Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విషమబాహు త్రిభుజాందకారంలో
ఆలోచనా కొలతల్ని లెక్కలేస్తున్నా
ఒక్కటికూడా సక్కగాలేదు
సమానం తేలట్లేదు
యుగానికి జరిగి పోతున్న డిగ్రీ కాలంలో
కాలం టేపు కరాబవుతుంటే
స్వార్థంతో అభిమానాలు ప్రేమలు
సెంటీమీటర్లోకి షిఫ్టవుతున్నాయి
ఎలా కొలవాలో అర్ధం కావట్లేదు
ఇంకా బాకీ ఉంది
జీవితం చుట్టుకొలత
మనోగణితం లెక్క వేరు
మనసు, మెదడు రెండూ సమాంతర రేఖలే
అయితే అనవసర యోచనాల లంబ దూరమే సమానంగా రాదు
ఇక్కడాలొచనా చిక్కులే తిర్యగ్రేఖలై
మనుషుల్ని ఖండిస్తున్నాయి
అనేకానేక కోణాలకి కారణాలవుతున్నాయి
ఎంత భాగించినా
చెవిలో జోరీగలా ఆశ ఆగట్లేదు
తీసివేతలు కూడికల తొక్కిసలో
శేషం సున్నా రాక
మనిషి జన్మ జన్మల బాకీ అవుతుండు
ఇది తీరేది కాదు తేలేది కాదు కనీసం
వడ్డీ మాత్రం ప్రేమైనా పోగేద్దాం రా మిత్రమా!
- వెంకటేష్ పువ్వాడ 7204709732