Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో మేధావులు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరుల మార్గదర్శనం ఫలితంగా హరిత విప్లవం, క్షీర విప్లవం, శ్వేత విప్లవం వంటి అనేక ఆవిష్కరణలు చూశాం. ఈ కోవలోనే హాలుడు, పంపకవి, జిన వల్లభుడు, పాల్కురికి, పోతన, కాళోజీ, దాశరథి, సినారెల వేలయేండ్ల సాహిత్య వారసత్వం కలిగిన తెలంగాణ నేల మీద మన బడి పిల్లలు మరో అక్షర విప్లవాన్ని సృష్టించారు. 'మన ఊరు-మన చెట్టు' పేరుతో జరిగిన 'బాలల కథా రచనా మహావిష్కరణ'.
పూర్వాపరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తర్వాత తెలంగాణ ప్రాంతంలో బాలల సాహిత్య సృజన దిశగా అనేక ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావానంతరం తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, సాహిత్య అకాడమిలతో పాటు, డా.మాడభూషి రంగాచార్య స్మారక సమితి, మానేరు రచయితల సంఘం, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి, తెలంగాణ బాల సాహిత్య పరిషత్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, డా.చింతోజు బ్రహ్మయ్య ట్రస్ట్, రంగినేని చారిటబుల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, ప్రగతి ట్రస్ట్, మేడ్చల్ రచయితల సంఘం, జాతీయ సాహిత్య పరిషత్, తెలంగాణ సారస్వత పరిషత్, పిల్లల లోకం, భద్రాద్రి కొత్తగూడెం బాలోత్సవం, శ్రీ వాణి సాహితి సమితి, దక్కన్ సాహిత్య సభ, బాల చెలిమి, తెలంగాణ సాహిత్య కళా పీఠం, మన లైబ్రరి, దక్కన్ సాహిత్య సభ, శ్రీ ఫౌండేషన్, లక్ష్యసాధన ఫౌండేషన్, సుగుణ సాహితి సమితి, గురజాడ ఫౌండేషన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, అక్షరాల తోవ, సాహితీ కౌముది వంటి మరికొన్ని సంస్థలతో అనేక ప్రాంతాల్లో సృజనశాలలు జరిగాయి. గరిపెల్లి అశోక్ నమోదు చేసినదాని ప్రకారం దాదాపు 380కి పైగా తెలంగాణ బడి పిల్లలు రాసిన పుస్తకాలు అచ్చయ్యాయి. 2017లో నిర్వహించిన తెలంగాణ తొలి 'ప్రపంచ తెలుగు మహా సభలు' మరింత భూమికను ఏర్పరచడమే కాక స్ఫూర్తివంతం చేశాయి.
ఇదంతా ఒక పార్శ్వమైతే, 'కోవిడ్-19' పరిస్థితుల దృష్ట్యా రెండు సంవత్సరాల పాటు పిల్లలు బడికి దూరం కావడం, అంతర్జాల తరగతుల వంటి వాటి దృష్ట్యా విద్యార్జన, బోధన, చదువు వంటివి ఎంతగా కుంటుపడ్డాయో మనకు తెలుసు. ఒక తెలంగాణలోనే కాదు, విశ్వవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మళ్ళీ పిల్లలను బడికి దగ్గర చేయడం, పుస్తక పఠనంలోని ఆనందాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 'చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు' పేరిట ప్రారంభించిన పథకం 'రీడ్'. వసంత పంచమి, 2022 న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కోవలోనే తెలంగాణ విద్యాశాఖ సమగ్రశిక్ష, ఎస్.సి.ఈ.ఆర్.టిల ఆధ్వర్యంలో నూరు రోజుల పాటు విలక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
ఇదంతా ఒక ఎత్తయితే, ఈ ఆలోచనలకు అతీతంగా, చరిత్రలో 'నభూతో..' అన్నట్టు 'మన ఊరు-మన చెట్టు' అంశంపై ఒక కొత్త చారిత్రక ఆవిష్కరణ తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ సమన్వయంతో జరిగింది. 'రీడ్'లో భాగంగా ఈ కార్యక్రమం జరిగినప్పటికీ పిల్లల్లో చదువుతో పాటు మానవ జాతిని కాపాడుతూ, మానవ వికాసానికి, నాగరికతకు మూల కారణమై నిలిచిన ప్రకృతి పట్ల బాల్యంలోనే అవగాహన కల్పించడమే కాక పిల్లలతో ఆ ప్రకృతికి అక్షర నీరాజనం అర్పించే దిశగా చేసిన గొప్ప ప్రయత్నం. ఇటీవల జరిగిన అనేక సర్వేలు మన పిల్లలు సరిగ్గా రాయడం లేదని, చూసి చదవడం లేదని వాపోతున్న తరుణంలో సాహిత్య అకాడమి వద్ద నమోదైన వివరాల ప్రకారం ఐదు లక్షల మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని రచనలు చేయడం చరిత్రలో ఒక కొత్త నమోదు. సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఆలోచనలకు కార్యరూపంగా మార్చి 4, 2022 న జరిగిన రచనా శాలలో ఒక్క తెలుగులోనే కాక మన పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, ఓడియా, కన్నడంతో పాటు గిరిజన భాషలైన బంజారా, గోండి మొదలైన భాషల్లో ప్రధానంగా కథలు, గేయాలు, కవితలు రాయడంతో పాటు రంగురంగుల బొమ్మలు కూడా గీయడం విశేషం.
అందరూ ఆశ్చర్యపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, స్వచ్ఛంధంగా ఐదు లక్షల మంది బడి బాలలు కలం పట్టి ఒకే రోజు కథా యజ్ఞంలో పాల్గొని రచన చేయడం సాధారణమైన విషయం కాదు. తెలుగు నేల మీద, అందులోనూ తెలంగాణలో గతంలో అనే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ నమోదు, విజయం సాధారణమైంది కాదు. తెలంగాణలోని 11000 బడుల్లో ఒకే అంశంపైన, ఒకే రోజున, ఒకే సమయంలో తమ ఊరు గురించి, తమకు తెలిసిన చెట్టు గురించి రాయడం అరుదైన, అపురూపమైన ముచ్చట. నిజానికిది సాహిత్య అకాడమి చేసిన సరికొత్త ప్రయోగం కూడా.
మార్చి 4న జరిగిన మహా కథా యజ్ఞం గురించి సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ మాటల్లో చెప్పాలంటే 'సాహిత్యం కేవలం ప్రౌఢ దశలో ఉన్నవారికి, పండితులకే కాదు, పల్లెల్లో మట్టి వాసనల్లోంచి పరిఢవిల్లే.. పరిమళించే మట్టి చేతుల నుండి అద్భుత కథలు వెలువడిన రోజు. అంతేకాక తెలంగాణ సార్వత్రిక సంపదకు ప్రతిరూపం ఈ కార్యక్రమం. సాహిత్యం సమాజం మార్పుకు దోహదపడాలి. ఇందుకు యువశక్తి సృష్టికర్త కావాలి. బలమైన పునాది మంచి సమాజం ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. అందుకోసం మానవ సంపద సృష్టించాలి. చదవడం, రాయడం, పరిణామానికి కారణం అవుతుంది. ఎందరు ప్రభావితమైతే అంత ఉపయోగం. సృజన కాల్పానిక శక్తితో మార్పు వస్తుంది. ప్రభావితమైన వారు తప్పు చేయరు. చేయనివ్వరు. అలాంటి వారు తయారయ్యేందుకే ఈ కార్యక్రమం'.
తెలంగాణ సాహిత్య అకాడమి తలపెట్టిన ఈ కథా యజ్ఞానికి విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయం చేయడం ఈ విజయంలో ప్రధాన ఘట్టం. రూపొందించిన జూలూరి గౌరీశంకర్, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సంచాలకులు శ్రీమతి దేవసేన ఐ.ఎ.ఎస్తో పాటు ఎ.ఎస్.పి.డి. గాజర్ల రమేశ్, రీడ్ నోడల్ ఆఫీసర్ సువర్ణ వినాయక్‌లతో పాటు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన జిల్లా, మండల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంధి అభినందనీయులు. సువర్ణ వినాయక్, 'పిల్లల సృజనాత్మక వ్యక్తీకరణకు అవకాశాల్విడం తప్పనిసరి. దీనిని సామర్థ్యంగా చేర్చామని, తెలంగాణ తెలుగు వాచకాలు పిల్లల అభివ్యక్తి సామార్థ్యాలకు బాటలు వేసేవిగా ఉన్నాయని, విద్యార్థుల్లో మళ్ళీ కనీస సామర్థ్యాలను పెంపొందించేందుకు 'రీడ్'ను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అకాడమి నిర్వహించిన కథల యజ్ఞం వల్ల పిల్లల భాష, నేపథ్యం, పిల్లల ప్రపంచం ఆవిష్కరించబడతాయన్న'ది నిజం.
జూలూరి గౌరీశంకర్ ప్రకారం ఈ కథా యజ్ఞంలో పాల్గొన్న చిన్నారుల కథలన్నీ తొలుత క్షేత్రస్థాయిలో ఆయా బడులు, మండలాలు, జిల్లాల్లో పరిశీలన చేసి, ఉత్తమంగా నిలిచిన వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో వచ్చిన వాటిలోంచి 1001 కథలను ఎంపిక చేసి మన 'బాలల బృహత్ కథా సరిత్సాగరం'ను వారసత్వ సంపదగా అందించాలని చూడడం పిల్లలకు అకాడమి ఇచ్చే గొప్ప తాయిలమే కాదు, భరోసా కూడా! 6 నుండి 10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొన్న ఈ కథా యజ్ఞం ఉన్నఫలంగా జరగలేదు. దీనికి ఎంతో మోధో మథనం జరిగింది. ముప్పై మూడు జిల్లాల విద్యాధికారులతో అకాడమి, అధికారులు తొలుత జూం ద్వారా అవగాహనా సమావేశంతో పాటు రోడ్‌మ్యాప్ కోసం కసరత్తు చేశారు. సాధ్యాసాధ్యాలను చర్చించి 'రికార్డుగా నమోదు కాని ఈ అరుదైన రికార్డు' కోసం ముందే ఆన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కథా రచన పట్ల అవగాహన కలిగించేందుకు వందలాదిగా స్థానిక రచయితలు, కవులతో కార్యశాలలు జరగడం చూడొచ్చు. కొన్ని పాఠశాలల్లో అంతర్జాలం ద్వారా అవగాహన కార్యక్రమాలు జరిగితే, మరికొందరు ఔత్సాహికులైన రచయితలు, బాల వికాస కార్యకర్తలు అనేక రకాల వీడియోలు రూపొందించి వాటిని యూట్యూబ్ ద్వారా పిల్లలకు, బడులకు చేరేలా చేశారు. కథా యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉపాధ్యాయిని ఉప్పల పద్మ 'విద్యార్థుల్లోని ప్రతిభా పరిమళాలు, అంతర్లీన శక్తులు వెలికి తీయడానికి కథా యజ్ఞం తోడ్పడిందని, పిల్లల్లో ఉత్తేజాన్ని, పర్యావరణం పట్ల బాధ్యతను మరింత పటిష్టం చేసిందని, విద్యార్థుల్లోనే కాక ఉపాధ్యాయుల్లోనూ స్ఫూరిని కలిగించింది' అనడం చూడొచ్చు. డా.వి.ఆర్. శర్మ 'ఇలాంటి అద్భుతం ప్రపంచ చరిత్రలోనే జరిగి ఉండదేమో!' అంటారు. గరిపెల్లి అశోక్ అన్నట్టు 'జూలూరి ఆలోచనతో ఆవిర్భవించిన ఈ బడి తెలంగాణ కథలు రేపటి మన కథకులు చేస్తున్న చిట్టి పొట్టి సంతకాలు.'
తెలంగాణ సాహిత్య అకాడమి తమ బాధ్యతగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఎత్తైఏ, వీటిలోంచి కథలను ఎంపికచేసి బృహత్ సంకలనంగా తేవడం మరో ఎత్తు. లక్షల కథల్లోంచి అకాడమీ ప్రచురించగా మిగిలినవి జిల్లా స్థాయిల్లో విద్యాశాఖ లేదా స్వచ్చంధ సంస్థల సహకారంతో 'నూరు కథల' సంకలనాలుగా తెస్తే బాగుంటుంది. మిగతావి ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యా కమిటీలు తల్లితండ్రుల సహాయంతో పాఠశాల స్థాయి కథలతో పుస్తకాలుగా తెచ్చినట్టయితే అకాడమి ఆశించి, నిర్వహించిన యజ్ఞఫలితం దక్కుతుంది. ఇది మన పిల్లలు నమోదు చేసిన సరికొత్త రికార్డు. రేపటి మేధో తెలంగాణ దిశగా మన పిల్లలు ముందస్తుగా చేసిన వాగ్దాన సంతకం. భవ్య తెలంగాణ వైపుగా మన పిల్లలు మనతో కలిసి వేస్తున్న లేలేత పాదాల అడుగులు. ఈ ఆడుగులు రాబోయే కాలంలో మహా ప్రస్థాన యాత్రగా సాగుతాయన్నది నిజం. కవులుగా, రచయితలుగా, విద్యావంతులుగా మన చిన్నారులు ఎదిగే క్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చేసిన సరికొత్త ప్రారంభం ఈ కథా యజ్ఞం. జయహో! బాల సాహిత్యం.
-డా || పత్తిపాక మోహన్