Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైకప్పు ఒకటే
ఎవరి ప్రపంచాలు వాళ్ళవి
ఎత్తి పూసుకునేవి
బరువు దింపుకునేవి
వేళ్ళు మోస్తున్న వర్తమానాలను
కళ్ళు ప్రతిబింబిస్తాయి
గడప దాటని కాళ్ళు
పది వాకిళ్ళ అనుభవాలను
పోగు చేసుకుంటాయి.
పోగుపడ్డ చిక్కుల పోరు
తలలో హౌరెత్తుతుంది
చెలియలి కట్ట దాటని దిగులు
లోతును చెరిగి పోసుకుంటుంది
అలలు ఆకాశంలో
ముఖం చూసుకుంటాయి.
అతలా కుతలమౌతున్న
ఉపరితలంమీద
ద్రోణి పెగులుకుంటుంది
తీరం దాటని అల్పపీడనం
సారంలేని బతుకు చుట్టూ పరిభ్రమిస్తుంది
ఉదయాస్తమయాలూ
చీకటీ వెన్నెలా
రోజుని భుజం మార్చుకుంటాయి.
వాసనలు వదిలేయకుండా
కాలిన కర్పూరం
రెప్పలను సింగారించే
కాటుక మరకల జ్ఞాపకం
పరిమళించిన దినాల బూదికుప్పలో
వైరాగ్యం ధ్యానమగమౌతుంది.
చుట్టుకున్నవీ
కూడగట్టుకున్నవీ
తగలబెట్టుకున్నవీ
హెచ్చవేతలో శేషం శూన్యమై
అవశేషాన్ని వెక్కిరిస్తుంది.
అంతర్మథనం
చిట్టచివరి పొర మీద
నిర్వేదాల్ని కూడగట్టుకుంటూ
నిర్నిద్ర మేఘాల్ని తట్టిలేపుతుంది....
- వఝల శివకుమార్