Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడప్పుడూ ఉనికికో, స్వార్ధానికో
ఉన్నపళంగా యుద్ధాలు ఊడి పడతాయి
సూర్యుడిని మింగిన సముద్రం ఎర్రగా నవ్వినట్టు
నగంగా ఉన్న నడిరేయిని కొంటే గాలి ఓరగా చూసినట్లు
తెల్లగా నవ్వే చంద్రుడిని నల్ల మబ్బు మింగేసినట్లు అప్పుడప్పుడు ఆకాశాన్ని పొగలు తెర కప్పెసినట్టు
ఇలా నిశబ్ద యుద్ధాలన్నీ
దశాబ్దాల చరిత్రలో మిగిలిస్తూ ఉంటాయి
యుద్ధమంటే
విభాగాలుగా విడదీసిన భూమిమీద
భాగాలుగా పడిఉన్న బాడీల భయంకర రూపం
ఆవిరవుతున్న ఊపిరిల మధ్య
రాలి పడుతున్న బూడిద
ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉచ్వాస ,నిశ్వాసల మద్య
శవాలు కాలే కమురు వాసన
చిత్తయిన నేలమీద
పాదాలు తాకే పచ్చి నెత్తురు
తల్లి శవం మీద రక్తం
పాల కోసం ఏడ్చే పసివాడు ఏడు పై పారుతుంది
తెగిపడ్డ నాన్న భుజం
కోల్పోయిన భరోసా
సమరంలో ఉన్న సఖుడిని తలుచుకుంటూ
ఒంటరిగా చెలి పాడుకునే విలాప గీతం
ఆకలి కన్నీళ్లు, కరువు ఏరులై పారడం
గాయమైన కాలం ,గాలితో పాటుగా గేయమయ్యి పాడటం
యుద్ధమంటే
దేశాల హద్దుల దగ్గర
దేహాలను సరిహద్దులు చేసుకున్నా
జవాను జీవితాలకు జ్యోతుల ప్రదర్శన కాదు
వాళ్ల దేహాల మీద కప్పె దేశపు జెండా అసలే కాదు
యుద్ధమంటే
మనిషికి మనిషికి
మనసుకు మనసుకు మధ్య
గీస్తున్నా గిరి గీత
గడిచిన చరిత్రకు, నడుస్తున్న నాగరికతకు
నశించిన జీవితానికో ,నడుస్తున్న బ్రతుకుకో
మిగిలిపోయిన గాయం
గుర్తొచ్చినప్పుడల్ల కాలం పాడుకున్న గేయం
ఒక యుద్ధం
బ్రతుకు భారమైన చోట
మెతుకు కరువైన చోట
జీవితమే ఒక యుద్ధం
ఇప్పుడు కొత్తగా ఏ యుద్ధాన్ని రమ్మని నేను అనను కావాల్సిందల్లా ఇప్పుడు
కనుకరించే కన్నీళ్లు
కరుణించే ప్రేమే
అంతేకానీ యుద్ధం కానే కాదు
- పి.సుష్మ, 9959705519