Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. ఆశ్చర్యంగా అతను అన్నాడు
''ఇప్పటిదాకా ఈ లోకంలో
నీకు పసందైన పువ్వు ఒక్కటీ తారస పడలేదా?''
ఇదొక పెద్ద పూల తోట
ఊహ తెలియని కాలం నుండి
నేను ఈ తోటలో సంచరిస్తూనే ఉన్నా!
కాలిబాటకు ఇరుపక్కలా
రంగురంగుల పూలు
వింతవింత పూలు
రకరకాల ఆకారాల్లో నిగనిగలాడుతున్న పూలు
కొన్ని గాలిలోకి తలెగరేస్తాయి
కొన్ని చెట్టు కాండాన్ని అల్లుకుని ఉంటాయి
కొన్ని తీగలాగా ఎదిగి పారాడుతూ ఉంటాయి
కొన్ని ఆకుల కొసలే పూవులుగా రూపాంతరిస్తాయి!
ఇంకొన్ని పూలు
విచ్చిన రేకుల నిగారింపుతో
విడివడిన రెక్కలపైని వర్ణాల గుబాళింపుతో
ఇంద్ర ధనుస్సు శోభలతో
వర్ణ, వివర్ణ, సవర్ణ మెరుపులతో తేజరిల్లుతూ ....
అయినా నాకే పువ్వూ పసందు కాలేదు!
2. బిత్తర పోతూ అతను అన్నాడు -
''పువ్వులను, పక్షులను, పాటలను, ప్రాణాన్ని
ప్రేమించని మనిషి ఉండడు గాక ఉండడు''!
అవునేమో,
ఈ పూలదారుల గుండా నడిస్తే చాలు-
గాలి అంతటా పరిమళాన్ని నింపేస్తాయి !
నాసికా రంధ్రాల నుండి గుండెలోకి దూరి
కళ్ళను ఆ వైపుగా తిప్పేలా చేస్తాయి !
తోటలోని దిబ్బల మీదుగా వెళ్తే చాలు-
కొన్ని పూలు లేత తనపు సున్నితత్వాన్ని వెదజల్లి
కిరణాలతో దోబూచులాడుతూ
చేతులతో స్పశించాలనేంతగా ఆకర్షిస్తాయి!
అయితే ఇన్నాళ్ళ నుండీ ఈ తోటలోనే తిరుగుతున్నా
ఇన్నేళ్ల నుండి ఈ దారి గుండానే వెళ్తున్నా
ఏ ఒక్క పువ్వూ నన్ను ఆకట్టుకోలేదు
ఏ పూరేకూ నన్ను క్షణకాలం ఆపలేదు!
తోట అంతటా తిరుగుతూనే ఉన్నా
నాకు నచ్చిన పువ్వు ఒక్కటీ ఎదురవలేదు
నేను మెచ్చిన పువ్వు ఒక్కటీ తారసపడలేదు !
అందుకే పూల తోట వైపు నడకలు ఆపేసి
తోట బాటనే మరిచిపోయా!
3. ఇక నిస్పహగా అతను శపించాడుు
''పువ్వులనే విస్మరించావు కదా
ఒక్క పువ్వు కోసం
నువ్వు పరితపించే క్షణం ఒకటి వచ్చు గాక''!
నవ్వుకున్న నేను
మౌనంగా ధ్యానంలో మునిగిపోయి
ఏకాంత తపస్సులో కూరుకుపోయి
అనంత ఒంటరి దారుల్లోకి ఎగిరిపోయా ...!
ఈ రోజున అడవిలో నడుస్తూ
నది ఒడ్డున పచ్చిక బయలు వంక చూశా
మంచు బిందువులను ముత్యాలలా మోస్తూ
వాటి భారంతో
ఊగిసలాడుతున్న గడ్డిపరకలను చూశా
ఆ ముదురు పరకల నడుమన
కనిపించిందొక పువ్వు
అరుదైన ఆకారంతో
వింత వర్ణాలతో
తాజా పరిమళాల చిక్కదనంతో
వెలుగులీనుతూ ఉంది !
పెదవుల మధ్య ఆకాశమంత నవ్వును బంధించి
రంగులలో అగ్ని జ్వాలల తీవ్రతను పులుముకుని
తన చుట్టూ ఓ వరద గూడును అల్లుకుని
ఆకుల మధ్య దాగుడుమూతలాడుతూ
నా వంక బిడియంగా చూసింది !
నా కళ్ళు నిలిచి పోయి
నా కాళ్ళు నిశ్చలమై పోయాయి
నా ముఖం నిండా సూర్యతేజస్సు పొడసూపి
పువ్వు లోలోపలి అంతరాళాలలోకి
కాంతి వేగంతో చొచ్చుకుపోయింది
పూపాతాళంలోని చిరంతన తేనెలను
పైకి వెల్లువెత్తించింది!
అవును ఇన్నాళ్లకు-
నేను వెతుకుతున్న పువ్వు నాకు దొరికింది !
4. ఇప్పుడు అతను ఎలా స్పందిస్తాడో
నేను ఊహించ లేక పోతున్నా...
అతని శాపం నిజమైంది అంటాడా?
ఆ శాపం నాకు వరంగా మారింది అని అంటాడా?
మీరేమైనా చెప్పగలరా?
- మామిడి హరికష్ణ
సెల్: 8008005231