Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నదుల ఇరువైపులా నాగరికతలు పురుడు పోసుకుని, నగరాలు నిర్మించబడతాయి. అలాగే మనుషులకు ఇరు వైపులనే కాదు అన్ని వైపులా వెతలు నెట్టుకొచ్చి, కన్నీళ్ళు కొట్టుకొచ్చి, కథలు, పాటలు, కవిత్వం అల్లబడుతుంది. ఈ నేల మీద ఆ సాహిత్య అల్లికకు నాగరికతకున్నంత చరిత్ర ఉంది. అలాంటి చరిత్రలో గతంకంటే భిన్నంగా, సాంప్రదాయలు బద్దలుకొడుతూ, అర్థం లేని నిర్భంధాలను వ్యతిరేకిస్తూ ఎంతో మంది అమ్మాయిలు కవియిత్రులుగా ముందుకొస్తున్నారు. అయితే ముస్లిం మహిళల నుంచి కవయిత్రులు పుట్టుకురావడం మిగతావాళ్ళతో పోలిస్తే చాలా కష్టతరమైన విషయమే. అలాంటి కష్ట నష్టాలను దాటుకుని, 'మలాల' పోరును నెమరు వేసుకుంటూ ముస్లిం యువతులు నేడు కవిత్వం రాయడం స్వాగతించాల్సిన సందర్భం. అంతకు మించి అండగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటి వరకు ఈ తరగతి నుంచి వచ్చిన కవయిత్రులు కేవలం వేళ్ళ మీద లెక్కగట్ట గలిగేంత మేరకే ఉన్నారు. తెలంగాణ గడ్డమీద షాజహాన, జరీనా, నస్రీన్ వలెనే ఆ సాలులో ఇప్పుడు కొత్త కవితా విత్తనమై జవాబు కావాలి అని నిలదీస్తూ సలీమా మొలకెత్తింది.
మొదట్లో అమ్మాయిలకు చదువు అసలే అవసరం లేదు. ఆ తర్వాత అమ్మాయిలకు పెద్దగా చదువు అవసరం లేదు అనేవారికి కొదవలేదు. కానీ చదువుల తల్లి మాత్రం సరస్వతి. అని గొంతు చించుకుని పూజిస్తూ విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తున్న పరిస్థితి. ఒక పక్క కట్టు, బొట్టు, జుట్టు, పిలక అని లెక్కలేసుకునే మతంవారు మరో మతంవారి హిజాబ్‌పై రుబాబు చేస్తూ అమ్మాయిల వెంట పడుతూ వేధిస్తున్న కాలం ఇది. ఈ కాలంలో ఇలాంటి సంఘటనలన్నింటికి 'జవాబు కావాలి' అని తన కవిత్వం ద్వారా ప్రశ్నిస్తూ బయలుదేరింది సలీమా. చాలా వరకు ఏ కవికయినా తొలి రోజుల్లో భావ కవితారంభం తప్పదు. కానీ సలీమా అలా కాదు. మా చదువుల తల్లి సావిత్రీబాయి పూలే అని ప్రకటిస్తూ తన కవితా ధారను మొదలుపెట్టింది. ఒక ముస్లిం స్త్రీ సావిత్రిబాయి పూలేను యాది చేసుకున్నదంటేనే తన భావ విస్తతి వేర్లు ఎంత లోతుగా వేళ్ళూనుకుని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే అనేక ప్రశ్నలకు తను జవాబులు వెతుకుతూ, మనల్ని కూడా వెతకమని కోరుతుంది. అక్కడక్కడ జవాబులు చెప్పమని అడుగుతుంది కూడా. అయితే ఈ పుస్తంలోని దాదాపు అన్ని కవితల్లో శ్రమించే మహిళలనే కావ్య నాయికలుగా తీసుకుని రాయడం జరిగింది. ఇది శ్రమ పట్ల, శ్రామికుల పట్ల కవయిత్రి సలీమాకు ఉన్న గౌరవం మాత్రమే కాదు. వారు వివిధ చోట్ల విభిన్న రూపాల్లో ఎదుర్కొంటున్న అణిచివేత, అసమానతలు కూడా కారణమేనని అర్థమైతుంది. అంతేకాక ఒక జర్నలిస్టుగా సలీమాకు విషయ సమగ్రత ఉన్నది. అంతకంటే ముందు ఆమెకు ఎస్ఎఫ్ఐ ఉద్యమ పునాదులున్నాయి. అందుకే ఆమె విప్లవాత్మక దక్పథంతో ''జవాబు కావాలి'' రాసిందని చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అలాగే తనకు స్పందించే హదయం ఉన్నది. కన్నీటికి కాన్నీటిని ముడివేసి బాధను పంచుకోని హదయగతం చేసుకోగలిగే తత్వం సలీమాకు ఉన్నది. కనుకనే సలుపులకు గురైన ఆమె మేధస్సు చైతన్య ప్రవాహ క్రమంలో కవిత్వ దారుల్లోకి రాగలిగింది.
నలభై ఒక్క కవితలున్న ఈ సంపుటి నిండా ముస్లిం మహిళా జీవితాలతో పాటు, స్త్రీ ఎదుర్కుంటున్న హింస, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, నిర్భంధం, శతిమించిన కట్టుబాట్లు, వేదనలతో నిండిన అంతర్మథనం ఉంటుంది. మహిళా కవిత్వమే అయినా పుస్తకం నిండా వస్తు వైవిధ్యానికి కొరత లేదు. ''సరిహద్దుల్లో సైన్యానికి ధీటుగా/ చీపురుపట్టి రోడ్లను/ శుభ్రం చేస్తూ ఆమె మాత్రం/ కనిపించని శత్రువుతో/ యుద్ధం చేస్తూనే ఉంది..'' (చేతులకు ప్రణామం) అంటూ మున్సిపల్ కార్మికురాలి చేతులకు ప్రణామం చేస్తుంది. ముస్లిం మహిళ ఇంట్లో వివక్షను చవిచూస్తే, ఈ దళిత మహిళా సమాజం మొత్తం చేత చిన్నచూపు ఎదుర్కొంటుంది. ఆ జీవన, వివక్షా సారుప్యం వల్లనే ఇక్కడ సలీమా కాబట్టే దళిత మహిళ చేతులకు ప్రణామం చేయగలిందనిపిస్తుంది. ''ఏ దుల్హన్ చేతుల్లోనో/ ముస్తాబయ్యే తీరొక్క/ రంగు గాజులను/ దిద్దేందుకు మా చేతులను/ మసి బొగ్గులను చేశాం..'' (బతుకు) అని గాజుల తయారీ కార్మికుల సమస్యల్ని వెలికితీస్తూ, వారి పక్షాన ఓ కార్మిక సంఘంలా నిలబడుతుంది. తన సూక్ష్మమైన అధ్యనాసక్తిని కూడా మనం ఈ కవితలో గమనించవచ్చు. ''ఇప్పుడు ఆమె మనసూ శరీరంతో పాటు/ కన్న కలలు సైతం ఒకరి వశమయ్యాయి/ పిల్లల్ని మాత్రమే కాదు/ కమ్మని కలలు కనాలన్నా/ అతని అంగీకారం కావల్సిందే..'' (కలల సౌధం) అంటూ తనకు తాను మిగలకుండా పోయిన మహిళా స్థితిని, అపరిష్కత వ్యధను వలపోస్తుంది. తనకు తెలియకుండానే పరాయీకరణకు గురైన స్త్రీ గతిని చిత్రిక పట్టి చూపిస్తుంది. సలీమా వస్తు వైవిధ్యత తనకు అనేక అంశాల మీదున్న పట్టును ఇది తెలియజేస్తుంది.
సలీమా కవిత్వంలోని సరళత మనల్ని తన అక్షరాల వెంట నడిపిస్తుంది. అలా అలవోకగా తీసుకెళ్తూ హఠాత్తుగా చిక్కదనాన్ని కుమ్మరిస్తుంది. నూతన పద ప్రయోగాల్ని మనపై విసురుతుంది. మహిళల చాకిరి గురించి చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇక 'బండెడు చాకిరి' అని రాస్తుంది అనుకుంటాం. కానీ ''బరువెక్కిన హదయంతో / ఇంటెడు చాకిరిని/ ఒంటరిగా భుజాలకెత్తుకుంటుంది..'' (కష్టావధానం) అంటుంది. అలా ఎవరూ సహాయం చేయని ఇంటి పనిని ఆమె ఒక్కతే చేసుకుంటూ ఒళ్ళు పచ్చి ముద్దైంది అని సలీమా పాత పద్ధతుల్లో అనలేదు. ''వర్షించే కంటి దారలతో/ తడిసే ఆమె చెక్కిళ్ళు/ ఎవరికీ కనబడని/ పచ్చి బండలయ్యాయి..'' అని వర్ణిస్తుంది. అవసరమైతే ఉర్దూ తెలుగు కలిపి కవితా పాదాలు పూరించి మెప్పించగలదని నిరూపించింది. ''రక్త మాంసాలు పంచుకుంటూ/ కంచుకోట లాంటి గర్భ గుడిలో/ చాంద్‌కి తుకుడాలా పెరిగాను..'' (మా తుఝే సలాం) అని బిడ్డకు అమ్మ పొత్తిళ్ళు శత్రు దుర్భేద్య కంచుకోటగా వర్ణన చేస్తుంది. ఈ భూమి మీద గుడి అంటే అది అమ్మ గర్భం మాత్రమేనని, ఆ ప్రదేశాన్ని మించిన పవిత్రమైన ప్రదేశం ఏది లేదని తీర్మానిస్తుంది. ''ఆకాశమనే సముద్రాన్ని/ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు/ త్వరత్వరగా ఈదేసిన చంద్రుడు/ అలసిపోయి వేకువ జామున మాయమై పోతాడు..'' అని ఆకాశాన్ని సముద్రం చేసి చంద్రున్ని ఈతగాడిగా మార్చివేసి సలీమా కాల్పనికతను జోడించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అనేక నిర్ధిష్ట సమస్యలను, సామాజిక రుగ్మతలపై ఈ పుస్తకం చాలా నిర్మాణాత్మకంగా ప్రస్తావించింది. అమ్మాయిల మీద అత్యాచారాలు లేని సమసమాజం మరింత తొందరగా రావాలని, దేశాన్ని అట్టుడికించిన నిర్భయ, దిశ లాంటి ఎన్నో ఘటనలు సలీమాను కవిత్వం రాసేలా పురికొల్పాయని అనిపిస్తుంది.
ముస్లిం సాంప్రదాయవాద మూర్ఖత్వాలను ఎనిమిది కవితల్లో సలీమా ప్రశ్నించింది. పరదా చాటు జీవితాలను వెలుగు నీడల్లా మన ముందుంచింది. ఇంత ఆధునిక సమాజంలో కూడా చదువులకు, స్వేచ్చకు దూరం చేసే పద్ధతులను ఎత్తిచూపింది. ''పండు వెన్నెలను పంచాల్సిన నిండు జాబిలిని/ కారు మబ్బులు కమ్మేసినట్టు/ పరదా చాటున/ గడప దాటనీయని/ జీవితాలు ఎన్నో..'' (ఎన్నో..ఎన్నెన్నో) అంటూ సాంప్రదాయం పేరిట గుండె నిండా ఊపిరి కూడా హదయానందంగా పీల్చలేక ఉక్కిబిక్కిరి అవుతున్న జీవితాల కోసం సలీమా అంతర్మధనం చెందుతుంది. సనాతన సంకెళ్ళను తెంచుకుని ముస్లిం మహిళ కూడా అభివద్ధిని, ఆనందాలను పంచుకోవాలని ఆకాంక్షింస్తుంది. ''తలుపు చాటున నిలబడి/ అతని అనుమతికై/ దీనంగా చూస్తున్న ఆమె శరీరం/ ఎన్ని గాయాలను చవిచూసిందో..'' (మానని గాయాలు) అని ముస్లిం స్త్రీలు పంటి బిగువున అనుభవిస్తున్న ఎన్నో సలుపుతున్న గాయాలను గేయాలుగా మార్చి వినిపించింది. భర్తల అనుమతుల కోసం జీవితాంతం ఎదురుచూస్తూ మతులు పోయే దీనవస్థ జీవితాలను అక్షరీకరించింది సలీమా. అంత లోతుల్లోకి వెళ్ళి తను రాయగలగడానికి కారణం నిత్యం తను చూస్తున్న జీవితాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ''నల్లటి గుడ్డలో బలవంతంగా చుట్టేయబడ్డ దేహాన్ని/ కర్ణకఠోరంగా వినిపించే అతని హుకుం/ అందర్ జావ్..'' (కష్మ కష్) అంటుంటే సలీమా మాత్రం మూర్ఖ సాంప్రదాయ హింస నుంచి, వెట్టి చాకిరి నుంచి, మానని గాయాల నుంచి, విముక్తికి 'బాహర్ ఆవ్..' అని మహిళలకు పిలుపునిస్తుంది. నిజానికి ఏ మతంలోనైనా మూఢ సాంప్రదాయలను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. మతాలను మరింత ప్రజాస్వామికీకరించాల్సిన అనివార్యత కూడా ఉన్నది. మనుషుల కోసం మతాలు సష్టించబడ్డాయే కానీ మతాల కోసం మనుషులు పుట్టించబడలేదు. అనే సైన్స్ సలీమాకు బాగా తెలుసు కనుకనే ఇలా రాయగలిగింది. నిజానికి ఇలా రాయాలంటే చాలా ధైర్యం అవసరం. అంతటి సాహసీక వనిత సలీమా. కాబట్టే మహిళా విముక్తికి సిద్దపడింది. కనుకనే స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, హింసా దారుణాల నుంచి మహిళను రక్షించడం కోసం వ్యవస్థల్లోని మహిళ పడుతున్న అవస్థలను బోల్డ్‌గా రాయడానికి పూనుకున్నది. కాబట్టి మనిషి మీద కంటే మతాల మీద ప్రేమలు ఎక్కున్నవారు నొచ్చుకోకుండా పుస్తకం పూర్తిగా చదవటం చాలా అవసరం.
- ఎం. విప్లవ కుమార్,
9515225658