Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బూర్జువా వర్గానికీ కార్మిక వర్గానికీ మధ్య శత్రు వైషమ్యం ఉందన్న విషయాన్ని స్పష్టాతిస్పష్టంగా కార్మిక వర్గానికి నేర్పడాన్ని ఒక్క క్షణం కూడా మరువరు'' అని పేర్కొంటూ ''క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతి చోటా అప్పుడున్న సామాజిక రాజకీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగే ప్రతి విప్లవోద్యమాన్నీ కమ్యూనిస్టులు బలపరుస్తారు'' అని ప్రకటించారు.
కమ్యూనిస్టు ప్రణాళిక రెండో భాగంలో మార్క్స్-ఏంగెల్స్ కార్మిక వర్గానికీ, కమ్యూనిస్టులకూ మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరించారు. కార్మికవర్గ ప్రయోజనాలే కమ్యూనిస్టుల ప్రయోజనాలు అందువల్ల బూర్జువా వర్గంతో కార్మిక వర్గం అనేక దశలుగా జరిపే వర్గపోరాటంలో ''కమ్యూనిస్టులు ప్రతి చోటా, ఎల్లప్పుడూ శ్రామికవర్గ ఉద్యమం మొత్తానికి ప్రతినిధులుగా ఉంటారు'' అని చెప్పారు. మరి కార్మికులందరూ కమ్యూనిస్టులు కారు కదా, తేడా ఏమిటి? దీనిపై వివరణ ఇస్తూ కమ్యూనిస్టులు ''కార్మికవర్గం పయనించే మార్గాన్ని మొత్తంగా, సైద్ధాంతికంగా గ్రహించగలరు. మొత్తం కార్మికోద్యమ పరిస్థితుల్నీ దాని సాధారణ అంతిమ ఫలితాన్నీ కూడా వారు అర్థం చేసుకోగలరు. కనుక, ఈ విషయంలో అత్యధిక కార్మిక జన సామాన్యానికి లేని వెసులుబాటు వారికి ఉంటుంది'' అని చెప్పారు.
కార్మికులు ఒక వర్గంగా రూపొందడం, బూర్జువా వర్గ ఆధి పత్యాన్ని కూలదోయం, కార్మికవర్గం రాజకీయ అధికారాన్ని గెలుచు కోవడం కమ్యూనిస్టుల తక్షణ కర్తవ్యమని పేర్కొం టూ కమ్యూనిస్టుల నిర్ధారణలు ''ఎవరో ఒక అభినవ విశ్వ సంస్కర్త కనుగొన్న భావాల పైనో, సూత్రాలపైనో ఆధారపడవు'', నేటి వర్గపోరాటం నుండి తలెత్తే వాస్తవ సంబంధాలను అవి వ్యక్తం చేస్తాయి అని తెలిపారు.
కమ్యూనిస్టులు సొంత ఆస్తిని రద్దు చేస్తామంటున్నారనీ, వారు అధికారంలోకి వస్తే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు పోతాయనీ, కుటుంబ విలువలూ, సంస్కృతీ సంప్రదాయాలూ నాశనమవుతాయనీ బూర్జువాలు చేసే కువిమర్శలను ఈ భాగంలో మార్క్స్-ఏంగెల్స్ పూర్వపక్షం చేశారు. కమ్యూనిస్టులు సొంత ఆస్తిని రద్దు చేస్తామంటున్నారంటే అర్ధం బూర్జువా ఆస్తిని రద్దు చేయడమే, ఎందుకంటే అత్యధిక సంఖ్యాలకులైన కార్మికులకు అసలు సొంత ఆస్తి అంటూ ఉండదు. నిజానికి సొంత ఆస్తి గతంలో కూడా రద్దు అయింది. బూర్జువాలు ఫ్యూడల్ ఆస్తిని రద్దు చేశారు. ఇప్పుడు కార్మికవర్గం బూర్జువా ఆస్తిని రద్దు చేస్తుంది. ''బూర్జువా సమాజంలో సజీవ శ్రమ అనేది పోగుపడిన శ్రమ (యంత్రాలు, పెట్టుబడి వగైరాల)ను పెంచడానికి తోడ్పడే సాధనం మాత్రమే, కమ్యూనిస్టు సమాజంలో సోగుపడిన శ్రమ కార్మికుని మనుగడను విస్తృతం చేయడానికీ, సుసంపన్నం చేయడానికీ, పెంపొందించడానికీ తోడ్పడే సాధనం. కనుక, బూర్జవా సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది, కమ్యూనిస్టు సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తుంది. బూర్జవా సమాజంలో పెట్టుబడికి స్వాతంత్య్రం, వ్యక్తిత్వం ఉంటుంది కానీ బతికున్న మనిషికి స్వాతంత్య్రమూ ఉండదు, వ్యక్తిత్వమూ ఉండదు'' అని చెపుతూ ''ఈ పరిస్థితుల్ని రద్దు చేయడం అంటే స్వేచ్ఛనీ, స్వాతంత్య్రాన్నీ రద్దు చేయడమే అని బూర్జువావర్గం అంటుంది. నిజమే, సందేహం లేదు. బూర్జువా స్వేచ్ఛనూ, బూర్జువా స్వాతంత్య్రాన్నీ, బూర్జువా వ్యక్తిత్వాన్నీ రద్దు చేయడమే మా ఉద్దేశం'' అని వారు ప్రకటించారు.
బూర్జువా సామాజిక రూపాలు, దాని భావజాలమూ, సంస్కృతీ శాశ్వతంగా ఉండబోవనీ, బూర్జువా ఆస్తి సంబంధాలు మాయం కావడంతోనే అవి కూడా అంతరించి పోతాయని చెప్పారు.
కమ్యూనిస్టు ప్రణాళిక మూడో భాగంలో మార్క్స్-ఏంగెల్స్ ఆనాటి సోషలిస్టులకు సంబంధించిన వివిధ రూపాలను గురించి వివరించారు. నాల్గవ భాగంలో ఆనాటి ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి గురించి చెబుతూ ఆయా దేశాల్లో అభివృద్ధి నిరోధక శక్తులను ఓడించడానికి బూర్జువా వర్గానికి చెందిన ఏఏ పార్టీలతో కలుస్తారో వివరించారు. అదేసమయంలో కమ్యూనిస్టులు ''బూర్జువా వర్గానికీ కార్మిక వర్గానికీ మధ్య శత్రు వైషమ్యం ఉందన్న విషయాన్ని స్పష్టాతిస్పష్టంగా కార్మిక వర్గానికి నేర్పడాన్ని ఒక్క క్షణం కూడా మరువరు'' అని పేర్కొంటూ ''క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతి చోటా అప్పుడున్న సామాజిక రాజకీయ వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగే ప్రతి విప్లవోద్యమాన్నీ కమ్యూనిస్టులు బలపరుస్తారు'' అని ప్రకటించారు.
చివరిగా వారు తమ చారిత్రక పత్రాన్ని కింది మాటలతో ముగించారు:
''కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలనూ, లక్ష్యాలనూ దాచుకోడానికి అసహ్యించుకుంటారు. ఆనాటి సకల సామాజిక పరిస్థితులను బలవంతంగా కూలదోయడమే తమ లక్ష్యమని వారు బాహాటంగానే ప్రకటిస్తారు. కమ్యూనిస్టు విప్లవాన్ని తలచుకుని పాలక వర్గాలను వణకనీ, శ్రామికులకు పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప. వారు గెలుచుకోడానికి ఒక ప్రపంచం ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి!''
- ఎస్. వెంకట్రావు