర్ఖత్వం
ప్రాణాలను గాలిలో
దీపాలను చేసే గదరా...
కాల మేఘం
కంటి వెలుగులను
మింగేస్తున్న మత ఘడియల్లో
కాగడాలు పడుతున్న
చేతులు కొన్నయితే
చీకట్లో కాసుకొని
కాటేస్తూ
పైసల్ని పొదుగుతున్న
పాములు ఎన్నో...
- యం డీ. రహీమొద్దీన్
9010851085