Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం అంటే ఏమిటి? ఎంత చేయి తిరిగిన కవి అయినా కవిత్వాన్ని విశ్లేషించాలంటే కాసేపు తటపటాయిస్తారు. కొత్తగా కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారికి రాయాలని ఉన్నా వాటిపై పట్టు సాధించడం ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటి వారికి ఉపయుక్తంగా ఉండే పుస్తకాన్ని ప్రముఖ సీనియర్ కవి, విశ్లేషకులు, విమర్శకులు దాస్యం సేనాధిపతి - దిక్సూచి - పేరిట ఆవిష్కరించారు.
కవిత్వం అంటే ఏమిటో తనదైన శైలిలో నిర్వచించారాయన - హదయంలో స్పందనకు మస్తిష్కంలో మథనానికి ఆవేశాత్మక అక్షర రూపమే కవిత్వం అంటారు ఓ చోట. ఉదయ సాహితి సాహిత్య సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన కవి శ్రీదాస్యం లక్ష్మయ్య కొంత కాలం క్రితం అంతర్జాల వేదికగా నేటికవిత పేరిట సమూహం ఏర్పాటు చేశారు. ఆ సమూహానికి సలహాదారుగా వ్యవహరిస్తూ సభ్యులకు ఎన్నో సాహితీపాఠాలు చెప్పారు దాస్యం సేనాధిపతి. సమూహానికే పరిమితమైన ఆ పాఠాలను నూతన కవులకు ఉపయుక్తంగా ఉండేలా దిక్సూచి పేరిట పుస్తక రూపంలో పొందుపరిచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
కవిత్వం అంటే ఏమిటి? ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి వంటి ప్రాథమిక ప్రశ్నలతో మొదలుకొని కవిత్వం రాయడానికి అవసరమైన వాటిని 24 పాఠ్యాంశాలుగా తీర్చిదిద్దారు. గణాల సంకెళ్లలో బంధించకుండా స్వేచ్ఛా మార్గంలో కవిత్వాన్ని సజించేందుకు అనువుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీశ్రీ, కుందుర్తి, ఆరుద్ర, దాశరాథి, సి.నారాయణరెడ్డి, శేషేంద్ర వంటి కవులు తొలుత పద్యాలు, గేయాలు రాసినప్పటికీ వచన కవిత్వానికి ఎందుకు మళ్లాల్సి వచ్చింది తదితర ఆసక్తికరమైన అంశాలు పుస్తకంలో ఉన్నాయి. కవిత్వ నిర్మాణ క్రమం, వచన కవిత్వ ధోరణుల గురించి తయారు చేసిన పాఠ్యాంశాలలో ప్రామాణికతకు పలువురు కవుల కవితా సంపుటాలు, సాహిత్య పత్రికలు, ఆయన స్వీయ గ్రంథం అంతర్వాహిని, అభ్యుదయ రచయితల సంఘం వారి ఈతరం కోసం వచన కవిత, ఎస్వీ జయంతి రచన 50 వసంతాల తెలుగు కవిత, ప్రముఖ కవి యాకూబ్ రచన కవిత్వ సజనానుభవం తదితర గ్రంథాలు ఎంతగానో తోడ్పడ్డాయని ప్రకటించుకున్నారు రచయిత. ఇక కవిత్వ పాఠాలలో ఎందరో కవుల కవితలను ఉదాహరణగా చేస్తూ కొత్తవారికి అర్థమయ్యేరీతిలో విశ్లేషించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్.గోపి, పలమనేరు బాలాజీ తదితరులతో పాటు అనేక మంది కవుల కవితాశైలికి విశ్లేషణ దిక్సూచిలో లభిస్తుంది. అలాగే ఈ కాలానికి తెలియని కవుల ప్రస్తావననూ పరిచయం చేస్తుంది. ఇది కొత్త కవులకు కచ్చితంగా మార్గదర్శనం చేస్తుందంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు.
- నస్రీన్ ఖాన్, 9652432981