Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో అన్ని ఘటనలు
పనికొచ్చేవేమీ కావు
పనికి రాని వాటిని
ఉద్దేశ పూర్వకంగానే
డిలిట్ చేస్తూ పోవాలి
అవి అరాచకాలను
వారసత్వంగా మోసుకొస్తాయి!
తరాలు మారినవి
తల రాతలు మారినవి
మానిన గాయాల్ని చిదిమి
కారం చల్లే ఫైల్సును
మనమే సెల్ఫ్ డిలిట్ చేయాలి!
మహాత్ముని మరణము
జాతికి పెను విషాదం
హంతకుడు దేశ భక్తుడంటే
జాతి నిలువునా చీలిపొతది
సత్యాలు అర్ధ సత్యాల కలయిక
ఆగమాగం చేయక మునుపే
ఉద్రేకపు ఫైల్సును డిలిట్ చేయాలి!
శివుడు చేదును
గొంతులో దాచుకుంది
భవిష్యత్తును కలగన లేక కాదు
లోక కళ్యాణం కాంక్షించే వారు
కొన్ని లోలోననే అదిమి పట్టాలి
ఆసేతు హిమాచలం
అఖండ భారతాన్ని కలగనే వారు
సహ జీవన ఫైల్సును
రిలీజ్ చేయాలి!
మార్గ దర్శనం చేయాల్సిన చరిత్ర
మనిషి చేతికి ఆయుధాలిస్తే
శాంతి కాముకులంతా
అప్రస్తుత ఫైల్సును
డిలిట్ చేయాలి!
విద్వేష గీతాలేవీ
పూలు పూయించవు
భిన్న సంస్కతుల సౌందర్యమే
జాతి నుదుటన హరి విల్లులను పూయిస్తది!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261.