Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కుల వ్యవస్థ అని 1936 సంవత్సరంలోనే చెప్పాడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. ఈ మాట చెప్పి తొంభై ఏండ్లు కావస్తున్నా ఆ కుల భూత క్రూరత్వంలో ఏ మార్పు లేదు. పైగా అది మారుతున్న కాలానికి అనుగుణంగా మారాకు తొడుగుతూ మనల్ని వెంటాడుతుంది. కనుకనే గ్రాడుయేషన్ పూర్తి చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ఇక్కడ కవిత్వం రాయాల్సి వచ్చింది. పోలీస్ సంస్థలోని అవస్థలు చెప్పే క్రమంలో వచ్చిన ఈ కవిత్వంకు సహజంగానైతే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ''ఖాకీ'' అన్నటువంటి పేరుండాలి. కానీ ఈ కవి గుండెపంగు వరకుమార్ పుస్తకం పేరు ''మాదిగ ఖాకీ'' అని పెట్టాడు. ఎందుకంటే ఇతడు భారతదేశంలోని, ద్రవిడనాడు యందు వర్ధిల్లిన తెలంగాణ మాగాణం బేతవోలువాడు. కనుక సహజాతి సహజంగానే ఇక్కడ ఖాకీ కాస్తా ''మాదిగ ఖాకీ'' అయ్యాడు.
మాదిగ దండోరా ఉద్యమాన్ని చూస్తూ పెరిగిన వరకుమార్ పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరాన్ని తన కవిత్వం ద్వారా కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించాడు. ''ఉద్యోగం నా ధర్మమే అయినా/ ఉద్యమం నా కోసమే/ ఈ నేలపై నేనెప్పటికీ కానిస్టేబులేనా/ అందుకే ఉద్యమం నా భవిష్యత్ ఉద్యోగం..'' అని వివరంగా రాశాడు. రాయడమే కాదు ఎన్ని ఆటంకాలెదురైనా రాసిన దానికి కట్టుబడి ఉండి అక్షరోద్యమాన్ని కొనసాగిస్తున్నాడు.
గుండెపంగు సాహితీ సంస్థ ద్వారా వచ్చిన నూట నలభై అయిదు పేజీల పుస్తకమే ''మాదిగ ఖాకీ''. ఇందులోని డెబ్భై ఏడు కవితల్లో ఇరవై ఆరు పోలీస్ వ్యవస్థ మార్పు కోసమే ఉన్నాయి. పోలీసు వత్తి జీవితాన్ని సజనాత్మక సాహిత్యం ద్వారా ఆవిష్కతం చేశాడు. దీనికి కారణం బయట మాదిగ దండోరా ఉద్యమం అందించిన చైతన్యానికి, ఉద్యోగం చేస్తున్న క్రమంలో పోలీసు వ్యవస్థలో ఉన్న బానిసత్వాన్ని చూసి తన లోపల జరిగిన మానసిక ఘర్షణే కావచ్చు. క్రమశిక్షణ పేరుతో మితిమీరిన బానిసత్వం, శ్రమ దోపిడి చూసి అలసిపోయాడు. ''పార్టీ సిద్ధాంతాల్లో సవరణ ఉంది/ మతారాధనలో సవరణ ఉంది/ భారత రాజ్యాంగంలోనూ సవరణ ఉంది/ మరి పోలీస్ మ్యానువల్‌లో సవరణలు వద్దా!!..'' ఇదొక్క ప్రశ్న చాలదూ వరకుమార్‌ను ఖాకీల్లో నుంచి వెలేయడానికి. సరిగ్గా అదే జరిగింది. తను ఒక ప్రజాస్వామిక వత్తిని కలగన్నాడు. అందులో ఓ మానవీయత కోసం తపించాడు. అందుకే సస్పెండ్ చేయబడ్డాడు. బాసిజం, బానిసత్వం ఉన్న ఆ వత్తిలో మార్పును ఆశించడమే ఒక తీవ్రవాదం. పైగా దాన్ని బయటకు రాయడం అంటే ఉగ్రవాదమే వారి దష్టిలో. అయినా కవిత్వం రాయడం ఆపలేదు. ''సచ్చిన మా తాతను మళ్ళీ చంపి సెలవడిగే కన్న/ బతికుండగానే స్మశానంలో వదిలొచ్చే కఠినులే నయమనిపిస్తుంది/ ఎంత చెప్పినా మా గోడు వినని సంఘం కంటే/ కానిస్టేబుల్ సమస్యే వినని నువ్వే నయమనిపిస్తుంది/ ముప్పై ఏండ్లైనా రాని ప్రమోషన్ కంటే/ తొందరగా ఇచ్చే మెమోలే నయమనిపిస్తుంది..'' అని రాసినట్టే అన్నింటికీ సిద్ధపడి ఉద్యోగంపోయినా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ పోలీస్ వ్యవస్థ మార్పుకు పోరాడుతున్నవాడు వరకుమార్. ఆయన మార్పు కవిత్వానికి విబేధించిన పోలీసు ఉన్నతాధికారులు శ్రీముఖం ఇస్తే, ''నీ కోసమే ఈ పోలీస్'' అనే కవిత్వాన్ని కొంత మంది ఎస్.ఐ పోలీస్ స్టేషన్ ముఖద్వారాలకు రాయించి పెట్టారు. అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వర్రావు ఫోన్ చేసి అభినందించారు అనే విషయం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పాత వ్యవస్థలోని, పురాతనకాలం నుంచి కొనసాగుతున్న అవస్థలను ఎలుగెత్తిన వరకుమార్‌ను నిజంగా పోలీస్ సంఘ సంస్కర్త అని చెప్పక తప్పదు మరి. ఉద్యోగం పోయే ప్రమాదముందని తెలిసినా రాయడం నిజంగా సాహసం కాక ఏమవుతుంది. సాంఘీక నిరంకుశత్వం రాజకీయ నిరంకుశత్వం కంటే క్రూరమైనది. కనుక సాంఘీక నిరంకుశత్వాన్ని ఎదిరించే సంస్కర్త రాజకీయవాది కంటే ఎక్కువ ధైర్యవంతుడై ఉండాలన్న బాబాసాహెబ్ మాటల్ని అక్షరాల ఆచరిస్తున్నవాడు గుండెపంగు వరకుమార్.
''ఆత్మగౌరవం ఉన్న కానిస్టేబుల్‌గా అడుగుతున్న/ రాయడమే తప్పైతే సురక్ష మాస పత్రికలెందుకు/ ఇతర పత్రికల ముందు మన మొఖాలెందుకు/ నేను గాయపడిన గన్నునే కావచ్చు/ గురి తప్పిన పెన్నును ఏ మాత్రం కాదు/ కొంగొత్త జాంబవ దారులనే రాస్తున్న మాదిగ ఖాకీనై..'' గిట్ల అడిగితే ఏ ఆయుధం లేని ఊరి పటేలే ఓర్సుకోడు. సాయుధుల సంస్థ జనరల్స్ ఓర్సుకుంటరా? కమీషనర్లు కాముగ ఊరుకుంటరా? అయితే వరకుమార్ నా పెన్ను గురి తప్పదు అని రాయడమంటేనే ఇవన్నీ తెలియకుండా రాశాడనుకోలేము. కులవ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా అన్న అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని స్పష్టతతో ఆచరిస్తున్నాడనే అర్థం అవుతుంది. నిజానికి హోం గార్డులు, పోలీసు కానిస్టేబుల్స్‌లో తొంభై శాతం శూద్రులే. అందునా దళితులే ఎక్కువ. కాబట్టే ఉన్నతాధికారుల బాసిజంతో పాటు కులవివక్షకు కూడా కింది స్థాయి పోలీసులు బలైతున్న పరిస్థితిని తన కవిత్వంతో నిలదీస్తాడు. కులవివక్ష వల్లనే వత్తిలో స్వేచ్ఛకు, ఇష్టాఇష్టాలకు, వ్యక్తిగతమైన అభిరుచికి స్థానం లేదని వాపోతాడు. అందుకే సెల్యూట్ చేస్తా కానీ ఊడిగం చేయలేనని ఆత్మగౌరవ గీతం వినిపిస్తున్నాడు. సచ్చిన గొడ్డునే కుక్కకింత, గద్దకింత, కాకింత, నాకింత అని, మనిషికీ ఇతర జీవులకు తేడా చూపకుండా వాటాలేసిన సమానత్వపు మాదిగ తత్వం వరకుమార్ అక్షరాల్లో అణువణువులో కనిపిస్తుంది. అందుకే అంబేడ్కర్ ఇచ్చిన హక్కులను పోగులేయాలని దండోరా వేస్తున్న ''మాదిగ ఖాకీ'' అతడు. కాబట్టే కుల వ్యవస్థ ఒకే జాతి మనుషులను సాంఘీకంగా విడదీసినట్టు, పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగాలు చేసేది కింది కులపోళ్ళే కాబట్టి వాళ్ళను చీత్కారంగా చూస్తున్నారు. కనుక పోలీస్ వ్యవస్థంతా సంస్కరించబడి తారతమ్యాలు లేని, కులాధిపత్యం లేని ఏక్ పోలీస్ వ్యవస్థ రావాలని వరకుమార్ కోరుకుంటున్నాడు.
ఎంతో మంది ఉద్యోగాలు రాగానే మేథావుల్లా, సంఘ సంస్కర్తల్లా, సేవా సంపన్నుల్లా ఫోజులు కొట్టేవారే ఎక్కువ కనిపిస్తారు. సానుభూతి వాక్కులు వినిపిస్తూ పేరు సంపాదిస్తారు. మరి కొంతమంది అధికారులు దయామయులై ఉంటారు. ఇలా చేయడం తాత్కాలిక పైపైన రాసే ఆయిట్మెంట్ లాంటి ఉపశమనం మాత్రమే. కానీ వరకుమార్ మాత్రం అలాంటివాడు కాదు. నిజమైన అంబేడ్కర్ వారసుడు. ఐట్మెంట్ ట్రీట్మెంట్ వలన సమస్యల పరిష్కారం సాధ్యమవదు. సైద్ధాంతిక శస్త్ర చికిత్సలతో శాశ్వత పరిష్కారాలు కావాలని భావిస్తాడు. అందుకే తన కవిత్వానికి గుండె ధైర్యం, తెగింపు, తిరుగుబాటుతనం ఎక్కువ. అలాగని అతడేం విప్లవకారుడు కాదు. మావోనే నీదే కులమబ్బి అని తన కవిత్వంలో అడిగిన అంబేడ్కరిస్టు. తనను చేతగాని గాడిద అని తిట్టిన ఉన్నతాధికారికి కవిత్వంతో సమాధానం చెప్పిన నీలి బెబ్బులి వరకుమార్. ''ఏమన్నవు సారూ నేను గాడిదనా/ వసుదేవుడే నా కాల్లు మొక్కిండు కదా/ ఏసుని మోసింది నేనే కదా/ సాకిరేవు రజకన్నకి సాయం ఉంటా/ డక్కలి ముత్తయ్య రోళ్ళను మోస్తుంట/ గొల్లకురుమల మందెంట ఉంటా..'' అన్న కవితా పాదంలో సారుకు సమాధానమే కాదు, గాడిద శ్రమ గొప్పతనం, ఉత్పత్తి కులాల, శ్రామిక కులాల బహుజన ఐక్యత అవసరతను చాటి చెప్పినట్టుంది. మనువాద కుల దురహంకార దాడులు, ప్రేమలు, పెళ్ళీళ్ళు, అగ్రకుల మోసాలు, భూ కబ్జాలు, చెర్వుల ఆక్రమణలు, స్పోర్ట్స్‌లో కులవివక్ష, జ్యోతీబాపూలే నుంచి మాదిగ వీరుల వరకు స్మరణలు, శబరిమల, ఇలా ఇంకెన్నో కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సమకాలిన సమస్యలపై స్పందిస్తూ వేగవంతంగా, గాఢవంతంగా రాస్తున్న యువకవి వరకుమార్. నల్లగొండ జిల్లా మునగాల పరగణా, చిలుకూరు మండలం కావడం చేతనేమో కానీ తెలిసో, తెలియకో ఇతడి మీద కమ్యూనిస్టు ప్రభావం ఉన్నదనిపిస్తుంది. అందుకే పుస్తమంతా పరిశీలిస్తే ఈ కవికి అంబేడ్కరిజం మీదనే కాదు, మార్క్సిజం మీద కూడా పట్టుందని అర్థమవుతుంది. చిర్రా గోపయ్య, కోట లచ్చయ్య, పమిడిపాటి కోటయ్య యాదిలో ప్రాణగీతమై పరితపిస్తాడు. ''భూగోళమై తిర్గతనే ఉంటుంది'' కవితలో చారిత్రక భౌతికవాదాన్ని ఇండియనైజ్ చేసి వివరిస్తాడు. ప్రశ్నల తిరగదోడి, మతపెత్తనాల నాడులను తునాతునకలు చేస్తాడు. దేవుడిని అసలు నరహంతకుడని ప్రకటించి సిరియా, పాలస్తీనా కోసం ఒక అంతర్జాతీయ దక్పథంతో రాసిన కవితలను చదివినప్పుడు తెలుస్తుంది. మతం, మతతత్వం, మతోన్మాదం మానవాళికి ఎంతటి ప్రమాదమో తన కవిత్వంలో వివరిస్తాడు.
వరకుమార్ కవిత్వాన్ని వర్ణ, వస్తు, రూప కలనేత, పద ప్రయోగ, వైవిధ్య సంబంధ కోణంలో లోతుగా విశ్లేషించుకోవడం ప్రస్తుత కాలానికి అంత అత్యవసరమేమీ లేదు. గాలి వీస్తున్నప్పుడు, నేల పూస్తున్నప్పుడు, పేగు మేస్తున్నప్పుడు, స్వేచ్చ కాస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని పై వాటన్నింటి గురించి మాట్లాడుకోవచ్చు. అలాంటి మరో సందర్భంలో బోర విరుచుకుని విశ్లేషించుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు అది అవసరం లేదు. అయినా అప్పటిదాక మురుసుబొక్కను కంకినట్లు కంకడానికిది మచ్చుకు చూద్దాం. ''చెలరేగిన ఈదురుగాలి/ పిల్లగాలిని నీలాడుతుందెందుకో?/ చినుకు దిగేసిన గునపమైనప్పుడు/ గుండెలు పలిగిన భూమి మొక్కనిస్తుందెందుకో/ గడ్డిపరక గాలితో యుద్ధం చేస్తుందెందుకో/ వలలో చిక్కిన చేప పట పట పళ్ళు కొరుకుతుందెందుకో/ తుపాకి ఇడ్సిన తూటా/ ఎనక్కి చూడనంటుంది ఎందుకో?..'' అన్న ఈ కవితా పాదాలు వరకుమార్ కవిత్వ భావుకతకి, కాల్పనికతకు మాత్రమే కాదు తిరుగుబాటుకు కూడా నిదర్శనం. అయితే వరకుమార్ కవిత్వంలో కాల్పనికత కంటే వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న పరిస్థితుల్నే తీసుకుని కవిత్వంగా మలిచాడు. కనుక తన కవిత్వం నిండా శ్రమ సౌందర్యం, మాదిగ వస్తు, సాంస్కతిక సంపద మనకు దర్శనమిస్తుంది. అది వట్టితుంకల కూరంత రుచికరంగా, మూల్గ బొక్కలంత బలంగా, గొడ్డు కారమంత గాఢంగా ఉంటుంది. '' గొడ్డును అణువణువునా ఆరగించిన/ నేను అంటరానోడినైతే మరీ../ గొడ్డుచ్చను తీర్థమోలె తాగుతున్న/ నిన్నేమనాలి మనువా..'' అని ఎంతో సూటిగా ప్రశ్నల సుర్కత్తులని విసుర్తాడు. ఇది అంటరానితనం పాటిస్తున్న నేటి ఆవుబిడ్డలకు మింగుడు పడని ముర్సుబొక్క లాంటిదే. అయితే దళిత శ్రమ, ఉత్పత్తికి సంబంధించిన పదసంపద, మాండలికం, వర్తమాన దళిత కవులకంటే కొంచెం ఎక్కువగా, సూటిగా, గూటంతో గుద్ది చెప్పడం గుండెపంగు వరకుమార్ కవిత్వంలో ప్రత్యేకత. వాడుకభాష, మాండలికంతో, మోడ్రన్ లాంగ్వేజ్ లోనూ రాసిన కవితలనూ ''మాదిగ ఖాకీ'' లో మనం చూడవచ్చు. కులం నుంచి, మతం నుంచి, వాటిపేర జరుగుతున్న వ్యాపారాల నుంచి, రాజకీయాల నుంచి మానవాళి విముక్తికి వరకుమార్ నుంచి మరింత సాహిత్యం వెలువడాలని ఆశిద్ధాం.
- ఎం.విప్లవకుమార్
9515225658