Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జై! జై! జై! తెలంగాణ
జయహౌ నవతెలంగాణ
ఉద్యమాల చరిత్రలో
ఉదయించిన తెలంగాణ!
కొందరికే నష్టమాయె
కొందరికే కష్టమాయె
తెలంగాణ రావడము
అందరికీ ఇష్టమాయె!
కష్టాలు తీరలేదు
కన్నీళ్లు ఆగలేదు
రాష్ట్రమొచ్చినా కూడా
కలుషమతి తగ్గలేదు!
రాజకీయ మెక్కువాయె
దోచుకొనడ మెక్కువాయె
తెలంగాణలోన నేడు
నిరుద్యోగ మెక్కువాయె!
పట్టపగలె చీకటాయె
భయభ్రాంతు లధికమాయె
ప్రశ్నలు చిగురించకుండ
పురిటిలోనె చిదుముడాయె!
నాయకులకు జీతాలు
పెరిగెను లక్షలు, వేలు
ఉద్యోగుల పరిస్థితి
ఉన్నకాడికే చాలు!!
అమరులైన వీరులు
కన్న కలల దారులు
తెలంగాణ రాగానే
మూసినారు చోరులు!
అనుకున్నది వొక్కటి
అయ్యింది మరొక్కటి
రాష్ట్రోద్యమ కారులకు
మిగిలెను చిప్పొక్కటి!
కంపు రాజకీయంబును
కడిగితెనే న్యాయమగును
అప్పుడే ఎదురొచ్చిన
అడ్డంకులు దూరమగును!
స్వార్థమింత వీడినను
పరులహితం పెరిగినను
నిరాశలో మునిగినట్టి
జనులమోములు వెలుగును!
''ప్రలోభాలు'' తగ్గాలి
''నోటుకోటు'' పోవాలి
రామరాజ్య పాలనకై
అందరు యోచించాలి!
- వడిచర్ల సత్యం
సెల్: 7989511543