Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ ఇష్ట సంగీతాన్ని స్వేచ్చాస్వరంతో వినిపిస్తూ
ఇంత పొద్దుపొద్దున్నే వొచ్చి నర్తిస్తున్నావు కదా వానా!
ఇపుడు నీకూ నాకూ నడుమ ఈ కిటికీ అద్దాల హద్దు-
రాలేను నిన్ను తాకడానికి, తడవడానికి, తన్మయవష్టిని పొందడానికి-
గహబందీని, స్వేచ్ఛగా తిరగలేను, దేన్నీ అలవోకగా ముట్టుకోలేను
ఏ పువ్వునూ పత్రాన్నీ కూడా, ఆఖరికి నా ముఖాన్ని కూడా-
అయినా నిజరూపంతో నర్తించే నిన్ను ఈ అద్దాల్లోంచి దర్శిస్తున్నాను
వేసుకున్న భయం ముసుగును ముఖంనుంచి కాస్తా కిందికని-
నీకేం, చిన్నప్పుడు నన్ను మొదటిసారి తడిపిన వానలానేవున్నావు ఇప్పుడూ-
నేనా, అప్పట్లా హుషారుకళతో లేను, తాళ్ళో సంకెళ్లో కాదు
వెరపు తంత్రులు కట్టేశాయి, నీకు కనపడవు, నాక్కూడా-
చిన్నప్పుడు నువ్వు కురిసినప్పుడల్లా పొలంలా తడిసాను
ఎన్నెన్నో నాలో మొలకలెత్తి విప్పారి చిగురించాయి
వాటి పరిమళాలు గుర్తుకొస్తున్నాయి ఇవాళ నిన్ను చూస్తుంటే-
బడి నుంచి వస్తున్నప్పుడు నువ్వు ఆధాటున మీద పడితే
తడిసిన పుస్తకాల్ని ఆరబెట్టుకుని నేను చదువుకున్నప్పుడు
ఆరిన అక్షరాల్లో మిగిలిన తడి జాడలు
నా కళ్ళల్లోకి పాకిన ఘడియలు గుర్తున్నాయి
ఇవాళ నేను తడవడం లేదు, ఆరడం లేదు
కనుక పరవశపు మైమరుపు లేదు మెరుపు లేదు
ఇట్లా పొడి గది నుంచి చూడ్డమే, తడి తరుగైన చూపుతో-
ఇవాళ నీ ధారల్లో భూగర్భ జలజలల్నీ, నదీసలిలాల్నీ
ఊర్ధ్వమేఘాల నీలి సంపదల్నీ చూస్తున్నాను
ఒక రూపం వెనకాల ఎంతెంతో చంక్రమణం వుంటుందని
నీ ఉనికి చెబుతూంటే, ఉన్నపళాన
నా వెనకాలి తలపుల దారుల్లోకి నేను తరలి వెళ్ళి
ఎందరెందరు ఇంతదాకా నన్ను నడిపించారో వాళ్ళను
పునర్దర్శిస్తున్నా!
ఇన్నాళ్లూ మైదానాల్లో తిరిగి తిరిగి ఇక నాకు తిరుగు లేదని అనుకున్నా-
ఏమైంది! ఇపుడు ఒక కనపడని అల్పజీవి కంట పడొద్దని ఇట్లా
ఇంట్లో జాగ్రత్తల కట్టుబాట్లలో పడి వున్నా, కిరీటాన్నిమూలకు పడేసి-
చేతులు చాస్తే అటూ ఇటూ గోడలే తాకుతున్నాయి
దిగంతాలు అందేదెప్పుడు?
నువ్వా, ఎప్పట్లాగే ఇవ్వడానికే ఏతెంచావు నిర్మలంగా
తరులకు తళుకునూ,వేళ్ళకు జవాన్నీ,
మహీతలానికి మాతత్వ మదుత్వాన్నీ,
పక్షుల రెక్కలకు ఉత్సాహం ఇంధనాన్నీ
గాలికి శీతల గీతాల్నీ అందిస్తున్నావు
ఇవ్వడం ఇంత దశ్యోత్సవభరితంగా వుంటుందని
కళ్ళారా తెలుసుకుంటూంటే నా చూపు శుభ్రమౌతున్నది తడిలో!
ఉత్సవం నా దాకా వచ్చిందని తెలుస్తున్నదిప్పుడు!
ఇక ఈ అద్దావలకివతల ఉండలేను,ఈ బందీతనాన్ని ఛేదించుకుంటూ
గోడల్ని దాటి నీ దయామయ ధారల దరికి వస్తున్నాను
తడవడానికీ,వెరపు తంత్రుల్ని తెంచుకోవడానికీ-
అంతేనా! ఇష్టనిష్ఠతో నీకు ప్రణమిల్లడానికి కూడా!
- దర్భశయనం శ్రీనివాసాచార్య, 94404 19039