Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక తెలుగు కవిత్వ విద్యకు అనుభూతి చైతన్యాన్ని అందించిన ఆధునిక తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆధునిక సాహిత్యంలో శేషేంద్ర జాలం కవిత, విమర్శ రంగాలలో కొనసాగింది. కవికి విమర్శకునికి ఉండవలసిన ప్రధాన చైతన్యం అనుభూతికి లోనుకావడమేనని బోధించిన కవి విమర్శకుడు శేషేంద్ర.
శేషేంద్ర 'ఆత్మకళ'గా సాహిత్యాన్ని భావిం చాడు. అనుభూతిగా అనుభవాన్ని మార్చుకునే దశలో కవి అంతర్యుద్ధం, బహిర్యుద్ధం చేస్తాడని, అనుభవం అనుభూతిగా మారడం బహిర్యుద్ధ మనీ, ఆ అనుభూతి అభివ్యక్తిగా మారడం అంతర్యుద్ధం అవుతుంది. అనుభూతిని కళగా నేర్చుకునే దశలో బహిర్జగత్తులో బాధితడవుతాడు. ఆ బాధను సచేతనంగా అనుభవిస్తాడు. బాధను ఆహ్వానించి అంతర్ముఖుడవుతాడు. జగత్తు కవి ఆత్మలో పడి కరిగిపోతుంది. ఈ సమయంలో సుఖ దు:ఖ విచక్షణ కోల్పోతాడు. ఈ ప్రక్రియనే ఆత్మకళ అని శేషేంద్ర భావించాడు. కవి సృజన వేళ సమాధి స్థితిలోకి వెళతాడని చెప్పే అలంకారికుల ఆలోచనలు, ఒక ఖచీజఉచీూజ×ఉఖూచీజుూూ అని చెప్పే ఆధునికుల ఆలోచనలు శేషేంద్ర ఆత్మకళలో చూడవచ్చు. బహిర్జగత్తు ఇచ్చిన ప్రేరణ అంత ర్ముఖీనతకు కారణమై 'సృజన' జరుగుతుం దన్నది దీనికి అనుభవమూ- అనుభూతి అన్నవి పునాదులుగా భావించాడు శేషేంద్ర.
సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉపయోగ పడాలని కొందరు, సాహిత్యం సాహిత్యం కొరకే అని కొందరు దాని ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్న ఒక సందర్భంలో ఈ రెండూ అవసరమేనని వ్యక్తి నిష్ట సామాజిక నిష్ఠకు కారణం అవుతుందని అభిప్రాయ పడ్డారు. సమాజానికి వర్గ నాయకత్వం కంటే వైజ్ఞానిక నాయకత్వం అవసర మని అభిప్రాయ పడుతూ మత గురువులు, రాజకీ యవేత్తలు, సాంస్కృతిక వీరులు దీనికి కారణమౌ తారని భావించాడు. దేశ కాలాతీతమైన సత్యం, కాలానుగుణంగా ధర్మం మారవచ్చు. ధర్మార్థ కామ మోక్షాల తాత్పర్యం మారవచ్చు కానీ ఆ నాలుగూ ఏ అర్థంలో అయినా సరే మానవుణ్ణి నిలబెట్టటానికి ఎప్పటికీ ఉంటాయి అనడం ద్వారా ఆ భావనల ఉద్దేశÊంఅయ కాలానుగుణంగా మారుతుంది కానీ భావనలలోని మౌలికతకు ఏ రకంగానూ ఇబ్బందు లుండవని శేషేంద్ర భావించాడు. ఆత్మకళ సాహిత్య సామాజిక స్పృహలు, సత్యధర్మాల తాత్పర్యం మీదనే శేషేంద్ర సాహితీ వ్యాసంగం కొనసాగింది.
1047 - 58 మధ్య కాలంలో వచ్చిన రచన లలో పద్య రూపం ఎన్నుకున్నా తర్వాతి కాలంలో గేయం, వచన కవిత్వం దీర్ఘ వచన కవితా మార్గాల లోకి ప్రయాణించాడు. తొలినాళ్ళలో అభ్యుదయ ప్రగతిశీల దృష్టితో కవితా రచన చేసినాడు.
ఎవరు ఏడవగలరు
మరొకడికోసం
నీ కోసం ఏడ్చేవాడికి
నీవు ఋణగ్రస్తుడివి
మార్క్సుకు ఈ శతాబ్దపు
అన్నార్తులందరూ ఋణగ్రస్తులు అంటూ 'మార్క్సు'ని గురించి చెప్పినా, మృత్యుంజయుడు అనే కార్యకర్తను పోలీసులు చంపినప్పుడు రాసి 'మృత్యుంజయుడు' కవితలు కొంత కమ్యూనిస్టు భావాలను అభ్యుదయ నిమగతను చూపుతాయి. అయితే రాజకీయాల ప్రాబల్యం నుంచి కవితా జగత్తును విముక్తం చేసే వైజ్ఞానిక నాయకత్వం శేషేంద్రది. అచ్చమైన కవితా స్పృహతో ఆధునిక కావ్య భాషను సృష్టించి, ప్రాశ్చాత్య వాజ్మయంలోని ఇతిహాస ప్రక్రియలను అధ్యయనం చేసి అవగా హనతో వాటిని ఆధునిక ప్రక్రియలుగా పునర్నిర్మిం చడం, కొత్త భావ చిత్రాలు, ప్రతీకలను ఆధునిక తెలుగు వచన కవిత్వానికి అందించిన వారు శేషేంద్ర. ఈ స్థితిలో వచన కవిత్వంలో శేషేంద్ర మార్గం ప్రత్యేకంగా గుర్తించదగింది, నిరూపించ దగిందిగా మారింది. శేషేంద్ర ఋతుఘోష (1963) విశిష్టమైన ఋతుకావ్యం. శేషేంద్ర పద్య విద్యకు తలమానికమైన రచన ఋతుఘోష.
శేష జ్యోత్స్న (1972) దిద్య ప్రేమానుభవం కోసం 'పక్షులు'లో పరితపిస్తే ప్రేమ సాఫల్యా నుభూతిని వ్యక్తికరించిన, వచన కవితా ప్రస్థానానికి నాందియైన రచన శేషజ్యోత్స్న. అయితే గేయ ఛాయలు పూర్తిగా వీడని స్థితి ఈ రచనలో గమనించవచ్చు.
మండే సూర్యుడు (1974) నాదేశం నా ప్రజలు (1975), గొరిల్లా (1977) విప్లవ కవితా మార్గంలో నడిచినవి. వర్గ చైతన్యం - కళాత్మక అభివ్యక్తి కలిసిన ఈ రచనలలో మండే సూర్యుడిలో సూర్యుడు శ్రామికుడికి సంకేతం. కర్షకుడు కేంద్రమైన రచన నా దేశం నా ప్రజలు. ఇది శ్రామిక జీవిత సంఘర్షణ. ఎంత ప్రాచీనమో అంత అధు నికం అని బోధిస్తుంది ఈ 8 సర్గల కావ్యం నాదేశం - నా ప్రజలు. మనుషులు తమ జీవితంలో స్వీయ పరిశ్రమలో చేసిన ప్రయత్నం, సంపాదించిన విజ్ఞానం జాగ్రత్ చైతన్యంతో కూడింది. అందుకు భిన్నంగా మానవాత్మ చేసిన ప్రస్థాన ఫలితాలను స్మృతులనూ అంతర్ముఖీనంగా వ్యాఖ్యానించిన సంకే తాత్మక దీర్ఘ కవిత నీరై పారిపోయింది (1976). అన్యాయం అక్రమాల మీద తిరుగుబాటు చేసే క్రోథానికి దేహశక్తికి ప్రతీకగా నిలిచిన కావ్యం గొరిల్లా. గొరిల్లా శక్తితో పీడితుడు విజృంభించి కర్మ వీరుడుగా నిలబడాలనేది ఈ కావ్య సారం.
ఇలా ఏ కావ్యానికావ్యంగా ఉన్న ఈ రచన లన్నీ పర్వాలుగా విభజించి, రూపొందించి ఆధునిక మహా భారతంగా మలిచారు. అరుస్తున్న ఆద్మీ అన్న చిన్న కవితలు ఆద్మీ పర్వంగా మారితే, శేష జ్యోత్స్న - జ్యోత్స్న పర్వంగా, నా దేశం నా ప్రజలు - ప్రజా పర్వంగా, మండే సూర్యుడు - సూర్య పర్వంగా, సముద్రం నా పేరుమ సముద్ర పర్వంగా ఇలా రూపొందాయి. ఇలా మారడానికి గల కారణాన్ని శేషేంద్ర తన అవతారికలో ప్రస్తావించారు. ''కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి. ప్రవహి స్తున్న ఒకే జీవితం జీవిస్తాడు. అలాగే కావ్యం కూడా రాస్తాడు. జీవితయం ఒక యాత్రం. యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దాని అర్థాంతరమే కవి కావ్య యాత్ర. అనేక కృతుల సాము దాయిక స్వరూపం. అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు. అయితే దాన్ని అప్పుడప్పుడూ క్రమంగా రాస్తూ ఉంటాడు. అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పూర్ణకృతి కోసం పుట్టే ఒక్కో పర్వం. కావ్య యాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలూ కలిపి ఒక్కకావ్యం మాత్రమే అవుతుంది'' అన్నారు. రామాయణానికి ఉత్తర కాండలా, మహా భారతానికి హరివంశంలా ఆధునిక మహా భారతా నికి పర్యాంత గద్యజన వంశమన్న అనుబంధ కావ్యం.
కవిత్వం పరమార్థం గురించి కవులతో పాటు, అలంకారికులు, తాత్వికులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆలోచనను చెప్పారు శేషేంద్ర.
ఒక అందమైన పోయో అంటే
దానికి ఒక గుండె కావాలి
అది కన్నీళ్లు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి
పీడితుల పక్షం అవలంబించి
మనిషి ఋణం తీర్చుకోవాలి అని కవితా ప్రయోజనాన్ని చెప్పి 'ఈ దేశానికి నాగలి ప్రతీక' అని ఆధునిక యుగానికి కర్షకుడే నాయకుడని బోధించిన, శ్రమైక జీవనస్థితి ఆధునిక యుగ చైతన్యమని తీర్పునిచ్చిన, బహిర్జగత్తులోని అనుభవాలే అనుభూతి ప్రపంచంలోకి వెళ్ళి కళగా వ్యక్తమౌతాయని నిరూపించిన కవి శేషేంద్ర.
- సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి