Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం పగబట్టి రేపన్నది లేకుండా భవిష్యత్తును మింగేస్తోంది
ప్రతిరోజు రాహువు మింగిన సూర్యుడే ఉదయిస్తున్నాడు
రోజంతా చీకట్లు కమ్మిన అమావాస్యలా తలపోస్తోంది
రాత్రి పగలు తేడా లేకుండా రోజులు
దొర్లిపోతున్నాయి
గడియారంలో ముళ్ళన్నీ ఒకే వేగంతో పరిగెడుతున్నాయి
గడియారపు శబ్దం తప్ప గుండె చప్పట్లు వినపడటం లేదు
నిశ్శబ్దపు క్షణాలతోనే కాలమంతా సాగిపోతోంది
నిద్రరాని రాత్రులతోనే జీవితమంతా గడిచిపోతోంది
ప్రతిక్షణం అచ్చు బొమ్మలా తయారవుతోంది జీవితం
అనుక్షణం ఉచ్ఛ్వాసనిశ్వాసలను గమనించటంతోనే సరిపోతుంది
ఏ క్షణం ఊపిరిలు ఆగిపోతాయో అర్థం కాకుండా ఉంది
చావు నిరీక్షణలతోనే ప్రతిరోజు తెల్లవారిపోతుంది
భవిష్యత్తు గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది
గతాన్ని తెలుసుకోవటంతోనే వర్తమానం గడిచిపోతోంది
క్షణం ఒక యుగంగా కాలం ముందుకు సాగుతోంది
నిమిషాల లెక్కన ఆయుష్షును లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది
గ్రహాలన్నీ మత్యు కౌగిలిలో బందీలు అయినట్టు ఉన్నాయి
అందరి జాతకాల్లో యమగండలే కనిపిస్తున్నాయి
నూరేళ్ళ జీవితాలు మూన్నాళ్ళ తోనే ముగుస్తున్నాయి
ముందు వెనక అనే తేడాలేకుండా కలిసి కన్నుమూస్తున్నారు
- ఎదర శ్రీనివాస రెడ్డి