Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండపల్లి నీహారిణి ఇప్పుడు కొత్త కవితా సంపుటి 'కాల ప్రభంజనం' శీర్షికతో ఒక ప్రభంజనంలా కాలం ముందుకు దూసుకు వచ్చారు. 73 కవితలు, భిన్న వస్తువులు, అనేక పార్స్వాల సమాహారం ఈ సంపుటి. విద్వన్మణుల కుటుంబ నేపధ్యం. పుట్టినింటి సౌజన్యం, సామాజిక సేవాగుణం, ఇటు మెట్టినింటి వారి చిత్రకళా విద్వత్తు. ఒకవైపు బొమ్మ, మరోవైపు బొరుసు. ఐతే నీహారిణి గారు నాణేనికి ఇరువైపులా తానే అయి నైపుణ్యంతో భిన్న ప్రక్రియలను సుసాధ్యం చేసుకుంటూ సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తున్న విదుషీమణి.
ఒక వైపు ఆధునికత మరోవైపు సాంప్రదాయపు ముగ్దత్వం, ఒకవైపు భావ తీవ్రత, మరోవైపు మనసు మార్దవం, ఒకవైపు మార్గ సాంప్రదాయపు భాష మరోవైపు దేశీ సాంప్రదాయ భాష. ఇలా కవయిత్రి ద్వైదీ స్వభావంతో కదిలిపోయే ఏకధార. కవయిత్రిగా, వెబ్ పత్రికల సంపాదకురాలిగా అందరికీ తెలుసు. కథకురాలు, వ్యాసకర్త, యాత్రానుభవాలు అలా భిన్నభిన్న రంగాలలో తనదైన శైలిని, సిరాశక్తిని ప్రదర్శిస్తున్న మహిళా శక్తి అని కూడా చెప్పవచ్చు. తన అనేక కవితల్లో స్త్రీ పక్షపాతిగా మహిళా జీవితాలలోని సమస్యలను చూపుతారు. 'అర్ర మందారాలు' కవితను చదివితే తెలుస్తుంది, మనసు లోపలి పొరల్లోంచి తీవ్రమైన ధిక్కార స్వరంతో భావాలుబికి వచ్చినా భాషా సాంప్రదాయంతో ఆ తీవ్రత కాస్త మార్దవాన్ని పుణికి పుచ్చుకుంటుంది. ఫలితంగా సున్నితంగా మందలించిన భావన కలుగుతుంది.
కొండపల్లి గారి కవిత్వ భాష విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అది రెండు పాయలుగా సాగుతుంది. ఒకటి మార్గ సాంప్రదాయంగా, రెండవది దేశీ సాంప్రదాయంగా. కాళోజి వ్యక్తిత్వ చిత్రీకరణ చేస్తూ 'నీవొక పర్జన్యం' అనే శీర్షికతో వున్న కవితలో ''నీ రూపం ఓ కవన గంభీరం / నీ పలుకు ఓ కవితా గాండీవం / మా బ్రతుకు చేలపై అభిమానపు /జల్లులు కురిపించే / నీవొక పర్జన్యం'' అంటారు. 'పర్జన్యం' అనే పదానికి అనేక విశేషణాలున్నా ఇక్కడ 'వర్షించే మేఘం'గా మనం తీసుకోవచ్చు. నీహారిణి గారి కవిత్వం చాలావరకు సాంప్రదాయపు భాషతో, గ్రాంధికంగా వుంటుందన్న అభిప్రాయం కొందరికి వుంది. అది కొంతవరకు నిజమే. పర్జన్యం, అనిమొన, విభుఉదవరులు లాంటి పదాలు బహుశా అలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయి అనుకుంటాను. అలాగని దేశీయ పదాలు లేకుండా ఆమె కవిత్వం లేదు అని అనలేము. 'నేల నుదుటిపై నాగలి సంతకం', 'ఆకురాలిన తీగ, పచ్చని ప్రశ్న', 'మనకు మనం పరాయిలం' - ఈ సంపుటిలో వున్న కొన్ని కవితా శీర్షికలు చూస్తే మనకు అర్ధమవుతుంది
'మనకు మనం పరాయిలం' అనే కవితను పరిశీలిస్తే ''చాప, గొంగళి, ఓ సత్తుగిన్నె నేస్తాలయినా/ నేలమ్మ అతనిని ప్రేమగా లాలిస్తుండొచ్చు/ మట్టితో కదా జీవనం !' 'ఎవరికీ రాసుకు పూసుకు తిరగకున్నా /హదయంలో విప్పని మార్కెట్టు రూపం
ఒక కవిని నిర్బంధించినందుకు ఎత్తిన నిరసన గళం ఇది. ఇలా సరళమైన పదాలతో, వ్యవహారిక భాషలో సాగుతుంది. అలాగే నిశి రాతిరి కవితలో ఎక్కడి నుండి రాలిందో/ ఓ చిమ్మ చీకటి కుప్ప / ఎందుకు మౌనం వహించిందో / మనసు కుండలో చేరి ఒలకని మేధోమధనం / ఒడవని బతుకు సమరం ఈ కవితలో కరోనాను 'చీకటి కుప్ప'గా ప్రతీకాత్మకంగా చూపారు.
ఆంగ్ల సాహిత్యంలో తరుచుగా ఒక విలక్షణమైన శైలి కనబడుతూ వుంటుంది. అది '=శీబఅస జుఅసఱఅస్త్ర' శైలి. ఈ శైలిలో మొదట సాగిన పంక్తులతోనే చివరి పాదాలు ముగుస్తాయి. ఆ పంథాలో సాగిన కవితలను కూడా నీహారిణి గారు అనుసరించారు. 'మనిషి విలాపంలో వసంత విలాసం' లో ఆ లక్షణం చూడొచ్చు మనం. 'నా మాటల ఆటల్లో నాయికలా /కోకిల గానంలోని శ్రావ్యతలా / వసంత విలాపాలను వదిలి /శ్రవణానంద సందోహంగా / స్వాగతాలు పలకండి... శార్వరి నామ సంవత్సరంగా వస్తున్నాను /శాంతి మనస్కులై స్వాగతాలు పలకండి ...' ఇవే పంక్తులతో చివరి ఖండిక చిన్న మార్పుతో సాగుతుంది. పైన వసంత విలాపం అంటూ సాగిన పంక్తి చివర వసంత విలాసంగా అంటూ ముగింపుకు చేరుకుంటూ కవయిత్రి విలాపం నుండి విలాసం వైపుకు సాగుతూ తన ఆశావహ దక్పధాన్ని చూపుతుంది.
చక్కటి లయ, ధ్వనితో సాగే 'ప్రత్యేక వీరుడు' కవిత రైతును, రైతు జీవితాన్ని పటం కడుతుంది. 'రాతి నేల రాత్రి వేళ బురద పూసే పగటి వేళ /వెలుగు కొమ్మలు పూచే బతుకు వేళ ... 'మొలకెత్తని విత్తనం నుండి మొత్తం పండని పంట నుండి /ప్రకతి వైపరీత్యాల నుండి చీడల దాడుల నుండి /కల్తీ మందుల కలిమాయ నుండి / కనికరం లేని దళారీతనం నుండి / ధరల ఉత్తాన పతనాల మహమ్మారి నుండి...' అంటూ సాగుతూ 'కంటి గట్టు చుట్టూ కంచె గట్టి కాపాడే ప్రత్యేక వీరుడు రైతు' అని ముగుస్తుంది. స్త్రీ వాదపు ఛాయలతో సాగే కవిత అర్ర మందారాలు. శీర్షికతో పాటు ఎత్తుగడ కూడా విలక్షణంగా వుంటుంది. 'ఔను! మీరు విన్నది నిజమే !! / అవి అర్రమందారాలు ! బంధించకండి !! / ఆమెను 'పని' ఖానాలో అహం దారాలతో బంధించకండి !!' కాల ప్రభంజనం కవితలో 'ఇప్పుడు భయమేదైనా వున్నదంటే / అది చావును గురించి కాదు బతుకును గురించే..' అంటారు కవయిత్రి. చావుకన్నా బతుకే భయంగా మారిన వర్తమానపు విషాద దశ్యంతో తన ఆవేదనను వ్యక్తీకరిస్తారు.
భర్తను గౌరవించే స్వభావాన్ని 'గహవాసం' కవితలో, స్త్రీ పక్షపాతిగా 'నవముకురం' లో, సంస్కతిని చూపే బోనాలు, రైతు సమస్య, కరోనా సమస్య, మనవడి ఆటను చూసి మురిసిపోయే వైయు క్తికం అలా ఎదురైనా ప్రతి అనుభవాన్ని తనలోకి ఒంపుకుని పలవరించిన కవయిత్రి, ఏనుగు నరసింహారెడ్డి తన ముందు మాటలో చెప్పినట్లుగా 'చుట్టూరా విద్వన్మణులు పంచే కాంతిలో నీహారిణి గారు తన సాహిత్య సజనను పదును పెట్టుకున్నారు' అన్న మాటను నిజం చేసుకుంటూ మానవీయ పరిమళంతో కదిలిపోతూనే 'హదయాలు నడిచి వెళ్లగలిగే వంతెన వేసి /కమిలిపోని బింబాల్ని నక్షత్రాలకు గట్టి /దారులేసే సంధియుగంగా సాగిపోతాను' అని అంటున్న నీహారిణి ఆకాంక్ష నెరవేరాలని ఆశిస్తూ అభినందనలతో ..
- డా.రూప్ కుమార్ డబ్బీకార్
99088 40186