Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరం సాధుజీవులమే
పచ్చగడ్డి ఎందుకో భగ్గున మండిపోతోంది
ఇద్దరం వీరవిధేయులమే
చట్టాలూన్యాయాలూ పీతిరిగుడ్డల శిథిలప్రవాహాలై
వాడంటాడు చెట్టు ఒక్కటే ఐనా కొమ్మలు వేరని
నేనంటాను ఒకే చెట్టు ఆకుల రసం
తీరు తీరుగుండదని
నేల ఒకటే
అడుగులు వేరంటాడు
నేల తాకని పాదముద్రలు రోగగ్రస్త మస్తిష్కాలు
చిత్రంగా గీసిస్తానంటాను
న్యాయం ఒక్కటే నాగరికతా ఒక్కటే
ఎందుకు ఈ లాకప్లు ఎప్పుడూ
మా శరీరాల్నే ఆశ పడ్డాయో
ఎందుకు ఈ ఫేక్ ఎన్ కౌంటర్లు
నిత్యం మా గుడిసెల్నే వేటాడుతాయో
ఎందుకు ఈ దేశద్రోహం దస్కలు ఎప్పుడూ
మా ప్రశ్నల్ని జైలుగోడల నడుమ బంధిస్తాయో
ఎంతకూ అంతు చిక్కని రాజకీయార్థిక
సామాజిక న్యాయ సాంస్కతిక ప్రశ్న
ఒకే భూమి
ఒకే ఆకాశం
పాతిపెట్ట జాగాలేని నేను
సరిహద్దులు పట్టజాలని
'ధరణి'రికార్డులతో అతను
ఇద్దరం భరతపుత్రులమే
మమ్మల్ని మామిడికాయలు
గుడక హత్యజేసరు
రేతిర్లను మింగేస్తున్న యిసకదిబ్బలు
మర్మాంగాల్ని మాయంజేస్తరు
పాస్టర్ల పాపపు జేబుల్ని
మాయంజేసిన నెపంతోనో
భువనగిరి నరేషో
మిర్యాలగూడ ప్రణయో
మంథని మధుకరో
దుంకులాడే తుపాకుల ఆశ్లోకాలు
ఎగిరిపడే లాఠీల అవినీతి రోషాలు
చీలిన చీలమండలాలు
తొలిగిన వెన్నుపూసలు
దారిదారంతా చరిత్రను
నెత్తురుతో తడుపుతున్న గాయాలు
మా గుడిసె వాసాల కిందుగా పటాలై
మా బతుకుల్లాగా వేలాడుతున్నై
తల్లీ మరియమ్మా!
అవి డేగ రెక్కలని ఎరుగవైతివీ!
బంగారు బతుకమ్మవైనా,
నటనాశిరోమణి రోజమ్మవైనా
ఏ చూపులూ నిన్ను తాకేవి కాదేమో!
ప్రపంచ నేరగాళ్ల పేర్లతో
అంతర్జాతీయ తీవ్రవాదుల తావురాల్లో
పాతబస్తీ పహిల్వాన్ల రూపాల్లో
మమ్మల్ని మేం పోల్చిచూసుకున్నా
ఎందుకు ఎప్పుడు ఎలా మా తనువులు
కులకరోనా కోరల్లో చిక్కుకుంటాయో
ఏ బుర్రకూ తట్టని మిలియన్ రూపీస్ ప్రశ్న విరిచికట్టిన రెక్కలమీద లాఠీల విన్యాసం
ఎంత సమీపంగ
ఎంత దశ్యమానంగా తారాడినా తండ్లాడినా
గరుత్మంతు చేతులు ముడుచుకుంటరు
వాల్మీకి కరుణాశ్రువులు బిక్కిపోతరు
వస్త్రాపహరణ ఘట్టం ముగిస్తేగాని
గీతాకారుడు ప్రత్యక్షమవ్వడు మరియమ్మా!
వాళ్లకోసం వాళ్ల బిడ్డలకోసం ఏడిపిస్తారు
దండన ఒకరికే
మరణం ఒకరికే
మొద్దుబారిన మెదళ్ల పాదరసాన్ని
గడ్డగట్టిన నెత్తుర్లో
ఉడుకు ఉడుకు పద్నాన్ని కలగంటున్నా...
- డా.కదిరె కష్ణ