Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర నిర్మాణంలో ఆకరాలదే తొలిపాత్ర. అది సామాజిక చరిత్ర అయినా, సాహిత్య చరిత్ర అయినా మరొకటైనా సమగ్రమైన సమాచారం మీద ఆధారపడి నిర్మించినప్పుడే ఆ చరిత్ర రేపటి తరానికి దిక్సూచిగా ఉంటుంది. మన సాహిత్య చరిత్ర నిర్మాణంతొలి నుండి అలా జరిగిందే. అయితే అక్కడక్కడా కొన్ని అంశాలు పూర్తిస్థాయిలో నమోదుకాలేదేమో అనిపిస్తుంది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను చదివినప్పుడు వివిధ ఉద్యమాలు, సంస్థలు, వక్తులు ఇలా అనేక అంశాలు నమోదై సుసంపన్నం చేశాయి. కథ, కవిత్వం, విమర్శ, భావ కవిత్వం, విప్లవ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం, మేనార్టీవాద సాహిత్యం ఇలా అనేక విభాగాలుగా దానిని నమోదుచేసాం, చేస్తున్నాం.
అయితే ఈ క్రమంలో ఎందుకో బాల సాహిత్యాన్ని గురించి సమగ్రమైన నమోదుగానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశోధనలు గానీ జరగలేదనిపిస్తుంది. పంతొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళలోనే ఆంగ్ల విద్యా విధానం వల్ల, మిషనరీలు మరియు ఆనాటి పాఠ్యపుస్తకాల నిర్మాణ సంస్థల కృషివల్ల ఆధునిక బాల సాహిత్యం తెలుగులోకి వచ్చింది. అంతకు ముందే పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, వీరుల కథలు వంటివి అనేకం తెలుగులో ఉన్నాయి. ఇక భారత, భాగవతాది గ్రంథాల్లోని కథల గురించి, తెనాలి రామకృష్ణుని కథల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి ప్రధాన స్రవంతి అయిన బాలల సాహిత్యాన్ని గురించి మాట్లాడుకోక పోవడం ఒక రకంగా పెద్దలోటే. అడపా దడపా తొలి తరంలో విశ్వవిద్యాలయాల్లో జరిగిన డా. పి. సరస్వతి, డా. రజని, డా. కె. లక్ష్మీనారాయణరెడ్డి, డా.ఎం.కె. దేవకి, డా. కె. ధనలక్ష్మి, డా. వెలగా వెంకటప్పయ్య, డా.గంగిశెట్టి శివకుమార్, డా. వి. రత్నశేఖర్, డా. జి. సతీష్ కుమార్. డా. జె. వలర్మతి, డా. ఎస్. రవీంద్రబాబు, డా. కె. కుసుమకుమారి, డా.డి. నరసింహారావు, డా. రావెల శ్రీవివాసరావు, డా. కందేపి రాణీప్రసాద్, డా. జె. సుబ్బయ్య, డా. వాసరవేణి పర్శరాములు వంటి వారి పరిశోధనలు కొంతవరకు ఆ లోటును పూరించాయి.
ఇక బాల సాహిత్య సేకరణ, నమోదు విషయంలో మాత్రం ఇప్పటికీ మనం వెనకనే ఉన్నాం. నాకు తెలిసినంత వేరకు గతంలో దక్షిణ భారత అనువాద సంస్థ, డా. వెలగా వెంకటప్పయ్యలు ఆనాడు తమకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, సంస్థలు, గ్రంథాలయాలను సందర్శించి బాల సాహిత్య సూచిని తయారు చేశారు. మళ్ళీ ఇటీవల అంతకు మించిన స్థాయిలో డా. రావి శారద వేలాది పుస్తకాలతో 'బాల సాహిత్య సూచి' తయారుచేసి 2020లో అచ్చువేశారు. ఇటీవల జరిగిన బాల సాహిత్య సేకరణ, గ్రంథస్థం వంటివాటిలో ఇదే పెద్దది. రావి శారద తన శక్తిమేరకు వ్యయయ్రాసలకోచ్చి ఈ నిర్మాణాన్ని చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి జరిపిన తెలంగాణ 'సాహిత్య సూచి' నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని బాల సాహిత్యం నమోదయ్యింది. ఇది సంతోషించాల్సిన విషయం. ఇదే కోవలో గత దశాబ్దంన్నర కాలంగా మా సమూహం 'తెలంగాణ బాల సాహిత్య చరిత్ర' కోసం పనిచేస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది సాహితీవేత్తలు, ఎక్కడా నమోదు కానీ అనేక రచనలు కనిపించాయి. 1950-60 ప్రాంతంలో హైదరాబాదులో విశేషంగా కార్యశాలలు నిర్వహించి బాల సాహితీవేత్తలకు మార్గదర్శనం చేసిన 'బాలల రచనాలయం' వంటి సంస్థల వివరాలు కూడా ఇలాగే తెలిసాయి. తొలి తరంలో బాలల కోసం 'మా ఊరు' వంటి గేయ సంపుటాలు రాసిన గంగుల శాయిరెడ్డి, 1946లోనే పిల్లల కోసం రాసిన పొట్లపల్లి రామారావు, డా. గూడూరి రాఘవేంద్ర వంటివారి రచనలు అనేకం ఈ సేకరణలో భాగంగా మాకు కనిపించాయి. ఇంకా పరిశోధిస్తే మరికొంత మంది తెలుగు బాల సాహిత్యకారులు, సాహిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల్లోనూ లభిస్తుంది. 'మరల ఇదేల' అన్నట్టు నేను ఇదంతా రాయడానికి ప్రధానకారణం నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం ఇటీవల బాల సాహిత్యం విషయంలో జరిపిన ఒక 'విశిష్ట' అంతర్జాల కార్యక్రమం, చర్చాగోష్ఠి.
భాషా సాహిత్యాల అభివృద్ధి, విశేష గుర్తింపు వంటివాటి కోసం కేంద్ర ప్రభుత్వం 1500-2000 సంవత్సరాల విశేష సాహిత్య చరిత్ర, వారసత్వం, శాసన, లిఖిత వాజ్ఞయం వంటి పలు అంశాల ఆధారంగా పలు ప్రాచీన భాషలకు గుర్తింపును ప్రదానం చేసింది. కాగా 2004లో తమిళం, 2005లో సంస్కృతం, 2008లో తెలుగు, కన్నడ, 2013లో మలయాళం మరియు 2014 ఒడియా ఈ గుర్తింపును సాధించాయి. అనేక ఇబ్బందులను అధిగమించి కరీంనగర్ జిల్లాలోని జినవల్లభుని తొలి కంద శాసనం వంటి కొన్ని విశేష ఆకరాలవల్ల తెలుగుకు ఈ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు నేపథ్యంలోనే మైసూరు కేంద్రంగా కన్నడ, తెలుగు భాషల అధ్యయన కేంద్రాలు రూపుదిద్దుకోగా, ఇటీవల తెలుగు కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సమీపంలోని వెంకటాచలంలో ప్రారంభించబడి విధులు నిర్వహిస్తోంది. తన కార్యక్రమాలలో భాగంగా బోధన, పరిశోధన, దృశ్యీకరణ వంటి అనేక అంశాల్లో భాషా, సాహిత్య అధ్యయనాన్ని ఈ సంస్థ చేపట్టింది. తాళపత్రాల సేకరణ, పుస్తక ప్రచురణలతో పాటు తులనాత్మక అధ్యనం వంటి అనేక కోణాల్లో ఈ సంస్థ పనులు జరుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై ఒక సమగ్రమైన సేకరణ జరిపి తద్వారా భాషా సాహిత్యాలు మరింత సుసంపన్నం జరపాలన్న ఆలోచనలతో సంస్థ సంచాలకులు ఆచార్య ఎం.మునిరత్నం నాయుడు ఇటీవల ఒక బృహత్తర ప్రణాళికకు శ్రీకారంచుట్టారు. అందులో భాగంగా తెలుగు నేలపై వర్ధిల్లిన, వెలువడిన తెలుగులో శాస్త్ర గ్రంథాలు, బాల సాహిత్యం, పాల్కురికి సోమన వృషాధిప శతక పద ప్రయోగ సూచి, జానపద, గిరిజన కళారూపాల సూచి, శాసన సూచి, నాణేల సూచి, భారతి సూచి, ప్రాచీన తెలుగు పద ప్రయోగ సూచి, నలా సూచి, ఎఱ్ఱన పద ప్రయోగ సూచి, గ్రంథ పరిష్కరణ సూచి, కైఫియత్ సర్వస్వం, ఆంధ్రప్రదేశ్-తెలంగాణాల్లో పురాతన చారిత్రక ప్రదేశాల సూచి, తెలుగు సాంస్కృతిక నిఘంటువు, నెల్లూరుజిల్లా తెలుగు సాహిత్య సర్వస్వం, వీరభద్రవిజయం పద ప్రయోగ సూచి, తెలుగు నాటకం, శిల్పం, చిత్రలేఖనాల సూచి, సంగీత, నృత్యాల సూచి, ప్రాచీన తెలుగు సాహిత్యంలో సాంప్రదాయ వైద్యం, జ్యోతిష్యం సూచి వంటివి వీటలో భాగంగా చేస్తున్న నిర్మాణాలు. వీటికి ముందే ఆధ్యయన కేంద్రం మల్లుపురాణం-గ్రంథ పరిష్కరణ, ఆంధ్రమహాభారతం-గిరిజన సామాజిక జీవనం, గోదావరిజిల్లా శాసనాలు, తెలుగు కావ్య సూచి, తెలుగు ప్రబంధాలు-గ్రంథ పరిష్కరణ పద్దతులు, ఎర్రన అరణ్యపర్వ శేషం-కారక వైచిత్రి, ప్రాచీన తెలుగు కన్నడ కవయిత్రులపై పలు ప్రాజెక్టులను పూర్తిచేసింది.
నేను పైన పేర్కొన్న 2021లో ప్రారంభించిన దాదాపు ఇరవై ప్రాజెక్టుల్లో రెండవ అంశంగా తెలుగు శాస్త్ర గ్రంథాల తరువాతి అంశంగా 'తెలుగు బాల సాహిత్య సూచి' నిర్మాణం ఉండడం కేంద్రాన్ని అభినందించాల్సిన విషయం. ఈ బాల సాహిత్య సూచి నిర్మాణం తొలిసారికాకపోయినా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేయడం ముదావహం. గతంలో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియాలోని 'నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్' వంటి సంస్థలు ఈ పనిని చేసినప్పటికీ అది ఇంకా అసంపూర్తిగా, అసమగ్రంగా మిగిలి పోయింది. ఈ సేకరణలో తొలి అడుగుగా 4 జూన్, 2021 నాడు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం విషయ సేకరణ, సూచీ నిర్మాణం, అందుకు అనుసరించాల్సిన పద్దతులు, రూట్మ్యాప్ల ఏర్పాటు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు అంతర్జాలం వేదికగా సమావేశాన్ని జరిపింది. ఇది ఒక రకంగా విస్మృత వస్తువుగావున్న తెలుగు బాల సాహిత్యం వైపుగా పెద్ద ముందడుగనే చెప్పాలి. సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగు సంపాదకులు డా. పత్తిపాక మోహన్, ప్రముఖ బాల సాహితీవేత్త డా. గంగిశెట్టి శివకుమార్, సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత దాసరి వెంకటరమణ, బాల సాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణలతో పాటు ప్రాజెక్టు ఇంచార్జి డా. కల్యాడపు రమేశ్, సీనియర్ ఫెలోవున్న టి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న విషయ నిపుణులు చేసిన సూచనలు, చర్చించిన అంశాలు బాల సాహిత్య సూచి నిర్మాణంలోని అనేక అంశాలను పట్టి చూపించాయి. ఈ దిశగా బాల సాహిత్య సేకరణ జరిగితే ఒక సమగ్ర స్వరూపం ఏర్పడే అవకాశముంది. తొలుత మాట్లాడిన చొక్కాపు వెంకటరమణ మొదటగా తెలుగు బాల సాహితీవేత్తల వివరాలను సేకరించాలని, ప్రచురణ సంస్థలు, బాల సాహిత్య పరిశోధకులు, గ్రంథాలయాలు, పాత పత్రికలు, బాలల పత్రికలను సంప్రదించినప్పుడు కొంతమేరకు గ్రంథనిధి లభిస్తుందని సూచించి, ఆ దిశగా ఎటువంటి పద్దతులను పాటించాలో వివరించారు.
బాలల కథా సాహిత్యంపై పరిశోధన చేసిన డా. గంగిశెట్టి శివకుమార్ సాహిత్యం సేకరించాలంటే మొదట తెలుగులో విచ్చ పత్రికలను తరచి చూడాలని, బాలల కోసం అందులో నిర్వహించిన వివిధ శీర్షికల ద్వారా వచ్చిన వాటిని సేకరించాలని, ఉదాహరణకు కృష్ణా పత్రిక, భారతి, ఆంధ్ర పత్రికలతో పాటు, పిల్లల కోసమే వచ్చిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి వాటిని చూడాలన్నారు. పిల్లల రచనలతో పాటు, బాలల రచనల్లో ఉండాల్సిన భాష గురించి కూడా తన అభిప్రాయాన్ని వెలువరించిన డా. గంగిశెట్టి ప్రాచీన సాహిత్యంలోని బాలల సాహిత్యాన్ని కూడా రికార్డు చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. మరోవక్త దాసరి వెంకటరమణ సాహిత్య సేకరణ దృశ్య, శ్రవణమాధ్యమాల్లోనూ జరగాలని, ఇవి ప్రధానంగా జానపద సాహిత్యంలో ఉన్న పిల్లలకు సంబంధించిన కథలు, గేయాలు, పొడుపు కథలు, జాతీయాలు, నాటికలు మొదలైన ప్రక్రియల రూపంగానూ జరగాలన్నారు. ఈ సేకరణకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక్కరిని చొప్పున బాధ్యుల్ని చేయాలని, వచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేయాలని పూచించారు. అలాగే లిఖిత సాహిత్యమైన పంచతంత్రం మొదలుకుని అనేక కథలను సేకరించాలని, గృహలక్ష్మి మొదలుకుని అనేక పత్రికలు, అలాగే పిల్లల బుజ్జాయి, బాలమిత్ర, బాలకేసరి వంటి వాటిని మొదట సేకరించాలని అన్నారు. పైడిమర్రి రామకృష్ణ బాల సాహిత్యంలో కృషిచేసిన రచయితల సమగ్రకృషిని బాల సాహితీశిల్పులుగా ప్రచురించానని, దానిని ప్రచురించాలని, తద్వారా పూర్తి వివరాలు అందుతాయని సూచించారు. సమగ్ర బాల సాహిత్య సూచి నిర్మాణానికి ఇది ఆరంభం మాత్రమే కావచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఈ ప్రయాణం కూడా అలానే ప్రారంభమైంది. ఇవ్వాళ్ళ కథా సూచిక, నిఘంటువులు ఎలా పరిశోధకులకు దిక్సూచిలాగా ఉపయోగపడుతున్నాయో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టిన ఈ 'బాల వాజ్ఞయ సూచిక' కూడా రేపటి పరిశోధకులకు కరదీపికగా ఉపయోగపడడము కాక మరుగునపడ్డ ఎందరో రచయితలను, వారి వారి రచనలను రేపటి తరానికి వారసత్వ ఆస్తిలా అందించేందుకు తోడ్పడుతుంది. ఈ సూచిక కేవలం బాల సాహిత్యంతోనే ఆగిపోకుండా పత్రికలు, ఇతర గ్రంథాలు, వ్యక్తులు, గ్రామాలు, సంస్థలు, సంఘటనలు, పండుగలు, ఆచారాలు, కట్టుబొట్టూ ఇలా ప్రతిదానిని నిక్షిప్తం చేసే దిశగా సాగితే తెలుగువారి మహోన్నత వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలు మన వారసులకు అందుతాయి.
- డా. పత్తిపాక మోహన్
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగు సహాయ సంపాదకులు