Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృదయాన్ని రంజింపచేయడమే కవిత్వ బాధ్యత. అప్పుడే రససిద్ది కలుగుతుందని అలంకారికుల భావన. కానీ కాలానుగుణంగా సామాజిక స్పృహ, వస్తు విస్తృతి పెరిగి అనేక కోణాల్లో కవిత్వం ఆవిష్కరించబడుతుంది. ఇది మంచి పరిణామమనే చెప్పవచ్చు.
కవి తనకు కలిగిన భావాలకు, ఉద్వేగాలకు, ఆలోచనలకు, సంఘర్షణలకు అక్షరరూపమిచ్చి పాఠకుడిలో ప్రవేశపెడతాడు. తద్వారా సామాజిక ప్రయోజనం కోసం తపిస్తాడు. ఇలాంటి కోవలోకే వస్తాడు నామా పురుషోత్తం. 45 కవితలతో తొలి పుస్తకం 'అంకురం' పేరుతో ప్రచురించాడు. ఈ పుస్తకం నిండా బడుగు జీవుల వెతలు, కార్మికుల, కర్షకుల వ్యథలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు. దాదాపుగా ప్రతి కవితలోనూ చైతన్య దీప్తి, కర్తవ్య బోధ అడుగడుగునా కన్పిస్తుంది. తన కవిత్వం ఎవరికి చేరాలో.. వారికి సూటిగా, సరళంగా అర్థమయ్యే భాషలోంచి చెప్పే ప్రయత్నం చేసాడు.
నామా పురుషోత్తం సున్నిత మనస్కుడు. మృదు స్వభావి. మంచి స్నేహశీలి. తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ రాస్తాడు. పాటల, కథల రచయితగా, గాయకునిగా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తూ అనేకమంది ప్రశంసలు పొందుతు న్నాడు. నిత్యం తారసపడే అనేక ఘటనలను జీర్ణించుకోలేక, నిద్రపట్టక... ఉద్వేగపడటం 'నిద్రెలా పడుతుంది' కవితలో ప్రస్ఫుటమౌతుంది. మూడు పుటలా / నాలుగు మెతుకుల్ని / పొట్టలో పోసుకోలేని అభాగ్యులను / నిత్యం దగ్గర్నుండీ / చూస్తున్న వాడిని../ నిద్రెలా పడుతుంది... అని మొదలుపెట్టి ఆదిమ సమాజంలో / పెద్దపులికి మనిషి ఆహారం / నవీనయుగంలో మనిషికి / మనిషే ఆహారం... / నిద్రెలా పడుతుంది... ఈ కవిత్వ పాదాల్లో కవి అంతర్మథనం కన్పిస్తుంది. అయినప్పటికి నిరాశలో కూరుకుపోకుండా... చివరలో ఊరే చెలిమిలోన నీటిలా / స్వచ్చంగుండే వ్యవస్థ రావాలి / అందుకు విరామమెరగక / పోరు సలుపుదాం.. / ఆపైన కునుకుతీద్దాం.. అంటూ పిలుపునిస్తూ సమాజాన్ని సంఘటితం చేసే కృషి గావించాడు.
అసమ సమాజం తొలగిపోయి.... సమసమాజం రావాలనే కాంక్ష కవిలో బలంగా వుంది. అందుకే 'సచ్చు బతుకులొద్దు' అనే కవితలో మా రాతలింతేనని చేతులు ముడుచుకు కూర్చొనే వారిపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ... వారిని ముందుకు నడిపించే ప్రయత్నం చేసాడు.
మరొక కవిత 'కల' చదువుతుంటే... 'కలలు కనండి... వాటిని నిజం చేసుకోండి' అన్న అబ్దుల్ కలాం మాటలు గుర్తుకొస్తాయి. ఈ కవిత ప్రారంభంలోనే రాత్రి నా నోరు కుట్టేసి / నిద్రకు పని చెప్పింది... సరికొత్త అభివ్యక్తి దర్శనమి స్తుంది. లక్ష్యంవైపే పయనం చేస్తే... / దారులన్నీ విజయ శిఖరాల వైపుకే... / ఇపుడు / నా కలని నిజం చేసే పనిలో వున్నాను.. అంటూ కర్తవ్య నిర్వహణకు పూనుకున్నట్లుగా ముగిస్తాడు. కలలు కనడమొక్కటే కాదు వాటిని సాకారం చేసుకున్నప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం లభిస్తుందని సత్యాన్ని వెలిబుచ్చాడు.
జర్నలిజం వృత్తిలో ఎన్ని ఆటంకాలు, అవరోధా లుంటాయో స్వయంగా అనుభవించినవాడు కనుక తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు 'జర్నలిస్ట్' కవితలో... ముక్కలు చెక్కలుగా చీలిన/సమాజం లో కొంతైనా/మార్పు తేలేనానంటూ కలంపట్టాను /జీతంకోసం, యజమాని ఆదేశం/కాదనలేక, అనుకున్నది రాయలేక /నిత్యం చస్తూ.. రాస్తూనే ఉన్నాను.
ఎన్నాళ్లిలా అనుకున్నది సాధించలేక / ఎంత కాలమిలా కలం కదపకుండా/ఎప్పటికైనా గెలు స్తాననే నమ్మకంతో/ప్రశ్నిస్తూనే ఉన్నాను/ మార్పు కు నాంది పలుకుతూ.. అంటూ గళమెత్తాడు.
ఈ పుస్తకలోని కవితలన్నింటికంటే విభిన్నంగా ఆవిష్కరించిన కవిత 'ప్రైజొచ్చింది నాకు'. దీనిలోని ప్రత్యేకత వ్యంగ్యం. కవిలోని అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యంగ్యాత్మకంగా వ్యక్తపరిచాడు. 'ప్రైజొ చ్చింది నాకు / పక్కవారిని ప్రేమించనందుకు / దయాగుణం దరి చేరనీయనందుకు / నేను పెద్ద నీవు చిన్న అని / తారతమ్యం చూపినందుకు / దళితుడు రాసిన రాజ్యాంగంలో/ లౌకిక పదమెం దుకని ప్రశ్నించినందుకు / నాకు ప్రైజొచ్చింది / మొదటి ప్రైజొచ్చింది' అంటూ ప్రస్తుత సమాజ దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు.
కోళ్ల కాళ్లకు గోళ్లున్నాయని / చెప్పనంతకాలం డేగలదే హవా... / మాతృమూర్తీ... / నీవు ఉద్యమించకుంటే / ప్రతి రోజూ ఆకృత్యమే... మహిళలను జాగృతం చేస్తాడు ఓ కవితలో.
పెదవి మీద కాకుండా హృదయంతో / సామ్యవాద మంత్రం చదివేవాడిని/ ఎంత ఎత్తునున్నా / నింగినంటుతున్నా / పునాదిని మర్చిపోనోడిని / బడుగు జీవుల బాధను పంచుకుంటూ / కొత్త వ్యవస్థకు హారతి పట్టేవాడిని / నేనెందుకు / ఓడిపోతాను... అంటూ అగ్గిరవ్వల్లా మండుతాడు.
రేపటి ఉదయానికి హారతి పడతాం... ''ఊరుకుంటామా''
అంటిపెట్టుకున్న అజ్ఞానాన్ని / అరువు తెచ్చుకున్న ఆడంబరాన్ని / వదిలేస్తే నీదే భవిష్యత్... ''నా 'మా' ట''
చెరుకుగడ వంకరున్నా / తీపిని మరువదు కదా ''వైకల్యం''
సమాజ శ్రేయస్సు లేని రచనలు / జ్ఞానమివ్వని సూక్తులు / వ్యర్థం.. వ్యర్థం... ''విజయం వారిదే''
మన గుడిశెకు నిప్పెట్టి / వాడు మిద్దెలో ఉంటే / సర్దుకుపోదామా? / నో... సమరం చేద్దాం.. ''సర్దుకుపోదామా?''
నాకో మెదడు కావాలి / అద్దెకివ్వడానికి... ''మెదడు కావాలి''
ఇలా ఈ కవిలో మెండైన భావావేశం వుంది. ఎర్రపూల తోటలో నిలబడి అక్షరాలను అగ్గి పిడుగుల్లా కురిపించాడు. పాఠకుల మెదళ్ళలో పోరాట స్ఫూర్తిని రగిలిస్తాడనడంలో సందేహం లేదు. సమాజంలో పెనుమార్పుకు శ్రీకారం చుట్ట బోతున్న ఈ 'అంకురం' పుస్తకాన్ని అందరూ చదవాలి. అందరి చేత చదివించాలి. అప్పుడే కవి ఆశయం నెరవేరుతుంది. ఉత్తమ కవిగా సాహిత్యలోకంలో నామా పురుషోత్తం ఎదగాలని, తప్పకుండా ఎదుగుతాడని ఆశిస్తూ శుభాకాంక్షలు, అభినందనలు పలుకుతున్నాను.
- రాచమళ్ళ ఉపేందర్,
సెల్: 9849277968