Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న సామాజిక వర్గాల మధ్యన ప్రేమ వారధులని కథల ద్వారా నిర్మిస్తున్న మార్గదర్శి హనీఫ్. కనాకష్టంగా వెళ్లదీస్తున్న సింగరేణి బొగ్గుబాయి కార్మికుల జీవితాలు, మరోవైపు పేదరికంతో తండ్లాడుతున్న ముస్లింల అగచాట్లు, కొత్తగా గ్రామాల్లోకి సైతం దూసుకు వస్తున్న హిందూత్వోన్మాదాన్ని సామరస్యంగా, సంయమనంతో ఎదుర్కొనే అలయి-బలయి సంస్కతిని, పీర్ల పండుగనాటి బత్తీస పేర్ల తియ్యందనాల భాషలో అందించిండు. చిన్న చిన్న వాక్యాలతో, పదునైన పదాలను హిందూ-ముస్లింల దోస్తానా మజ్బూత్ అయ్యే తీరుగా రాసిండు. 11 కథల సంపుటిలో తెలంగాణ గ్రామాల్లోకి సైతం విస్తరించుకుపోయిన 'మనువాదాన్ని, దాని మూలంగా గాయపడ్డ ముస్లిం గుండెలు స్రవిస్తున్న దు:ఖాన్ని చిత్రిక గట్టిండు. నిజాల్ని నిజాలుగా, నిర్భయంగా చెప్పుకోలేని స్థితిని, గుడ్లల్లో సుడులు తిరిగే కన్నీళ్లను కనబడనీయకుండా, ఎనుకటి గౌరవాన్ని కాపాడుకునేందుకు ముస్లిం సమాజం మూగగా పడుతున్న వేదనను చెప్పిండు. కనీసం తిరగబడు, కలెబడు, కొట్లాడు అనకుండా ఒక సూఫీలాగా ఉన్మాదులకు సైతం 'సద్బుద్ధి' కలుగుగాక అంటూ దీవెనలు ఇస్తూ హనీఫ్ కథలల్లిండు. సూఫీ తత్వాన్ని వింగడిస్తూ రాసిన కథలివి. అదే సమయంలో పరిధి, పరిమితికి లోబడి వివక్ష రూపాలను, దోపిడీ తీరును, దౌర్జన్యాలు, దుర్మార్గాల సాలును, పాలకుల పీడనను, పీడకుల పాలనను చెప్పాల్సిన మేరకు చెప్పిండు. హక్కుగా దక్కాల్సింది దక్కడం లేదు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అట్లా తెలియని వారు ఈ కథలు చదివినట్లయితే చైతన్య వంతులవుతారు. చైతన్యవంతులైనవారు అన్యాయాల్ని సరిదిద్దే మార్గాన్ని, పద్ధతిని వాళ్ళే నిర్ణయించుకుంటారని హనీఫ్ ఉద్దేశం.
ఇవ్వాళ తెలంగాణ ముస్లిం జనాభా మెజారిటీగా నగరాలకు, పట్టణాలకు పరిమితమయింది. అందులో అత్యధిక శాతం పేదరికంలో కునారిల్లుతున్నరని సచార్ కమిటీ తేల్చి చెప్పింది. కొన్ని విషయాల్లో దళితుల కన్నా హీన స్థితిలో ముస్లింలున్నారని చెప్పింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో, వ్యవసాయ రంగంలోనూ ముస్లింలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండడంతో అక్కడ కొంత మేరకు వారికి రాజకీయ ప్రాతినిధ్యం, బిజిపియేతర పార్టీల్లో కొంత ప్రాధాన్యత దక్కుతుంది. రైతుల హక్కులను హరించే చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిలో ముస్లింలు, ముస్లిం నాయకులూ ఉన్నారు. అదే సమయంలో ఈ నాయకులు ముజఫర్ పూర్ గాయాలను, ఢిల్లీ మారణకాండను తడుముకుంటున్నారు. డిల్లీ షాహిన్‌బాగ్ పోరాటాలు, బలవంతంగా రుద్దిన మర్కజ్ మరకలు నిత్యం వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కథకుడు హనీఫ్ ని ముస్లిం జీవితాల్లోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చిన వాడిగా గుర్తించాలి. రాజకీయ చైతన్యానికి దారులు వేసిన దార్శనికుడిగా అభినందనలు చెప్పాలి.
మసీదులు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అంతే గానీ అక్కడ గుమిగూడే ప్రజలు తమ హక్కుల గురించి ఐక్యంగా ప్రశ్నించడం లేదు. కనీసం అక్కడ ప్రశ్నించాలి అని కూడా చెప్పడం లేదు. దీనివల్ల మెయిన్ స్ట్రీమ్ పొలిటిక్స్‌లో వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎవరైనా ఇవన్నీ ఎదుర్కొని ఎదిగొచ్చినా హిందూత్వ వాదులు వారిని ఈజీగా 'ఫండమెంటలిస్ట్'గా ముద్రవేసి మెజారిటీ ప్రజల చేత నమ్మించ గలుగుతుండ్రు. రాజకీయంగా సమాధి చేస్తున్నరు. ఈ సందర్భంలో హనీఫ్ కథలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్తానీ, చోటీ, 'ఇప్పుడే వస్తా', 'అల్విదా' లాంటి కథల్లో మతాలకు అతీతంగా మానవీయ సంబంధాలు ప్రజల మధ్య ఎట్లా పెనవేసుకున్నాయో చెప్పిండు.
ప్రశ్నలను సమాధి చేసే అగ్రకుల, మతాధిపత్యాన్ని నిలువరించేందుకు, ఇంకా చెప్పాలంటే అధిగమించేందుకు హనీఫ్ పీడితులైన 'ముస్లిం-బహుజన' సమాజం మధ్యన ఒక వారధి నిర్మించడానికి తన కథల ద్వారా ప్రయత్నించిండు. 'ఈద్ కా చాంద్', 'ఓ పెంపకం కథ', 'చోటే', 'పాకిస్తాని' కథల్లో బహుజన ముస్లిం మైత్రి బంధాన్ని చిత్రించిండు. దీన్ని 'హిందూత్వ' చెద ఎట్లా తినేస్తుందో, ఎందుకు అప్రమత్తంగా ఉండాలో కూడా చెప్పిండు. 'బిడ్డ పురిటికొచ్చింది', 'ఎక్కాలు రానోడు' కథల్లో బహుజనులతో పెనవేసుకున్న ముస్లింల జీవితాన్ని చిత్రికగట్టిండు. గొల్ల, కుర్మోళ్ల దగ్గర గొర్లు కొని ఆదివారం అంగట్ల, లేదా కటికోళ్లకు అమ్ముకొని జీవించే వలి నిత్యం పేదరికంలో ఎట్లా సస్తూ బతుకుతుండో చెప్పిండు. కొని - అమ్మే లోపలే గొర్రె చనిపోతే దానికి ప్రభుత్వాధికారుల నుంచీ, కటికోళ్ల నుంచి ఎట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులెదు రయితాయో గుండెల్లో తడి చెదరకుండా చెప్పిండు. అంతర్లీనంగా కుటుంబ నియంత్రణ విషయంలో ముస్లింలపై వచ్చే అభియోగాలకూ సమాధాన మిచ్చిండు. ఆధునిక కాలంలో ఎనుకటి నుంచి కొనసాగుతూ వచ్చిన ప్రేమలు ఎట్లా కలుషితమవు తున్నాయో రాసిండు. హిందూత్వోన్మాదులు ముస్లిం లను 'కసాయి'లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకు ప్రతిగా హనీఫ్ ముస్లింలలోని కారుణ్యాన్ని కండ్ల ముందుంచిండు. అమాయకుడయిన ముస్లింని తన ఊరోళ్ళే 'హిందూత్వ'ని అడ్డంబెట్టుకొని నిలువునా ముంచినా క్షమాగుణమే గొప్పది అన్నంతగా ఒక సూఫీ బోధకుడిలాగా 'ఎక్కాలు రానోడు' కథను మలిచిండు. ఇదే కథలో మాదిగలు-ముస్లింల ఫుడ్ కల్చర్ గురించి బీఫ్ గురించి చర్చ చేసిండు. ఇయ్యాల 'నియ్యతి'కి 'బర్కత్' లేక పోయినప్పటికీ నీతి తప్పని మనుషు లను మనముందుంచిండు. హనీఫ్ మాట్లాడేప్పుడు ఎంత సున్నితంగా ఆచితూచి నొప్పించకుండా మాట్లాడుతాడో, రాతలో కూడా అదే పద్ధతిని పాటించాడు. హనీఫ్ కవి కూడా కావడంతో కథల్లోనూ వాక్యాలపై ఆ ప్రేమ, పదాలు, పదబంధాల వాడకం లోనూ ప్రావీణ్యత కనబడుతుంది. ''గొర్రె శ్వాస ఆడుతుంటే వలి ఆశ మారాకు వేస్తుంది'' అంటూ పాత్ర భావోద్వేగాలను పాఠకుడికి కనెక్ట్ చేస్తాడు. ఇట్లాంటివి ప్రతి కథలో ఉన్నాయి.
హనీఫ్ స్వయంగా సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగం చేసినవాడు కావడంతో షిప్టు సమస్యలను, వారసత్వ ఉద్యోగాల ప్రకటనలు, అవి కార్మికుల కుటుంబాల్లో పెట్టే చిచ్చును కథలుగా మలిచిండు. మానవీయ బంధాలను 'పూలు తెరిచిన బంధాలు' లాంటి కథల్లో నిక్షిప్తం చేసిండు. పెద్దవాళ్ళు ఏ మాత్రం సోయి లేకుండా వ్యవహరించడం వల్ల చిన్న పిల్లలు మానసికంగా ఎంతగా గాయపడతారో 'పాకిస్తానీ' కథలో చెప్పిండు. ఎవరో బాంబు పేల్చిన పాపానికి మొత్తం ముస్లిం సమాజం ఆ నిందను ఎందుకు భరించాల్సిన స్థితి ఏర్పడిందో ఆలోచించాలని చెబుతాడు. 'అల్విదా'కథలో పెంచినతల్లి హిందువు కావ డంతో ఆమె అంత్యక్రి యలు ఎట్లా చేయాలి? నా అనుకున్న వాళ్ళే కడచూపుకు కూడా రాకపోవడాన్ని ఆసక్తి కలిగించే విధంగా చెప్పిండు. ఈ కథ గురించి ఇంతకు ఒక్క ముక్క ఎక్కువ రాసినా పాఠకుడిని తప్పుదోవ పట్టించినట్లయితది.
హైదరాబాద్ పై పోలీసు చర్య సందర్భంలోనూ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, 2014 ముందటి మలి దశ పోరాట సమయంలోనూ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలంగాణ వాదిగా చెప్పిండు. నిజానికి రజాకార్లలో దొరలు, భూస్వాములు, ప్రభుత్వాధికారులు, బహుజనులు, దళితులు ఇట్లా అన్ని వర్గాల వారు ఉన్నారు. అయితే ఈ వర్గాల్లోని కొందరు చేసిన దాడులకు మొత్తం ముస్లిం సమాజం బలయింది. ఇప్పటికీ హైదరాబాద్ రాజ్యంలో ముస్లిం ప్రజలని హిందూత్వ పార్టీలు రజకార్లుగా పోలుస్తున్నాయి. నిజానికి ఏ పాపం ఎరుగని రంజాన్ బీ భర్త దొరల చేతిలో హతమయిండు. ఆ హత్యాకాండను తలుసుకుంటూ రోజు దు:ఖిస్తూ బతుకుతున్న రంజాన్ బీ కండ్లముందరే ఈ సారి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొని 'జనజీవన స్రవంతి'లో కలిసిన కొడుకు జాకీర్ హత్య మరింతగా కలిచి వేసింది.
1948 నుంచి ప్రతిసారీ ముస్లింలు మెజారిటీ మతస్థులకు ఎట్లా సాఫ్ట్ టార్గెట్ గా మారింది, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు ఎట్లా వాడుకుంటున్నదీ, దాని పట్ల లౌకిక సమాజం మరింత జాగరూకతతో ఎందుకుండాలో చెప్పిండు. 'రంజాన్ బీ దు:ఖం' పేరిట రాసిన కథ 70 ఏండ్ల తెలంగాణ ముఖచిత్రాన్ని లిఖించిండు. మూడు ఉద్యమాలను కలుపుతూ దారులు వేసిండు. నవాబుల పాలనలోనూ వ్యవసాయం చేస్తూ కష్టపడి, ఆత్మగౌరవంతో బతికిన కుటుంబం 'హైదరాబాద్ పై పోలీసు చర్య అనంతరం ఎట్లా ఛిద్రమయిందో చెప్పిండు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని సామాన్య ముస్లిం ప్రజానీకం దొరల దాష్టికాలకు భూములు, భూములతో పాటు పాణాలు కోల్పోయిన తీరుని రికార్డు చేసిండు. ఇంతవరకు చరిత్రలో ముస్లిం పాలకుల చేతిలో బలయిన హిందువుల గురించే రికార్డయింది. దీనికి చిలువలు పలవలు చేర్చి జరిగిన ప్రచారం మరొక ఎత్తు. అయితే ఇదే సందర్భంలో అటు పటేలు సైన్యం, దాని అండ చూసుకొని దాడులకు తెగబడి ముస్లింల ఆస్తుల్ని కొల్లగొట్టిన దొరల గురించి పెద్దగా సాహిత్యంలోనూ, చరిత్రలోనూ రికార్డు కాలేదు. హనీఫ్ రచన ఈ విషయంలో తెలుగు సాహిత్యానికి కొత్త చేర్పు. ఈ దాడుల్లో రంజాన్ బీ భర్తను కోల్పోయింది. ఉన్నొక్క కొడుకు పెరిగి 1990వ దశకంలో నక్సలైట్ ఉద్యమంలోకి పోయిన తీరు, ఆ తర్వాత తిరిగొచ్చి హౌటల్
పెట్టుకొని, లేట్ వయసులో పెండ్లి చేసుకొని తన బతుకేదో తాను బతుకుతూ ఉంటే హిందూ మూకలు సూటలేని, గర్భిణీగా ఉన్న కోడలును, కొడుకుని సజీవదహనం చేయడంతో ఆమె దు:ఖానికి అంతు లేకుండా పోతుంది. ఇట్లా జీవిత కాలం ఏడుస్తూ 90 ఏండ్ల వయసులోనూ శోకమే మిగలడాన్ని గుండెలో తడి ఉన్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తుంది.
దాదాపు ఇందులోని కథలన్నీ తెలంగాణ ఏర్పాటయ్యాక రాసినవే. ఇవి నడుస్తున్న తెలంగాణ చరిత్రకు అద్దం అని చెప్పవచ్చు. పెరుగుతున్న హిందూత్వ-ఉన్మాద శక్తుల దాష్టికాలు, కొనసాగుతున్న 'రంజాన్ బీ దు: ఖం', 'ఇప్పుడే వస్తా అని ఆక్సిడెంట్లలో మాయమైన మనుషులు, 'బిడ్డ పురిటికొస్తే' బారసాల ఏమో గాని రెండు పూటల తిండి సరిగ్గా పెట్టలేని ధైన్యం, మోసానికి సైతం మతం ఆసరా తీసుకొని అమాయకులను ముప్పుతిప్పలు పెట్టే 'ఎక్కాలు రానోడు' కన్నీళ్లు, కల్మషం లేని మనసుల్లో మత విద్వేషాలను రగిల్చే 'పాకిస్తానీ' ముద్రలు, సింగరేణిలో 'వారసత్వ' కొలువులు అంటూ నేటి సమాజాన్ని లోతుగా పరిశీలించి న్యాయమైన తీర్పులను హనీఫ్ తన కథల ద్వారా ప్రకటించాడు. ఈ తీర్పులను ఆచరించి, ప్రచారం చేయాల్సిన బాధ్యత మొత్తం లౌకిక సమాజం మీద ఉ న్నది. ఇవ్వాళ బహుజనులే మెజారిటీ లౌకిక సమాజం. అందుకే ఈ బాధ్యత బహుజనుల మీదే ఎక్కువగా ఉన్నది. ఈ బాధ్యతలను గుర్తు చేస్తూ, కథలల్లిన హనీఫ్ కు అభినందనలు. భవిష్యత్ పై బహుజనులకు భరోసా కల్పించినందుకు అభినందనలు.
- సంగిశెట్టి శ్రీనివాస్