Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రెండేళ్ళ కరోనా సంక్షోభ కాలంలో సోషల్ మీడియా వాడకం విస్తతంగా పెరిగింది. కరోనా ముందు వరకు సోషల్ మీడియా విద్యావంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. దేశంలో ఇంటర్నెట్ సేవలు, స్మార్ట్‌ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా విప్లవానికి ప్రధాన కారణం. విశాల ప్రజారాసులను చేరుకోగలిగే శక్తి పాటకు మొదటి నుంచీ ఉంది. ఈ శక్తికి సోషల్ మీడియా తోడైంది. మరీ ముఖ్యంగా యూసర్ ఫ్రీ అప్లికేషన్స్ సష్టింపబడటం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావలసిన సాంకేతిక ఉపకరణాల సష్టి విస్తతంగా జరుగుతోంది. కనుక, ఈ ఐదేళ్ళ కాలంలో పఠనానికంటే, శ్రవణానికే ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. పఠనంలో కంటే శ్రవణంలో సౌలభ్యం, సౌఖ్యం రెండూ ఎక్కువే. కనుక పాటవంటి సజన సంబంధమైనవి మాత్రమే కాకుండా విజ్ఞాన సంబంధ విషయాలను నేర్చుకోవడంలో కూడా వినటానికే యువతరం మొగ్గుచూపుతోంది. చూపు మందగించి, శరీరం సహకరించని వద్ధతరం కూడా వినటానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కొంతమంది కవులు తమ కవిత్వాన్ని ఆడియో/ వీడియోలుగా మార్చి ప్రచారంలోకి తీసుకొస్తున్న పద్ధతులను చూస్తున్నాం. మేధావులు, విషయ నిపుణులు కూడా సమకాలీన సందర్భాలను ఎప్పటికప్పుడు దశ్య, శ్రవణ (ఆడియో విసువల్) రూపంలో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుండటాన్ని గమనిస్తే, ఈ పరిణామం ఎంత త్వరిత గతిన జరుగుతుందో మరింత స్పష్టమవుతుంది. మొత్తంగా శ్రవణ సంప్రదాయం క్రమంగా పెరుగు తోందని చెప్పవచ్చు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వద్ధి చెందుతుంది. ఈ పెనుమార్పే ప్రజలు పాటను మరింత ఆదరిండానికి కారణమైంది.
ఈ సందర్భంలో ఉద్వేగాలను, ఉద్యమాలను కలుపుకొన్న పాట క్రమంగా విస్తరిస్తోంది. పుట్టుకలోనే శ్రవణ లక్షణాన్ని కలిగిన పాట భవిష్యత్తులో మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చు కున్న పాట తన సాంప్రదాయిక వ్యక్తీకరణలను దాటుకొని స్వేచ్ఛావిహంగంలా ప్రతి ఇంట్లోకి, కంట్లోకి ప్రవహిం చింది. ఈ కాలంలో పాట మరోసారి తన రెండంచుల పదునును ప్రదర్శిస్తూ వస్తోంది. మానసిక ఉల్లాసాన్ని కలిగించడంలోనూ, సామాజిక ఉప్పెనలను సష్టించడం లోనూ పాట తన శక్తిని, ప్రత్యేకతను చారిత్రకంగా చాటుతూనే వస్తోంది. పాటకు ప్రాణం లయ, గమకాలు. ఇక్కడ పాట అనే మాట శాస్త్రీయ సంగీతంనుంచి, సినిమా నుంచి విడివడిన దేశితనపు సొగసు గుబాళి స్తున్న రాగ, తాళాల సందర్భంలో వాడబడింది. ఈ లయాత్మకతకు వాస్తవికత, భావుకత తోడైతే, ఆ సృజనను, సృజనకారున్ని ఎవరూ ఆపలేరు. పాటలో 'దమ్ము' ఉంటే ఏ సంగీత పరికర సంపత్తి అవసరంలేదు. ఆధునికమైన ఇతర మెరుగులు అక్కరలేకుండానే సోషల్ మీడియా వాహకంగా పాట ప్రజల్లోకి దూసుకు పోతుంది. ఈ సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ కేంద్రంగా తమలో దాగి ఉన్న సృజనాత్మకతకు రెక్కలు తొడిగే ఒక మహత్తర అవ కాశం సామాన్య ప్రజానికానికి కూడా రావడం మంచి పరిణామం.
సోషల్ మీడియా- ఫేస్బుక్ కేంద్రంగా తెలుగు సాహిత్యం విస్తతంగా వెలువడుతోంది. సహజంగా కవిత్వానికుండే వెసులు బాటు వల్ల, మిగతా సాహిత్య ప్రక్రియలతో పోల్చినప్పుడు కవిత్వం రాశిలో ఎక్కువగానే ఉంది. తరువాతి స్థానం పాటది. కవిత్వానికి పాఠకులుంటారు. పాటకు శ్రోతలుం టారు. కవిత్వానికి ఉండే పాఠకు ల్లోనూ, మరలా తరతమ స్థాయిలుం టాయి. కానీ జీవగంజిని గూర్చి పాడే నోటిపాటకు ఆ పరిమి తులేవీ లేవని నిరూపించింది సోషల్ మీడియా. కవిత్వం విస్తతంగా వెలువడినా అది అక్షరాలకే పరిమితమై పోయింది. కానీ, పాట ప్రజల గుండెల్లోకి దూసుకు పోయింది. ఇందుకు ప్రత్యక్ష సాక్షం ప్రముఖ గేయ రచయిత ఆదేశ్ రవి రాసి, పాడిన ''ఏమీ బతుకు ఏమీ బతుకు...'' పాట. ఇది కరోనా కాలపు వలస కార్మికుల వెతలకు గొంతుకనిచ్చిన పాట. అన్ని రంగాల ప్రజలను కదిలించిన పాట. వలస కార్మికుల కన్నీళ్ళను ప్రజల గుండెల్లోకి పారించిన పాట. వారి కష్టాలను మొదటి సారిగా బహుళవ్యాప్తిలోకి తెచ్చి, చర్చకు పెట్టిన పాట. కనుక, సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచార మైంది. ఈ పాట ఇచ్చిన ప్రేరణతో తెలుగు కవిత్వం వలస కార్మికులపై చాలా ఎక్కువగా స్పందించింది. ఆదేశ్ పాట రావడానికి ముందు కరోనా జాగ్రత్తలు, క్వారంటైన్ ప్రాధాన్యత, దేవుడి అస్తిత్వం, మనిషి మనుగడ, సాధించిన అభివద్ధి చుట్టూ తిరుగాడుతున్న తెలుగు కవిత్వ దష్టిని ఒక్కసారిగా వలస కార్మికుల కష్టాలవైపు మళ్ళించిన ఘనత ఆదేశ్ రవి పాట సొంతం. సోషల్ మీడియాను సజనాత్మకంగా వాడుకున్న ఏ పాట అయినా ప్రజల్లోకి చొచ్చుకుపోతుందని చెప్పటానికి మరొక ఉదాహరణ-చౌరస్తా బ్రాండ్ నుంచి వెలువడిన ''చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలుపకురా/ కాలు గూడ మొక్కుత అడుగు బయటవెట్టకురా'' పాట. జీర గొంతుతో గాయకుడు రవి పాడిన ఈ పాట చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఏ స్మార్ట్పోన్లో చూసినా ఇదే పాట మారు మోగింది. కరోనా కాలంలో వలస వెతలను పలవరించడంతో పాటు కరోనా బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేయడంలో పై రెండు పాటలు ఎంతో ప్రభావాన్ని వేసాయి. మానవత్వాన్ని తట్టిలేపింది ఒక పాట అయితే, జాగ్రత్తలను పాటించమని సున్నితం గా హెచ్చరించింది మరో పాట. ఇదంతా సోషల్ మీడియా సాధిం చిన ఘనతగానే చెప్పుకోవాలి.
వ్యక్తులను, సాంస్కృతిక విషయాలను, ప్రత్యేక రోజులను, సామూహిక ఉద్యమాలను, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను పురస్కరిం చుకొని పాటలను రాయడమనేది సోషల్ మీడియా సష్టించిన సరికొత్త ట్రెండ్. అంతేకాకుండా సార్వజనీన మైన విలువలపై పాటలు రాసి, పాడటం అనేది సోషల్ మీడియా కేంద్రంగా పుట్టుకొచ్చిన మరొక సెట్. జానపదాలకు వినూత్న సొగసులు అద్దడం, సినిమా పాటకు సమాంతరంగా ప్రైవేట్ ఆల్బమ్‌లు రూపుదిద్దు కోవడం ఇలా చెప్పుకుంటూపోతే సోషల్ మీడియాలో పాటకు అనర్హమైన వస్తువు ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా కేవలం సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్, వాట్సాప్‌లు సష్టించిన ప్రభంజనమేనంటే ఒప్పుకోవలసిందే.
యూట్యూబ్ వేదికగా స్టార్ సంగీత దర్శకులు పురుడుపోసుకున్నారు. సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చరణ్ అర్జున్ లాంటి ఎందరికో సోషల్ మీడియా అనేక అవకాశాలు కల్పించింది. ఈయన ''గుండు దారం మెట్న నీ ఆస్తి/ గుండెలో గాయాలే నీ దోస్తీ'' అంటూ ఒక సాధారణ తాపీమేస్త్రీ జీవితాన్ని 'పెద్దమేస్త్రీ' పాటగా ఆవిష్కరించాడు. ''డ్రైవర్ మల్లన్న'' పాటలో లారీ డ్రైవర్ల వెతలను చూపించాడు. ''పాటమ్మతోనే ప్రాణం నాది సదువూలమ్మరా'' అంటూ రాగమెత్తిన రాంబాబు లాంటి సామాన్య వ్యక్తుల దుఃఖ ఘోషకు సోషల్ మీడియా వేదికైంది. ఈ పాట ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించు కుందంటే ప్రజల్లో సోషల్ మీడియా వేస్తోన్న ప్రభావం గణాంకాలకు అందనిది. దసరా, దీపావళి, శ్రీరామ నవమివంటి పండుగలతో పాటు, బోనాలు, బతుకమ్మ వంటి జనబాహుళ్య ఆచరణ కలిగిన పండుగలపై ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో పాటలు పుట్టుకొస్తున్నాయి. ఆ కోవలో భాను రాసిన ''ధన ధన దరువులతో/ జమిడికల మోతలతో/ పోతరాజు ఆటలతో/ శివసత్తుల అరుపులతో...'' పాటను యూట్యూబ్ స్టార్ సింగర్ శంకర్ బాబు తన గొంతులో పలికించి బోనాల పండుగను మరింత హౌరెత్తించాడు. ''కన్నీటి ధార, కంట జార, ఆనాడు లేనీ, కన్నీళ్ళు నేడా/ ఉరికొయ్యల కోత, కష్టాల ఈత, దయలేని దేవుడు రాసిన రాత'' అంటూ దిలీప్ దేవ్ గన్ రాసి, పాడిన పాట నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి చలించి, సంఘీభావాన్ని ప్రకటించిన పాట. గుండెను బరువెక్కించిన పాట. తిండి గింజల్ని పండిస్తున్న రైతుకు మద్దతును కూడగట్టిన పాట. బీమ్ రాసిన ''ఎల్లిపోతావురా మనిషీ/ ఏదో ఏనాడో ఈ భూమి వదిలేసి'' పాటను స్వాతిరెడ్డి ఆలపించారు. ఇది సార్వజనీన, సార్వకాలిక సత్యాన్ని ఆవిష్కరించిన పాట. ఈ భూమి మీద మనిషి ఒక అతిథి మాత్రమే అనే శాశ్వత సత్యాన్ని ఎత్తి చూపించిన పాట. సోషల్ మీడియా చేసిన మరొక అద్భుత పని- జానపద బాణీలో రాసిన పాటలకు వేదికవడం. విషయపరంగా ఈ పాటలు నిజమైన జానపద గీతాలను అనుసరించినా, వ్యక్తీకరణ, బాణీల పరంగా ఇవన్నీ జానపదాల ఆత్మకు దూరంగా ఉండేవే. భార్యాభర్తల మధ్య సరసాన్ని ఆవిష్కరించిన ''సిట్టా పట్టా సినుకులకు యాడదిన్నవో రాతిరి/ నువ్ యాడవన్నవో రాతిరి'' పాటా, ప్రేయసీ ప్రేమికుల మధ్యగల ఐక్యతను ప్రదర్శించిన ''నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడి నెమిలి ఆటలాకు గంగదారి'' మొదలైన పాటల ధాటి సినిమా రంగాన్ని మించిపోయింది. ఇది ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. అర్ధదశాబ్దికాలంగా వస్తోన్న ఇటువంటి పాటల ప్రభావాన్ని తట్టుకోలేక సినిమాల్లోనూ జానపద బాణీల్లో ఉండే పాటలను రాయించుకోవడం దీనికి నిదర్శనం. ఇప్పుడు సినిమాల్లో ఇదొక అనివార్యమైన ట్రెండ్.
పాటతో ముడిపడి ఉన్న ఎంతో మంది గేయ రచయితల్ని, గాయకులను, సంగీతకారులను, నత్య కారులను సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రతిభకలవారందరూ యూట్యూబ్ స్టార్లుగా మారిపోయిన సంగతి కూడా మనకు తెలుసు. ఎవరూ ఎవరికీ పోటీలేని ఒక ఆహ్లాదకర సందర్భాన్ని సోషల్ మీడియా సష్టించింది. అయితే, సోషల్ మీడియా ఇతర ప్రక్రియల రూపంలో నిమ్నస్థాయి సాహిత్యానికి వేదిక అయినా ఆ మలినమేదీ తెలుగు పాటకు అంతగా అంటక పోవడం చాలా ఆశ్చర్యం. ఇప్పటికీ చంద్రకాంత శిలలవలె స్వచ్ఛంగా ప్రవహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ పాటల ప్రవాహం సామాజిక మలినాలను కడిగేయాలని ఆశిద్దాం.
- డా. చంద్రయ్య ఎస్, 9963709032
రీసెర్చ్ అసోసియేట్ ఫెలో,CESCET