Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరాలు మౌనంగా ఉంటూనే
పదాలతో సంభాషిస్తుంటాయి
పదాలు వాక్యాలతో జోడీ కట్టి
కవితాతోరణాన్ని అల్లుతుంటాయి
లోలోపలి అనంత సంవేదనలను
అంతర్లీనంగా ఆవహించుకుంటూ
వసంతాలను పూయించాలనీ
బంగారు కలలు కంటుంటాయి
అక్షరాలు పసిపాపలేమీ కావు
అనంతభావాలను మోసే
అద్భుత కళాఖండాలు
అనంతజగత్తులో విరిసే
ఆలోచనల సాగరాలు
ఎదలోతుల్లోని అలజడులను
తట్టిలేపే ఆగ్రహావేశాలు
నిరంతరం సమాజాన్ని
పహారా కాసే నక్షత్రాలు
అక్షరాలు నిండుకుండగా ఉంటూనే
ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలవుతుంటాయి
నిర్భయంగా కాపుకాస్తూనే
నిజాలను నిగ్గదీసే అగ్నిపర్వతాలవుతుంటాయి
ఎప్పుడో ఒకసారి లావాలా
విరజిమ్మి విస్ఫోటనాన్ని రగిలిస్తుంటాయి
అక్షరాలు మౌనంగా ఉంటాయనుకుంటాము
వేదనతో , ఆవేదనతో , ఆక్రందనలతో
అట్టడుకిపోతూనే నిజస్వరూపాన్ని
దశావతారాల్లా చాటుతూనే ఉంటాయి
అదును కోసం ఎదురుచూస్తూనే
డేగకళ్ళ చూపులై వాలుతుంటాయి
అవును....
అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు
రేపటి కోసం ప్రశ్నించే గొంతుకలై
వేయికళ్ళతో వేచిచూస్తుంటాయి
ఉదయించే వేకువకిరణాలై
మరో లోకం కోసం కలగంటుంటాయి
అవును.....
అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు !
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,
9032844017