Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉత్తమ కవిత్వం ఎల్లప్పుడూ పొంగి పొరలి వచ్చే శక్తివంతమైన అనుభూతులతో ఉంటుంది'' అంటాడు 'వర్డ్స్ వర్త్'.
సమాజంలో అనునిత్యం జరిగే అకత్యాలకు, అరాచకాలకు తీవ్రంగా స్పందించే హదయంలో పెల్లుబికే భావాలను ఎంతోకాలం అణచి ఉంచడం సాధ్యం కాదు. సజనశక్తి గలవారిలో అవి మరింత తొందరగా అభివ్యక్తిగా మారి అక్షరరూపం దాలుస్తాయి. పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు వివక్షతలకు, లైంగిక హింసలకు గురికావడాన్ని సహించలేని ఆగ్రహం, మగవాళ్ళు ఉన్నతులు స్త్రీలు అల్పులు అనే భేదభావాలు రూపు మాసిపోవాలనే సంకల్పం, విద్య ఉద్యోగాల సమాన ప్రతిపత్తితోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలనే ఆశయం వంటివి, విద్యావంతులై సామాజిక అవగాహనతో చైతన్యాన్ని నింపుకున్న స్త్రీల కలాలను మరింత పదునెక్కిస్తాయి.
పై మాటలకు అనుగుణంగా ఒక సామాజిక, సేవకురాలిగా, విద్యావంతురాలుగా, పురుషాదిపత్య సమాజం పోకడల్ని నిరసించే మహిళగా రూప రుక్మిణి తన భావాలకు కవిత్వ రూపమిచ్చిన ఫలితమే ''అనీడ'' కవితా సంపుటి.
కవిత్వానికి కవియొక్క అద్వంద్వమైన అనుభవమే ఆ కవితా సంపుటి యొక్క అర్థ సంవిధానాన్ని, ఆకతిని నిర్ణయిస్తుందనడానికి ఈ 'అనీడ' సంపుటాన్ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
సంప్రదాయం పేరుతో స్త్రీలను మానసికంగాను, శారీరకంగాను బానిసలుగా మార్చి, ఆ బానిసత్వాన్ని బాధ్యతగా మోసే మరబొమ్మల్ని చేసిన పితస్వామ్య వ్యవస్థను ఎండగడుతూ రాసిన కవిత 'రంగుల గాయం'. ఈ కవితలో స్త్రీ తాను బానిసత్వంలో మగ్గిపోతున్న విషయాన్నే మరిచి పురుషాధిపత్యాన్ని భరిస్తోందని గుర్తుచేస్తూ, తనను తానే ఉన్నతంగా ఆవిష్కరించుకోవాలని ఉద్భోధిస్తున్నది.
''నీ మౌనం చేసిన గాయం సలుపుతోంది
కత్తి చేసిన గాయం కన్నా...
ప్రపంచం ఊసరవెల్లి
ప్రతి రంగులో నిన్ను నీవే ఆవిష్కరించుకోవాలని
ఒక్కసారి సమాధానమిచ్చిచూడు
కాలర్ ఎగరేసిన చొక్కా
రంగు మార్చుకుంటుంది
మౌనం మాటైన క్షణం
గాయాలు గాలివాటుగా తేలిపోతాయి''
'నీ మౌనం చేసిన గాయం సలుపుతోంది' అని ప్రారంభమైన కవితా వాక్యాలు కవయిత్రి మహిళగా సాటి మహిళను ఉద్దేశించి మాట్లాడటాన్ని సూచిస్తున్నాయి. తరువాత పంక్తిలో 'కత్తి చేసిన గాయం కన్నా'' అనడంతో పై వాక్యమంతా చమత్కార పూరితమై తీవ్రమైన నిరసనను ధ్వనింపజేసింది. మౌనం గాయం చేసిందనడంలో అనావశ్యకమైన మౌనం ప్రమాదకరమని గుర్తుచేయడం ఉంది. పైగా అది కత్తిచేసిన గాయం కన్నా ఎక్కువ సలుపుతుందని, మాట్లాడవలసిన అవసరాన్ని తెలియజేస్తున్నది. లోకం సందర్భానికి తగినట్టు మాటల్ని మారుస్తుందని చెప్పడానికి ప్రపంచాన్ని ఊసరవెల్లితో పోల్చడం, ఇది పురుషాధిక్య ప్రపంచమని చెప్పడానికి పురుషుడిని 'కాలర్ ఎగరేసిన చొక్కా'గా అభివర్ణించడంతో కవయిత్రికి ఔచిత్యాన్ని పాటించడంలో మెలకువ ఉందని బోధపరుస్తున్నది. రంగులు మార్చడం తెలిసిన ఊసరవెల్లి లాంటి ప్రపంచం ఎప్పటికీ పురుషుడినే సమర్థిస్తుందని అందుకే అది మార్చే ప్రతిరంగులోనూ స్త్రీ తనను తానే ఆవిష్కరించుకోవాలని స్త్రీ సమాజాన్ని మేల్కొల్పుతోంది. అలా ఆవిష్కరించుకోవాలంటే ధిక్కారమొకటే పరిష్కారమని దానికి సమాధాన పడటం కాకుండగా 'ఒక్కసారి సమాధాన మిచ్చిచూడమని' సున్నితంగానైనా తీవ్రధ్వనితో తెగువను చూపించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. మౌనం మాటగా రూపుదాల్చిన క్షణం గాయాలు గాలివాటంగా తేలిపోతాయని పరిష్కారాన్ని సూచిస్తున్నది. రూప కవిత్వంలో సూటిదనం, సున్నితత్వంతో పాటు పరిధులు దాటని ధర్మాగ్రహం పఠితను ఆలోచింపజేస్తుంది.
ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా పెండ్లి అనే బంధంతో స్త్రీని బందీని చేసి ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరిస్తున్నారని చెబుతూ ఆప్యాయతను, లాలింపును పొందక కనీసం చిరునవ్వైనా నవ్వలేని నిస్సహాయతలో బ్రతుకవలసి వస్తున్న దీనస్థితిని ఆవేదనా భరితంగా వివరించింది. ''అగ్నిశిఖ'' కవితలో
''నీ చేయి పట్టి నడిచిన పడతి నిర్జీవమైన దేహాన్ని
ఎందుకు తడిమి చూస్తావు
అక్కడ ఇంకా ఏమి మిగిలుందని
రక్తమాంసాలు నిండిన తోలుతిత్తి తప్ప
నీ అహంకారపు జ్వాలలలో
ఏనాడో సమిదైపోయింది''
పెండ్లి జరిగిన తరువాత స్త్రీ తన స్వేచ్ఛా స్వాతంత్య్రా లను కోల్పోయి పురుషునికి సుఖాన్నందించే జీవమున్న వస్తువుగా బ్రతుకీడుస్తుందనే విషయాన్ని 'నీ చేయి పట్టి నడచిన పడతి నిర్జీవమైన దేహం' అనే ఒక్కవాక్యంతో ధ్వనింపజేసింది.
వైవాహిక సంబంధంలో స్త్రీ మనసుతో ప్రమేయమే లేనట్టు అది కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను కోరుకుంటుందనే విషయాన్నే మరచి, భర్త అనే హక్కుదారుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నప్పుడు అనివార్యంగా దేహాన్ని అప్పగించే దైన్యాన్ని 'ఇంకా అక్కడేం మిగిలిందని, రక్త మాంసాలు నిండిన తోలుతిత్తి తప్ప' అంటూ పితస్వామ్య వ్యవస్థలోని అమానవీయతను ధిక్కరిస్తుంది. 'నీ అహంకారపు జ్వాలల్లో ఏనాడో సమిధైపోయిందని' పురుషాహంకారాన్ని ఆవేదనాపూరితంగా ఆక్షేపిస్తుంది.
'సంకల్పం' అనే కవితలో బిగుతైపోతున్న గుండె బరువుల నుంచి సేదతీర్చాలనే ఆకాంక్షను ప్రకటిస్తూ... ''చీకటి నిండిన దారులలో వెలుగును వెతికే విశాలమైన మనసు కోసం ఓ ఒంటరి స్వరం నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది.
నాలోని ఒంటరి తనాన్ని మేల్కొల్పి
చెదిరిన నవ్వులకు
ఆపన్న హస్తం అయ్యే మార్గాన్ని వెతికి పట్టుకోవాలి
మనిషితనాన్ని గుర్తించాలి'' అంటుంది.
ఎన్నో యుగాలుగా కష్టాలను, కన్నీళ్ళను దిగమింగి వివక్షతలను, అఘాయిత్యాలను భరిస్తూ చీకటిమయమైన జీవి తాన్ని స్వేచ్ఛా సమానత్వాలతో నింపడానికి, చెదిరిన నవ్వులను ప్రోదిచేసుకోవడానికి ఒక ఆపన్న హస్తం కావాలని చెప్తూ, అది ఏ వ్యక్తిదో, కులానిదో, మతానిదో కాకూడదని అభి ప్రాయపడుతుంది. అది ఒక మార్గమైయుం డాలని ఉద్భోధిస్తుంది. ఇలా ఒక మార్గమనే ఆపన్నహస్తాన్ని వెతుక్కోవాలనడంలో కవయిత్రి ఈ వ్యవస్థపై ప్రకటించిన అవిశ్వాసపు విశిష్ట ధ్వని గమనించదగినది. ముగిం పులో 'మనిషితనాన్ని గుర్తించాలి' అనడంతో మనిషి మనిషిగా జీవించడం అరుదైపోయిన లోపాన్ని ఎత్తిచూపడం ఉంది.
పురుషుల ద్వంద్వ వైఖరని తేటతెల్లం చేసిన
'ఒక్క క్షణం' కవిత
''ఏ మార్పు ఆశించాలి ఈ సమాజం నుండి?
మాటల్లో స్త్రీల కోసం పోరాటాలు
నిందల్లో స్త్రీల స్వాభిమానాల హననాలు''...
పై పై మాటలకైతే స్త్రీలు ఉద్ధరించబడాలని, వారి పట్ల జరిగే అరాచకాలను, అత్యాచారాలను ఖండిస్తూనే, గిట్టని వారిపై కోపతాపాలను ప్రదర్శించే సందర్భాలలో నిందాపూర్వకంగా స్త్రీల స్వాభిమానాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటారని ఎద్దేవా చేయడాన్ని పై పంక్తుల్లో గమనించవచ్చు.
నీయమ్మ..., నీయక్క...అంటూ స్త్రీని కేంద్రంగా చేసుకొని బూతులు తిట్టడాన్ని వింటుంటాం. మగాడిని నిందించడానికి అతని తల్లినో, చెల్లినో, అక్కనో, భార్యనో తిట్లలో ప్రయోగించడం దాని వలన మళ్ళీ స్త్రీలనే అవమాన పరుస్తున్నామన్న స్పహ లేకపోవడం శోచనీయం కదా!
''మళ్ళీ ఆ మగాడ్ని నిందించే వస్తువు
వాడి తల్లో, భార్యో కావడం విషాదం కదూ'' అంటుంది.
లోకం తెలియని పసితనంలో శీలాన్ని కోల్పోయిందని మహిళను మాత్రమే కారణంగా చూపడాన్ని ప్రశ్నిస్తూ, శీలం అనేది ఒక్క స్త్రీకే కాదు అది పురుషుడికీ ఉంటుంది. దాన్ని కోల్పోవడం అనేది జరిగితే అది ఇరువురికీ వర్తిస్తుంది. కాని ఈ విషయంలో స్త్రీని మాత్రమే బాధ్యురాలిని చేసి దూషించడం, అవమాన పరచడం ఆనవాయితీ అయిందనే శ్లేషను కవయిత్రి 'చిత్రవర్ణం, అనే కవితలో బహుసున్నితంగా ప్రస్తావించడం ఆలోచనాత్మకంగా ఉంది.
''లోకం వన్నె తెలియక పొగడ చెట్టు నీడ చేరింది
చెక్కిన శిల్పంలాంటి తనపై...
ఇలా ఈ సంపుటిలో అధిక సంఖ్యలో స్త్రీ కేంద్రక కవితలే అనాదిగా జరిగే మౌనహింసల పర్వాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. వీటితో పాటు కొన్ని రైతు కవితలు, భావకవిత్వపు ఛాయలున్న ప్రేమ కవితలు, మరికొన్ని సామాజిక చైతన్యాన్ని కలిగించే కవితలు ఉన్నాయి. తన సాంద్రవంతమైన కవిత్వంలో స్త్రీవాద కవయిత్రిగా నిలబడగలిగే సామర్ధ్యాలు పుష్కలంగా ఉన్న కారణంగా రూపరుక్మిణి కవిత్వంలో సున్నితమైన ధిక్కరాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా, స్వరంలో తీవ్రతను మరింత పెంచి, కవిత్వానికి గాఢతను తీసుకురావలసిన అవసరాన్ని గుర్తిచవలసి ఉంది.
- పోతగాని సత్యనారాయణ,
తెలుగు పరిశోధక విద్యార్థి, కాకతీయవిశ్వవిద్యాలయం
9441083763