Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మటాలెంట తిరిగి తిరిగి వంశ పటమై
దేవుని మాన్యమై
గుట్ట కింద రేగడితో గుసగుసలాడే ఈదుల మధ్య నెమలినారు కింద పురి ఇప్పునోడు నిలబడ్డ పశువు కలబడ పోద్ది ఎండిన కొమ్మ ఇగురేస్తది వైద్గమొ మంత్రమో కాని పసరు పిండి పాణం పోసేది
బయి పట్టి అచ్చుగట్టి చెట్లుపెట్టి తాళ్లు నిలిపి మర్రి మీద
ఆకాశాన్ని దించి ఆత్మని పుదిచ్చుకొని పచ్చుల్ని
పిలుచుకుంటు పోయిండు అటు పడ్డ అడుగులే
దిరిశనచెట్లు దిగులు పడ్డయి తక్కడపూలు తల దించుకున్నయి ఎర్రకట్లపూలు ఏడ్చినయి మంకోడు
ఏడ మంకెనపూలు పూసిండో బాట తప్ప మాట లేదు
గాలెంట గాలయ్య గల్మ దాటిండు
ఎనుక కెనుక ఎద లిప్పిన వనం వెన్నెల బాయిగడ్డ
పూసగుచ్చినట్టు వానొచ్చే ఎండొచ్చే వెన్నెల తెప్పొచ్చే
తోవలు దీసి దుఃఖాలు బాపి బలగమే బలమన్నోళ్ళు
సద్ది ముచ్చట్లు జెప్పే కాపిశ్క కండ్ల కామంచికి కల్లం
కాంచనకంచం నూరుదాకా ఏరు ఊరు దాటని నడిపోల్ల పుల్లయ్య సూరులో సుట్టాకు మరిసి పోయిండు
పిట్ట పిల్లలు పెట్ట పిల్లలు పిల్లజెల్లలతో కిచ కిచ మనే
ఎంటువ ఎటు పడేదో కుందొలు ఏ పొదల కులబడేదో
కలుగులో పాము కలుగులోనే పిల్లలు ఊరుకుతుంటే సాల్వ ఎగురుతుంటే వొగిరిచ్చి వొగిరిచ్చి పొద్దుగుకేది పిల్లలు పిట్టలు మర్రికింది దేవదూతలు మేడి కొమ్మ మీద ఉన్న
పాల గోకు మీదే పాణముండేది ఏ రంగుల రిబ్బనో నిద్రకళ్ల మీద వాలుతుంటే నుదుటి మీద కలలుకుట్టిన వెన్నెల బాసింగం ఎన్ని ముచ్చట్లో ఎన్ని కథలో ఆరు బయట ఆకాశం కిందికి వొంగి ఊ కొట్టేది మట్టిగోడల మీద
అలికిన ఆత్మ పూతలు యెద సిల్లి పోయిన
గోరెంక రెక్కలు ఇప్పేది సిబ్బి మీద మెతుకు మెరుస్తుంటే
కలి కన్న కల కడుపునిండ నీర దార ఆర పడుతే నిదుర ఇచ్చికోని అంతరం ఆవు పెయ్య ఆట నెల్లి కొమ్మల మీద ఊర బిష్కల ఊపు ముని మాపు ముచ్చట గుర్తుకొచ్చేది
సుట్ట కుదురు మీద బర్కత్ గల్ల బాయిగడ్డ
పొద్దుగూకే తెల్లారే దినదుఃఖం కొలుసుకొని జామెల్లి పోతుంది పచ్చదనం లేదు పచ్చి ఎగరలేదు వాలిందిలేదు రాలింది లేదు గొడ్డు మేఘము కింద గోడుమన్న చెట్లు
మడికట్ల మీద మాట వొరిగింది భుజం మీది
కండువ మొఖం మీదికి జరిగింది ఎద్దు గిట్టల మీది
మట్టిని దులిపింది మట్టెంట మట్టెంటా తిరిగింది మట్టే
ఏ అడుగు ఎటు పడ్డదో బతుకు తీసిన బాట కెరుక
ఇడుపున పిడిప్పని వల ఇద్దలెన్ని తెలిసినా ఇద్దయ్యకు
ముద్ద లేదు గాండ్రించిన గండయ్యకు గండె లేదు
ఈదురు గాలికి రంగోల్ల లచ్చయ్య రాగమొనికింది నీల్లల్లా
నిరుడి నీరుకంటి లేదు ఎన్ని కలలు కన్న ఎన్ని వలలున్నా
కాలం చిక్కంలో పడదు ఎత్తు పండ్ల ఎంకడు అన్నట్టు
ఎదిగింది ఎడబొచ్చే మిగిలింది నక్క పీతిగడ్డే
సూస్తుండంగనే తన్నుకబోయే పచ్చులొచ్చే తరాల సొరాలు మారి ఎక్కిల్లసప్పుడే లేదు ఎద ముచ్చటే లేదు ఎకరం ఎంతుంటేంది ఎద్దుకు బలముంటేంది కాన్పు కాని
కల్లం కండ్లల్ల తిరుగుతుంటే కంటి సూరుకింద కొలకుండ
నేల ఇడిసి సాముజేస్తున్నారు
యజ్ఞాలకు ఆవిరయ్యే ఆజ్యం కాదు మట్టి
యుగాలకు కాలం మోసినోళ్లు ఏ క్షణము నైనా నిలదీస్తారు ఏలు బడిని ఎత్తి కడతరు
మతం కమతం కాదు మట్టి రంగు లెన్నో రంగరించుకుంది పూలెన్నో పూస్తుంది ఒక రంగు కాదు
ఒక పువ్వు కాదు మనిషి ఆత్మ పూసిన తోట
మనిషికి మట్టికి అలయి బలయి బందముంది
ఇంటి ఆడపిల్ల అలుకుతుంటే పొయ్యి చెయ్యి పట్టుకుంది
వొత్తునిండా కాగిన దుఃఖం కలలల్లిన ఆకాశం
పాదెండిన పందిరయ్యింది పాణం కన్నీళ్ల బలం మీదుంది
బాయిగడ్డ దేవుని పటమైంది.
- మునాసు వెంకట్,
9948158163