Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రామాయణం, భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేద వేదాంగాలు, కావ్యాలు, ప్రబంధాలు వంటి పండిత శిష్ట సాహిత్యమే. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. సామాన్య మానవుని లోని ప్రతిభకు, పాండిత్యానికి, అతనిలోని భావుకతకు, తాత్విక చింతనకు నిలువెత్తు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ రెండో పార్శ్యమే జానపద సాహిత్యం. ఒకప్పుడు చదువురాని వారు మాట్లాడే భాషను గ్రామ్యం అన్న పేరుతో దానికి ప్రామాణికతను ఇవ్వటానికి ఇష్టపడే వారు కాదు, అలాంటి సందర్భాలలో వారి సాహిత్యాన్ని ఇక ఏ విధంగా గుర్తించగలరు. కానీ నన్నయ, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు దేశి కవితా ఉద్యమకారులు పదకవులు వంటి కొద్దిమంది ప్రాచీన కవులు, ఆధునిక కాలంలో నేదునూరి గంగాధరం, బిరుదురాజు రామరాజు, నాయని కష్ణకుమారి వంటి జానపద పరిశోధకుల కషి ఫలితంగా, వాడుక భాషను సైతం సాహిత్య మాధ్యమంగా గుర్తించిన తర్వాత ఈ జానపద సాహిత్యం సైతం వెలుగులోకి తీసుకురాబడింది.
జనపదం అంటే పల్లెటూరు అని, అందులో నివసించే ప్రజలను జానపదులు అని అంటారు కానీ ఎర్రన్న ''జానపదుల్ పురీ జనుల్'' అని అభివర్ణించారు. అలా చూస్తే జానపద సాహిత్యం పల్లెటూరి వాళ్ళదా లేక పట్టణాల వాళ్లదా అసలు జానపద సాహిత్యం అంటే ఏమిటి? దానికి ఉండ వలసిన లక్షణాలు ఏమిటి? అని పరిశీలిస్తే,
''సహజ స్ఫురణ శక్తి గల అనాలోచిత కళ'' నే జానపద సాహిత్యం అంటారు. అంటే జానపద సాహిత్యం ఆశువుగా అప్రయత్నంగా వెలువడుతుంది. దీనికి ఎటువంటి శిక్షణ, అనుభవం అవసరం లేదు. పరస్పర కళాత్మక సంబంధం గల సంగీతంతో కూడిన సాహిత్యం ప్రక్రియ. ''సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతమే జానపద సాహిత్యం''. అంటే జానపద సాహిత్యం సష్టికర్తలు అందరూ ఎలాంటి అక్షర జ్ఞానం లేని కార్మిక, కర్షక, శ్రామిక జనాలే. భావగీతం అంటే మనసులోని అనుభూతికి ఒక రూపం ఇవ్వటం. ఇందులో సంగీతంతో పాటు సాహిత్యం కూడా మిళితమై ఉంటుంది.
జానపద సాహిత్యం ముఖ్య లక్షణం ''ఆత్మాశ్రయత్వ కవిత్వం''. ఆత్మాశ్రయత్వం అంటే తన మనసులోని అనుభూతికి ఒక రూపం కల్పించడమే, ఇందులో ఎటువంటి నియమాలు సూత్రాలు ఉండవు కేవలం వ్యక్తి అనుభూతికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. తొలితరం వ్యక్తి తనకు నచ్చిన అంశాలు, తనకు నచ్చిన రీతిలో వివరిస్తే, ఆ తర్వాతి తరం వ్యక్తి అదే భావాన్ని మరో రీతిలో వివరిస్తాడు. అందువల్ల జానపద సాహిత్యానికి నిర్దిష్టమైన లక్షణాలు ఉండవు.
దీన్ని బట్టి చూస్తే ''జానపద సాహిత్యం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినది కాదు ఒక నిర్దిష్ట తత్వానికి సంబంధించినది'' అని తెలుస్తుంది.
- మనిషి సంచార జీవి నుంచి సంసారం జీవిగా మారిన తర్వాత తన భావ వినిమయం కోసం భాష ఏర్పర్చుకున్నాడు. ఆ భాష ద్వారానే తన భావాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాడు. తొలుత కేవలం భాష మాత్రమే ఉండేది దానికి లిపి ఉండేది కాదు. తన మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయడం వల్ల భాషా జ్ఞానం పెరిగింది. తన మాటలలోని పదాలకు క్రమపద్ధతిలో విరుపుల వల్ల దానికి లయ చేకూరి, ఆ మాటలకు ఆకర్షణ పెరిగేది. ఆ నాదానికి అంత్యప్రాసను చేకూరిస్తే అది సంగీత స్పర్శ గల గేయంగా పరిణామం చెందింది. అదే జానపద సంగీత ఆవిర్భావానికి తొలిమెట్టుగా అభివద్ధి చెందింది. ఆనాటి మనిషి పూర్తిగా శ్రమజీవి ఒక పని చేసేటప్పుడు అలసట తెలియకుండా ఆ పని మరింత ఆసక్తిగా ఉండడానికి సంగీతంను ఆశ్రయించేవారు. అలా ఈ జానపద సంగీతం ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారానే చేరింది. ఒకరి ద్వారా మరొకరు నేర్చుకొని పాడేవారు. అలా సంగీత ప్రక్రియ పుట్టింది. కానీ దానికి అంశం కావాలి.సమాజ జీవిగా మారిన తర్వాత మనిషి తన చుట్టూ ఉన్న వ్యక్తులను,ప్రకతిని పరిశీలించగా అందులో కొన్ని రకాల అంశాలు కనపడ్డాయి అవి
- ప్రణయ/ప్రేమ/అనురాగాలు
- తాత్వికత/మార్మికత.
''ప్రణయం/ప్రేమ/అనుబంధం'' ఇందులో వ్యక్తులు/ ఒక అంశంతో తనకు గల అనుబంధంలోని అంత: సౌందర్యం వుంటుంది. బావ మరదళ్ల మధ్య ఉండే సరసం, అలకలు, తల్లీ బిడ్డల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, అన్నాచెల్లెళ్ల అనురాగాలు పల్లెటూరిపై ఉండే మమకారం తను చేసే పనిపై ఉండే ఇష్టం వంటివి.
''తాత్వికత/మార్మికత'' తన చుట్టూ జరిగే సంఘటనల వెనుక ఉన్న తన ఆలోచనలకు, మేధస్సుకు అందని అలౌకిక భావనలను తత్వంగా వర్గీకరించారు. జననం- మరణం, కర్మ ఫలం, దైవం వంటివి.
మానవుడికి లిపి పరిచయమైన తర్వాతనే వేదాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు వంటి శిష్ట సాహిత్యం పురుడు పోసుకుంది. కానీ లిపి ఏర్పడక ముందే జానపద సాహిత్యం జన్మించి, తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకుంది. అలా చూస్తే మానవుని తొలి సాహిత్యంగా జానపద సాహిత్యం నిలుస్తుంది. ''సాహిత్యానికి అల్లిక నేర్పించింది జానపదం అయితే సాహిత్యానికి రాత నేర్పించింది మాత్రం శిష్ట సాహిత్యమే. కానీ అల్లిక అంటరానిదైంది రాత రాజై కూర్చుంది.''
జానపదులు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తాము జరుపుకునే వేడుకల్లోనూ మానవుని జీవితం, శ్రమతత్వం అన్ని తాము చేసే ప్రతి పనిలోనూ ఉన్న మూలతత్వాన్ని పాటల రూపంలో పాడుకునేవారు. అందులోనే ప్రేమ, హాస్యం, వెటకారం, ఆవేశం, బాధ, భక్తి... వంటి ఎన్నో భావోద్వేగాలను చేర్చేవారు.
''లాలి పాటలు'' ప్రతి తల్లి తన బిడ్డ నిద్రపుచ్చడానికి లాలి పాటలు పాడేవారు. ''శోభనం'' మంగళ హారతి ఇచ్చే సమయాల్లోనూ, మంగళస్నానాలు చేయించే సమయాల్లోనూ ముత్తయిదువులు పాడే పాటలను శోభనం అనేవారు.
''సువ్వి'' ధాన్యం దంచేటప్పుడు పాడే పాటలు.
''ఏలలు'' నాయకుని గురించి నాయక ఆహ్వాన పూర్వకంగా పాడే పాటలు.
''అప్పగింతల పాటలు'' తల్లి తన కూతురికి పెండ్లి చేసి అత్తవారింటికి పంపే సందర్భంలో అత్తవారింట్లో ఎలా విధంగా నడుచుకోవాలి తెలియజేస్తూ పాడే పాటలు.
జానపదులు కేవలం పాటనే కాదు తమ విరామ సమయాన్ని ఆహ్లాదంగా గడపడానికి ఎన్నో కళారూపాలు కూడా సష్టించుకున్నారు అవి ''కురవంజి తోలుబొమ్మలాట, వీధి నాటకం, యక్షగానం, బుర్రకథ, హరికథ...'' మొదలైనవి.
జానపదుల కథలన్నీ గేయ రూపంలోనే ఉంటాయి. మనిషి తలచుకుంటే దేన్నైనా సాధించగలడు అనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేలా ఉంటాయి. ఎక్కువభాగం వీరరస ప్రధానమైన కథలు ఉంటాయి.
జానపదులు తమ కోసం మరణించిన వీరులను, వ్యవసాయానికి చెందిన దేవతలను, చెట్లు పుట్టలు పశువులు జంతువులు మొదలగు ప్రకతిలోని ప్రతి అంశాన్ని దైవం గానే పూజించేవారు.
ఇలా శిష్ట సాహిత్యానికి ఏ మాత్రం తీసిపోని అద్భుతమైన సాహిత్యం కలది జానపదం. కానీ వీటికి గ్రంథస్థం లేకపోవడం వలన, పండితులు శిష్ట సాహిత్యం పట్ల చుపినంత ఆదరణ దీని పట్ల చూపకపోవడం వలన అంతగా ప్రాధాన్యం పొందలేకపోయాయి. రాజులు జమీందార్ల ప్రేమకథలు, ప్రణయగాథలు, శంగార విలాసాలు గురించి వివరించే కవులు పండితులకు జానపద సాహిత్యం అనేది అంతగా మింగుడుపడని విషయమే. వారి దష్టిలో జానపద సాహిత్యం అంతా గాలివాటపు కవిత్వమే.
సాహిత్యం అంటే సంస్కతిని ప్రతిబింబించేలా చేసేది అని అర్థం పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు వంటి నిబద్ద విషయాలను పూర్వుల లక్షణాలు, నిర్దిష్టత లకు అనుగుణంగా ఒక రూపాన్ని సంతరించుకున్న శిష్ట సాహిత్యం కంటే సామాన్య మానవుని జీవన విధానానికి కళాత్మక అభివద్ధిని జోడించిన జానపదమే సాహిత్యం అన్న పేరుకు అసలైన అర్హత కలది కానీ సాహిత్య చరిత్ర రచనకు యోగ్యమైన తత్వం లేకపోవడం మూలాన జానపద సాహిత్యం గుర్తింపు నోచుకోలేక పోయింది. అలా అని కవులందరూ పూర్తిగా జానపద సాహిత్యంను విస్మరించలేదు. కొంతమంది కవులు సమయానుగుణంగా తమ రచనల్లో జానపద సాహిత్యము సైతం చొప్పించారు. మరి కొంత మంది జానపద సాహిత్యంనే రచన మాధ్యమంగా ఎన్నుకున్నారు. నన్నయ్య నాగీ గీతాలుగా, నన్నెచోడుడు గౌడ్ గీతాలు, అంకమాలికలు, ఆరతులు అన్న పేరుతో పాల్కురికి సోమనాథుడు సువ్వి పాటలు, శంకర పదాలు, ఆనంద పదాలు, తుమ్మెద పదాలు వెన్నెల పదాలు గొబ్బి పదాలు అన్న పేరుతో తమ రచనల్లో జానపద సాహిత్యానికి సైతం స్థానం కల్పించారు. శివకవి యుగంలో దేశి కవులంతా జానపద సాహిత్య రచనకే మొగ్గు చూపించారు. శ్రీనాధుడు తాను రాసిన ''పల్నాటి వీర చరిత్ర'' లో జానపద సాహిత్యం గురించిన వివరణ కలదు. వేమన, వీర బ్రహ్మం వంటి వారు తమ రచనల్లో జానపదుల వికాసానికి ఆసక్తి కనబరిచారు. అన్నమయ్య అచ్చమైన తెలుగు బాణీలలో పాటలు పాడి ప్రజలలో సామాజిక చైతన్యాన్ని కల్పించారు. అన్నమయ్య కవిత్వంలో జానపద సాహిత్యం అంతర్భాగమై విలసిల్లుతుంది. కానీ ఆధునికకాలంలో రచయితలంతా వివిధ భావజాలం అన్న పేరుతో జానపద సాహిత్యాన్ని పూర్తిగా విస్మరించారు.
పాశ్చాత్యులలో తొలిసారి జానపద సాహిత్యంపై ఆసక్తి కనబరిచిన వారు గ్రిమ్స్ సోదరులు. తొలినాళ్ళలో జానపద సాహిత్యంలో ''పాపులర్ ఆంటీక్వీట్స్'' అన్న పేరుతో పిలిచే వారు. వాటికి folk lore పేరును సూచించిన వారు విలియం జాన్ థంస్. అందుకే అతడిని శబ్దబ్రహ్మగా పిలుస్తారు. జానపద సాహిత్యంను వాటి స్వభావాల ఆధారంగా విభజించి వారు =.ూ.భాగ్స్ డ డార్సన్. పాశ్చాత్యులలో జానపద గేయాల సేకరణకు ఆద్యుడు కె. ఏ బోయల్.
తెలుగునాట జానపద విజ్ఞానం గురించి శాస్త్రీయ పద్ధతిలో కషి చేసింది కల్నల్ మెకంజీ. జానపద సాహిత్య అభివద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి నేదుకురి గంగాధరం. జానపద సాహిత్య అభివద్ధికి తన పొలాన్ని సైతం అన్ని వేసి, అనేక ప్రాంతాల్లో పర్యటించి 6 వేలకు పైగా జానపద గీతాలు సేకరించారు. జనపదం అన్న పదాన్ని జన బాహుల్యంలో ప్రచారం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. అందుకే ఇతడిని జానపద వాజ్మయోద్ధార కుడుగా కీర్తిస్తారు. జానపద విజ్ఞానం గురించి తొలిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి బిరుదురాజు రామరాజు. ఇతడు ''జాన పద గేయ సాహిత్యం''పై విశేష కషి చేశారు. జానపద సాహిత్యంను మాన వతా దక్పథంతో పరిశోధించిన మరో వ్యక్తి నాయని కష్ణకుమారి. జానపద సాహిత్యంలోని కళాత్మకత, సాహిత్యత వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్నో విశ్వవిద్యాలయాలు జానపద సాహిత్యంపై పరిశోధన అవకాశాలు కలిపిస్తున్నాయి.
జానపద సాహిత్యం సామాన్య మానవుని జీవన విధా నంను వివరించటమే కాక ఆనాటి రాజరిక పరిపాలన లోని అసలైన సామజిక జీవన చిత్రణను నిక్కచ్చిగా వివరి స్తుంది. సమాజంలో గల విభిన్న కుల, మత, వర్ణాల సమైక్య జీవన విధానంలో ఇమిడివున్న అంత: సౌందర్యాన్ని ఆనాటి సమాజ నిర్మాణ చట్రాన్ని పరి పూర్ణంగా, కళాత్మకం గా వివరించ గలిగేది జానపద సాహిత్యం మాత్రమే.
ఒక్క మాటలో చెప్పా లంటే జానపద సాహిత్యంను అధ్యయనం చేయడం అంటే మానవ సంఘ సంస్కతిని అధ్యయనం చేయడమే!!
- ఎం. కురుమయ్య యాదవ్, 7799553493