Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణ కాశ్మీరంగా ఖ్యాతిగాంచిన దట్టమైన అడవుల పచ్చపచ్చని సోయగాల చెలికాడు. అడవి బిడ్డలను నిద్ర లేపడానికి, నిద్రలేని పంక్తులను సష్టిస్తున్న సజనకారుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి. పట్టా పొందిన మొట్ట మొదటి పరిశోధకుడు. బలమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్న గొప్ప భావుకుడు. దేవరాజు మహారాజు, తెలిదేవర భానుమూర్తి, టి. కష్ణమూర్తి యాదవ్‌ల సాహితీ వారసుడు. తెలంగాణ పల్లెల్లోని ఆర్తిని, ఆర్ద్రతను స్పశించిన ఆత్మీయుడు. మైదాన ప్రాంత, గిరిజన సంస్కతులకు వెలుగులు పంచే వన్నెకాడు. కొమరం భీమ్, రాంజీ గోండుల పోరు వారసుడు. తెలంగాణ మట్టి పొరల్లోంచి వచ్చే నిశ్వాస బాసకు సాహిత్య దశను కల్పించిన మట్టికవి డా. ఉదారి నారాయణ గారు.
''ఆదిలాబాద్ మిత్రులంటే/ అరుదైన ఆనందం నాకు/ కుంటాల జలపాతమున్నందుకే కాదు/ అది కంటతడిని ప్రతిబింబిస్తున్నందుకు/ అక్కడి కవులు/ ఆకులు దూసినంత సహజంగా/కవిత్వం రాస్తారు/ ఉదారి నారాయణ/ అక్షరాల్లో ఆకుపచ్చని అడవిని నడుపుతాడు/ ఆదిలాబాద్ వెళ్లి వచ్చినప్పుడల్లా/ నాకు అంతరంగంలోకి/ వెళ్లి వచ్చినట్లుగా ఉంటుంది''. అంటారు ఆచార్య ఎన్. గోపి. 2001లో డా. ఉదారి నారాయణ ''ఆకుపచ్చని ఎడారి'' కవితాసంపుటాన్ని 27 కవితలతో ముద్రించారు. రచయిత తన అమ్మ భూదేవికి ఈ గ్రంథాన్ని అంకితం చేశారు. దీనిలో 17చిమ్నీలు కూడా వెలిగించారు. ''కాకి ఇల్లు మీద వాలింది/ పొయ్యికి దిగులు జ్వరం''. ఇలా అన్నీ ఆలోచింపజేసేలా, హదయానికి హత్తుకునేలా ఉన్నాయి. రెండు పంక్తుల చిమ్నీలు మెరుపుల్లాంటి చరుపులను కలిగి ఆచార్య ఎన్. గోపి నానీలను గుర్తుకుతెస్తాయి. ''మరణిస్తూ చేసిన/నీ చిరునవ్వు వీడ్కోలు/జనం భరించడం కష్టమవుతున్నది'' లాంటి కవితా పాదాలు పాఠకుని మదిని తొలిచివేస్తాయి. కవి ఆకాంక్షను వెల్లడి చేస్తాయి. ఈ వయ్యికి ప్రజాకవి కాళోజి నారాయణరావు అందించిన ముందు మాటలో ''తెలంగాణ యాసలో, అందులో ఆదిలాబాద్ జిల్లా పదాలతో కూడుకున్న గేయాలు ఎంతో సజీవంగా ఉన్నాయి. ''ఇక్కడో గూడెముండాలి/ ఏవీ చూరుకింద చుట్టల వెలుగులూ?/ ఇక్కడో జీవకళ పచ్చగా మెరిసేది/ఏవీ అలికిడి ఆనవాలు?/ గుర్తుపట్టడానికి ఎప్పుడైనా/ ఒక్క విషాద చుక్కను రాల్చామా!/ దేవులాడడానికి ఎన్నడైనా/కళ్ళ రంజాన్లు/ కరిగి కాలువలయ్యాయా!/ నవ్వుతూ, నడకలోనే నర్తిస్తూ/ తూనీగల్లా తేలియాడే రేల రేలలు/ నిద్రలోనే గాలిలేని బెలూన్లవ్వడం/ చూపుల సంచులు విప్పకుండానే/ఛాతి బాదుకోవడం తప్పంటామా!/ కొన్ని జీవితాలు/ వడ్డన నిండిన విస్తర్లు కావచ్చు/ కొన్ని జీవితాలు/ పురుగులు మేసిన పుండు కావచ్చు/ కానీ.../ ఆకుపచ్చని ఎడారిని/ బహుశా.../ ఏ కళ్ళ కెమెరాలు పీల్చక పోవచ్చు'' అంటూ ఆకుపచ్చని ఎడారి జీవితాన్ని ఆవిష్కరించారు. అంతులేని బాధను, ఆశ్రోశాన్ని, ఆక్రందనను గర్భీకరించుకున్న కవిత ఇది. మానవార్తి నులివెచ్చగా తగిలే వాక్యాలివి. కళ్ళ రంజన్లు కరిగి కాలువలవడం. చూపుల సంచులు విప్పకుండానే ఛాతి బాదుకోవడం. ఆదిలాబాద్ జిల్లాలో వందలాది మంది గిరిజనులు అతిసారా, మలేరియాలకు బలైపోయినపుడు ఉదారి నారాయణ చలించి రాసిన కవిత ఇది. దీంతో పాలకుల పట్టింపులేనితనాన్ని అర్థం చేసుకోవచ్చు. తరతరాలుగా అంటురోగాల బారినపడుతున్న తండాల దీనత్వాన్ని చూపించారు. వారి బతుకులను బాగుపరిచే నాథుడు ఇంత వరకు కానరాకపోవడం విషాదకరం. ''ఇక్కడి మూలవాసుల్లో వర్గభేదం, లింగ అసమానతలు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేవు, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత'' అని బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త, ఆదివాసీల ఆశాజ్యోతి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ విధాన నిర్ణేతలకు, సామాజిక కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంత వరకు ఆదివాసీలకు అనువైన విద్య, సాగుభూమి భద్రత, స్థిరమైన నివాసం, మౌలిక వసతుల కల్పన, జీవనగతులపై సానుకూలతలను కల్పించలేక పోవడం విడ్డూరం.
ఈ ''యాల్లైంది'' పుస్తకంలో మొత్తం 46 కవితా ఖండికలున్నాయి. ఇందులో పది వరకు యాది కైతలున్నాయి. కాళోజీ, బాలగోపాల్, సద్దాం హుస్సేన్, పాగల్ ఆదిలాబాదీ, గజానన్, విద్యార్థి చావు, గిరిజనుల మరణాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైన విషాద సంఘటనలను, విపత్కర సన్నివేశాలను కవి అశ్రుబిందువులను సిరాచుక్కలుగా మలుచుకొని లిఖించాడు.
యక్షగానాలు, వీధి నాటకాలు, మొదలైన జానపద కళారూపాలు ఏనాడో కనుమరుగై పోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా రేడియో నాటికలే ఆ లోటును పూడ్చుతున్నాయి. డా. ఉదారి నారాయణ ''పెండ్లి సంబరాలు, హాస్టల్ చదువులు, మహిళలు-అత్యాచారాలు, చేనేత పరిశ్రమ, తీర్థ యాత్రలు, రైతు జీవితంలో పశువుల పాత్ర, బొడ్డెమ్మ పండుగు, మొహమాటం, పొలాల పండుగు, పత్తి రైతుల అవస్థలు, ప్రియ భాషణం మొదలైన 11 లఘు నాటికలను ''అరుగు మీది ముచ్చట్లు'' పేరుతో పుస్తకంగా కూర్చినారు. ఈ నాటికలలో బాబాయి, వెంకన్న, లతమ్మ అనే ముచ్చెటగా మూడు పాత్రలుంటాయి. బాబాయి చదువుకున్న పెద్ద మనిషి, లోకం పోకడ తెలిసినవాడు. వెంకన్న, లతమ్మల మధ్య సమన్వయకర్తగా ఉంటాడు. లతమ్మ పల్లె తనానికి ప్రతీక. సంసారాన్ని చక్కదిద్దు కోవడంలో దిట్ట. ప్రేమ, దయ, సహకార భావాలు గల ఉత్తమ ఇల్లాలు. వెంకన్న వట్టి అమాయకుడు. తెలిసీ తెలియని తనంతో మాట్లాడుతాడు. ఈ నాటికల ద్వారా రచయిత ఉదారి నారాయణ వినోదంతోపాటు గొప్ప విజ్ఞానాన్ని అందించారు. ఆదిలాబాద్ ఆకాశవాణి శ్రోతలను ఈ నాటికలు ఎంతగానో అలరించాయి. హాస్యంతో ఉర్రూతలూ గించాయి. పల్లీయులకు కనువిప్పును కలిగించాయి. నేటి సమాజానికి నాటికల అవసరాన్ని తెలియ జేశాయి. స్థానీయత ఉట్టిపడేటట్టు రచనలు చేసిన ఉదారి నారాయణ అభినందనీయులు.
తెలంగాణ కవులు కలం కవాతు చెయ్యడానికి సిద్ధంగానే ఉంటారు. ''అయ్యలారా! మన సిద్ధార్థుల మీద/సత్యకామా జాబాలి, అరుంధతి వారసుల మీద/నామాల నజరు పడకుండా/ కోరల నీడలు సోకకుండా/పదిలంగా దాచుకోండ్రి-పాణంగా సూసుకోండ్రి/ఆటలో మునిగినపుడు/ ఆదమరిచి నిదురించేటపుడు/ ఒక కన్నేసి ఉంచుండ్రి'' అని మాగిపొద్దు సంపుటిలోని పులి సంచారం కవితలో గోముఖ వ్యాగ్రం వంటి హైందవం గురించి హెచ్చరిక జారీ చేశారు. ప్రశ్నించే గొంతులను ఉత్తరించే దుర్మార్గాలను ఖండించారు. నాల్గు పడగల హైందవ నాగరాజు కోరలను ఊడదీయాలన్న కాంక్షను వెలిబుచ్చారు. మను ధర్మశాలలో...'' శంభూకుడు, ఏకలవ్యుడు/నీ తాత ముత్తాతలు/ నాలుగు పడగల కోరలకు/ నేలకొరిగిన వాళ్లే/ తోడేలు చుట్టుముట్టినపుడు/ కడసారి అరుపులే తప్ప/ భరోసా బతుకులెక్కడ''. ఇందులో దారుణాలకు కారణమైన హైందవ వ్యవస్థ మీద ఆగ్రహం కనబడుతుంది. అగ్ర కులోన్మాదానికి రోహిత్ వేముల లాంటి మేథావులైన విద్యార్థులు బలైపోతున్నారు. మతం పేరిట మనుషుల్ని విభజించి పాలించే విధానాలు అంతమవ్వాలని కవి ఆశించారు. మనిషి సష్టించుకున్న మతమే మనిషిని బుగ్గిజేయడం శోచనీయం. మాగిపొద్దులో 46 కవితలను వాసీలో రాశిగా పోశారు. వీటిలో ఇతివత్త వైవిధ్యం, అభివ్యక్తిలో భిన్నత్వముంది. కవి అస్తిత్వ ఆకాంక్ష, జీవితంలోని ఆటుపోట్లు, అలజడులను బలమైన కవిత్వంగా తీర్చిదిద్దారు. భావనాబలంతో, బలమైన అభివ్యక్తితో రాశారు. మనిషి మనిషిగా మిగలడమే మానవజన్మకు సార్థకత. మంచి కోసం నిలబడడం, మనిషి కోసం కలబడడం ఈయన కవిత్వంలో కనిపిస్తుంది. ఈ కవిత్వం ఉదారి నారాయణ రచనా పరిణతికి, పరిపక్వతకు గీటు రాయిగా నిలుస్తుంది.
''కండ్లలో జాలి/కడుపులో ఖాళీ/ఎవరండీ వీళ్లు/ ఆదిలాబాదీయులు'' అని అడవి బిడ్డల ఆకలి బాధను అక్షరాశ్రువులతో చిత్రించిన ఉపకారి. ''నా నేల/ వేడెక్కుతోంది/ సూర్యుడితో కొంత/ ఉద్యమాలతో అంతా'' అంటూ పోరాటాల గడ్డ ప్రత్యేకతను తెలి పారు. నారాయణ నానీల్లో స్థానీయత, సామాజికత, మానవీయత, కళాత్మకత ద్యోతకమవుతాయి. చురుకైన వ్యంగ్యం, సుకుమారమైన చమత్కారంతో పాఠకులను ఆకట్టుకుంటాయి. ఖలీల్ జిబ్రాన్ ప్రకారం ''వ్యాఖ్యానమును అపేక్షించే రచన సజన కాదు''. రచనలోని విషయం ఎంత సుళువుగా ఉంటే, వినేవారికి, చదివేవారికి అంత సుళువుగా అర్థమవుతుంది. అపుడు రచయిత కషి అంత కంతకూ సార్థకమౌతుంది.
ఈతి బాధలను ఇంపైన వినసొంపైన తత్త్వాలుగా మలచిన ఉదారి నాగదాసు తత్త్వ సాహి త్యంలో చిరస్మరణీయుడు. కులమతాలను, విగ్రహా రాధనను నిరసించిన ఆదర్శప్రాయుడు. జీవుడే దేవుడు. ఆత్మనే పరమాత్మ. నిరాడంబరమే నిజమైన జీవన మార్గమని ప్రబోధించాడు. జనన మరణాలపై జనంలో నెలకొన్న భయాన్ని పోగొట్టి, స్వచ్ఛమైన జీవితం గడపడానికి తోడ్పడ్డాడు. సామాజిక సమస్య లను నిరసించడం. ప్రశ్నించడం, ఎదిరించడం వీరి తత్త్వం. 1962లో ఈయన రాసిన శ్రీ శివరామ దీక్షితాచల గురు భజన తత్త్వ కీర్తనలు'' మరాఠీ, హిందీ భాషలలో పుస్తకాలుగా వచ్చాయి. దీనినే 1974లో తెలుగులో ముద్రించారు. ఈ వరకవి వారసత్వం నుంచి వచ్చిన వారే ఉదారి నారాయణ. తన తండ్రి సామాజిక చింతనను, సాహిత్య వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. డాక్టర్ ఉదారి నారాయణ ఆదిలాబాద్ జిల్లా, తాంసి మండలంలోని బండల నాగాపురంలో ఫిబ్రవరి 3, 1964న జన్మించారు. తల్లిదండ్రులు ఉదారి భూదేవి, నాగదాసు. 1991లో ''కె. శివారెడ్డి ఆసుపత్రి గీతం వస్తువు-సన్నిధానం'' అనే అంశంపై ఎం.ఫిల్. పూర్తి చేశారు. 2001లో ''ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పహ''అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి. పట్టాను అందుకున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగిస్తున్నారు. 2001లో ఆకుపచ్చని ఎడారి, 2011లో యాల్లైంది, 2017 లో మాగిపొద్దు కవితా సంపుటాలను వెలువరించారు. 2018లో అరుగు మీది ముచ్చట్లు లఘు నాటికలను సంపుటీకరించారు. 2019లో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఆదిలా బాద్ జిల్లా సాహిత్య చరిత్రను అచ్చేసారు. 2020లో ఆదిలాబాద్ నానీలు వెలువరించారు. 2012లో ఆదిలాబాద్ జిల్లా కవుల తెలంగాణ ఉద్యమ కవి తలు, పాటలతో కూడుకున్న ''ఎల్గడి'' సంకలనానికి సంపాదకత్వం వహించారు. ప్రజాశక్తి, సాక్షి దిన పత్రికలలో ''మా ఊరి ముచ్చట్లు'' శీర్షికన తెలంగాణ భాషలో హాస్య, వ్యంగ్యాత్మక కథనాలు రాశారు. 2000 సంవత్సరంలో తన తండ్రిగారైన ప్రముఖ తత్త్వకవి ఉదారి నాగదాసు పేరున స్మారక సాహితీ సంస్థను నెలకొల్పి, పల్లెల్లో కవిత్వ ప్రచారం, తత్త్వ గీతాలు ఆలపించడం, ఉపన్యాసాలు ఇప్పించడం లాంటి అనేక రకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
''ఒక పెద్ద దేశం. చిన్న దేశాన్ని అణచివేయాలని చూస్తే, నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోని మెజారిటీ మతం, చిన్న మతాన్ని అణగద్రొక్కాలని చూస్తే, నేను చిన్న మతం వైపు నిలబడతాను. ఆ మైనారిటీ మతంలో కులాలుండీ, అందులో ఒక కులం, మరో కులాన్ని అణగద్రొక్కా లని చూస్తే, నేను అణచివేతకు గురయ్యే కులం వైపు నిలబడతాను. ఆ అణచివేతకు గురైన కులంలో, ఒక యజమాని తన నౌకరుని అణచి వేస్తుంటే, నేను ఆ నౌకరి వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్నీ కాలరాస్తుంటే, నేను ఆ నౌకరి భార్య వైపు నిలబడి, గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేదేమిటంటే, అణచివేత అనేది ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు''అని పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్ చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇలాగే డా. ఉదారి నారాయణ కూడా పీడితజన పక్షం వహిస్తున్నారు. సహజ వనరుల దోపిడీని నివసిస్తున్నారు. ఆధిప త్యాలను, అణచి వేతలను ధిక్కరిస్తున్నారు. సంఘ సంస్కరణ కొరకు సామాజిక పరివర్తన కొరకు కవిగా పాటుపడుతున్నారు. ప్రజాస్వామిక విలువలు పరిఢ విల్లజేయడానికే రచయితగా కషి సల్పుతున్నారు.
- కూకట్ల తిరుపతి, 9949247591