Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలి కిరణాలు కవన సంపుటి కొత్త పాతల మేలుకలయికతో వెలుగులు పంచింది. 158 మంది కవుల, కవయిత్రుల కవితలతో ఈ సంకలనం వినూత్నంగా ఉంది. ఇందులో లబ్ధ ప్రతిష్టులైన కవులతో పాటు ఇప్పడిప్పడే కవిత్వం ప్రారంభించిన యువ కలాలతో ఈ కవిత సంపుటి నిండుతన్నాని సంతరించుకుంది. కర్నూలు - హైదరాబాద్ కేంద్రాలుగా పని చేస్తున్న ఉదయ సాహితీ వేదిక కృషి అభినందనీయం. తన ముందు మాటాలో ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి అన్నట్టు ''ఉద్వేగ సృజనలు - తొలి కిరణాల్లో పాఠకుల్ని అలరించి ఎన్నో మంచి కవితలు వున్నాయని'' అన్నారు. వస్తు ప్రాధాన్యత గల కవితలు ఈ సంపుటి చాలా వున్నాయి. అందులో కొన్ని...
కరోనా కాలంలో ''మృత్యువును బెదిరించడం, ఎదిరించడం నేర్చుకోమన్నది'' అంటారు పోలయ్య కవి. (పేజీ.2). నువ్వు నేను అంటూ సంభాషణ రూప కవితలను తాత్త్విక చింతనతో కోడిగూటి తిరుపతి ''కాలమే తేల్చేది'' అనే కవితలో ఒక చోట ఇలా రాసారు.
''ప్రాప్తానికి వదిలేయాలని నువ్వు
పట్టుదలతో సాధించాలని నేను
ఏదోలా గెలవాలని నువ్వు
ధర్మబద్ధ ఓటమైన గెలుపేనని నేను'' (పేజీ.3) అంటూ.. ఫలితాన్ని కాలానికే వదిలి వేశారు. ''అవును - నల్లని ఆకాశం - ఇంకేదో చెబుతోంది! అజ్ఞానపు చీకటి బతుకుల్లో ప్రతి కలం కాంతి పుంజమవ్వాలంటూ...'' ఆకాశం కవితలో (పేజీ.7). చక్కటి భావుకత గల కవిత రాసారు అశోక్ గుంటుక.. కొన్ని కవితల్లో మానవతావాదం, స్వేచ్ఛా ప్రబోధిస్తాయి.
''నా దాహార్తిని ఎన్ని ఎండమావులు లెక్కిరించినా /
సమానత్వపు ఒయాసిస్సుల కోసం నిత్వాన్వేషినై
అన్వేషినై అన్వేషిస్తా!
డొక్క డప్పు మెడలో వేసుకొని
దండోరా వేసే బాటసారిని నేను'' (పేజీ.10)
అంటారు అనంతోజు మోహన్‌కృష్ణ...
'రంగమెక్కి' సస్యశ్యామల భవిష్యతు / అందరూ అడుగంగ అడుగంగ వారినట్లే చెప్తది' అంటారు కందాళై రాఘవాచార్య. తన 'మొగులుకు తల ఎత్తిన బోనం' అనే కవితలో (పేజీ 21). ''పారవశ్యం ఛాయలో ముఖ తెరపై మెరియాలి'' అంటారు చలివేంద్రం (పేజీ. 24) కవితలో డా|| కె. దివాకరాచారి. ఈ కవితా సంపుటికి ఎంతో నిండుతనం ఇచ్చే ముఖ్యాంశం ప్రముఖ కవుల కవిత్వాల్లో ముఖ్య వాక్యాలు ప్రచురించడం చాలా బాగుంది.
''శ్రవణ కుమార చరితం / అయ్యింది నేడు చెవిటి వాని ముందు ఊదే శంఖం'' (పేజీ. 49) అంటారు ఉల్లిపొరలు కవితలో దీకొండ చంద్రకళ.
''వేలు వసంతాల అమృతమయం నా మాతృభాష
కావాలి నిత్య వసంతాల విశ్వభాష - నా మాతృభాష
కాకూడదెన్నటికీ మృత భాష - నా మాతృభాష'' (పేజీ. 61) అంటూ మాతృభాషపై చక్కటి కవిత రాసారు తాతోలు దుర్గాచారి.
''అబలవు కావు అతివవు నీవు
ఆకాశాన్ని అందుకునే రెక్కల శక్తివి..
నిశ్శబ్ధ తరంగానివై ఎగిసి పడు
దూకి సాగిపో మున్ముందుకు'' (పేజీ. 62) అంటారు డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి తన కవితలో. మహౌన్నతం మన సంస్కృతి (పేజీ. 97) కవిత చక్కటి వ్యాస కవిత. 'దీపం జ్యోతి పరబ్రహ్మ'లో ఆరు చక్కటి ఆట వెలదుల్లో (పేజీ. 100) పద్యాలు రాసారు శ్రీధర్ కొమ్మోజు.
'తన రక్తాన్ని పాలుగా మార్చి
పెంచి పెద్ద చేసింది- 'అమ్మే నాకు ఆదర్శం' (పేజీ. 112) అంటారు జవేరియా..
ప్రజా కవులకు పదవుల ఆశ చూపక / ప్రజల కోసం రాయనిస్తే.. దీపావళి అంటారు (పేజీ. 120) వడ్డేపల్లి మల్లేశం.
'నాన్న నిక్కచ్చిగా నిర్ధనుడే కావచ్చు గానీ / నల్గురు మెచ్చి కీర్తించెడి ఘనుడాయన' ఆస్తులు సంపాదించి పెడ్తే ఆత్మీయత కోల్పోయేవాడు' (పేజీ. 139) అంటూ నాన్న గురించి చక్కటి కవిత రాశారు కన్నోజు లక్ష్మీకాంతం.
''యాడినించో / బత్కనీకొచ్చి నోళ్ళకింత / అన్నం పెట్టి బక్కనివ్వడం / బత్కునివ్వడం'' అంటారు అవ్వ చేతి బువ్వ కవిత (పేజీ. 140)లో వి.పి. చందన్రావు.
'చివరి అంకం మొదలు కాగానే
రంగస్థలం కుప్పకూలింది
నరుని నాటకానికి తెరపడింది' అంటారు మనిషి నాటకం (పేజీ. 152) కవితలో డా.ఉదారి నారాయణ.
ఇది జాతీయ కవన సంకలనం అనడం అక్షర సత్యం. ఉభయ తెలుగు రాష్ట్రాలనుండే కాక ఇతర రాష్ట్రాలతోపాటు దుబారు నుండి కవులు, కవయిత్రులు రాసిన కవితలున్నాయి. 'ఏమి జన్మ యేమి జన్మ మానుషజన్మ' (పేజీ. 12) అనే పాట కట్ట శ్రీనివాసాచార్యులు (చెన్నూరు) పాట బాగుంది. చాలా మంది కవులు, కవయిత్రులు చాలా కవితల్లో వస్తు ప్రాధాన్యతకే ప్రాముఖ్యత ఇచ్చారు. కవిత్వంలో కొంచెం శిల్పంపై దృష్టి పెట్టాలి. మెట్రో ఉదయం, చట్టం పత్రిక, ఉదయ సాహితీ వేదికల సంయుక్త కృషి అభినందనీయం. కొండ రవీందర్ కృషి ప్రశంసనీయం. వర్తమాన తెలుగు కవుల భావ స్పందనలే ఈ ''తొలి కిరణాలు'' మంచి ప్రయత్నం.
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472