Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికన్ రచయితల్లో హెన్రీ డేవిడ్ థోరోకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తాత్వికునిగా, ప్రకతి ప్రేమికునిగా ఇంకా జీవితంతో ప్రయోగం చేసిన విన్నూత్న ఆలోచనావేత్తగా పుస్తక ప్రేమికులు ఎంతగానో అభిమానిస్తారు. నాగరిక జీవనం నుంచి సెలవు తీసుకుని కొన్నాళ్ళ పాటు ఒంటరిగా ఏ అడవిలోనో, అత్యంత తక్కువ అవసరాలతో, ప్రకతి ఒడిలో ఉండిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన థోరో దాన్ని అమల్లో పెట్టి చూశాడు. ఆ సాధకబాధకాలతో కలిపి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాని పేరే ''వాల్డెన్''.
1845 లో జూలై4న అడివిలోని ఓ చిన్న కేబిన్‌లో ప్రవేశించి సెప్టెంబర్6, 1847 దాకా దాంట్లో ఒంటరిగా నివసించాడు. అంటే రమారమి 2 సంవత్సరాల 2 నెలలు పాటు వాల్డెన్ అనే చెరువు పక్కన తాను స్వయం గా నిర్మించుకున్న చెక్క కెబిన్‌లో రాత్రింబవళ్ళు అక్కడి చెట్టు పుట్టలతో పశుపక్ష్యాదులతో క్రిమికీటకాలతో కలిసి మెలిసి జీవించాడు. ఎవరి అవసరం లేకుండా సాధ్యమైనంత సామాన్యంగా మనిషి జీవించలేడా అని ఈ ప్రయోగం చేశాడు.
ఈ ప్రయోగం చేయడం వెనుక థోరో మీద ఆయన స్నేహితుడైన మరో రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ప్రభావం లేకపోలేదు. నిజానికి థోరో వేసుకున్న ఆ చిన్న గుడిసె లేదా కేబిన్ ఉన్న స్థలం ఎమర్సన్ దే. తన స్వహస్తాలతో ఆ చిన్న నివాసాన్ని తయారు చేసుకున్నాడు. దానికైన ఖర్చు ఆ రోజుల్లో రమారమి 28 డాలర్లు. దాని కోసం కొనుక్కున్న చెక్కలు, ప్లాస్టర్లు, మేకులు, కిటికీ ఇలా అన్నిటికీ ఎంత అయిందో చాలా వివరంగా రాసుకున్నాడు.
తాను అనుభవించిన రోజువారి జీవితాన్ని నమోదు చేశాడు. రకరకాల మొక్కలు, జంతువులు, కీటకాలు, పక్షులు వాటి కదలికలు గురించి లోతుగా రాశాడు. అంతకు ముందు తనకి తెలియని అనేక చిన్న చిన్న జీవుల్ని కనిపెడతాడు. బీన్స్ తోటని వేసుకుంటాడు. దాంట్లో కాసేపు పనిచేసుకుంటాడు. మధ్యాహ్నం నుంచి చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాడు. ఇంత అడివి లో ఉన్న కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి, అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో రైలు మార్గం వేస్తుంటారు.
రైలు మార్గం వేయడానికి వచ్చిన ఐరిష్ శ్రామికులు, ఆ మార్గం గుండా తమ పల్లెలకి వెళ్ళే రైతులు అప్పుడప్పుడు థోరోని కలిసి ఎందుకు ఈ అడివిలో ఒంటరిగా ఉంటున్నారు లాంటి ప్రశ్నలు వేస్తుంటారు. తన కేబిన్ ముందు ఉన్న వాల్డెన్ చెరువు ఏ రుతువులో ఎలా కనిపిస్తుంది, అక్కడ పేరుకునే మంచు ఎప్పుడు ఎలా ఉంటుంది అంతా రికార్డ్ చేశాడు. నల్ల చీమలు, ఎర్ర చీమలు వాటి జీవన విధానం, చేసే యుద్ధాల్ని ఓ మూడు పేజీలు వర్ణిచాడు. థోరోతో ఉన్న సమస్య ఏమిటంటే ప్రతిదాన్ని చాలా లోపలికంటా వెళ్ళి చెబుతుంటాడు. గ్రీక్, రోమన్ గాథల దగ్గర నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన వరకు అదీ ఇదీ అని లేకుండా పరమ విస్తారంగా రాశాడు. ఆసియా, ఆఫ్రికా, యూరపు అన్ని ఖండాల కవుల, తాత్వికుల గురించి సందార్భానుసారంగా చెబుతుంటుంటాడు.
పనిలో పనిగా భగవద్గీత గురించి, వేదాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ వాల్డెన్ పుస్తకంలోని అంశాలు 17 రకాలుగా విభజించారు చదువరుల సౌకర్యం కోసం. పాతతరంకి చెందిన శైలి కావడం వల్లనూ, అనేక పారమార్థిక, లౌకిక విషయాలనూ కలిపి రాయడం వల్లనూ ఈ పుస్తకాన్ని ఓ డైరీ మాదిరిగా చదువుదాం అనుకుంటే అంత తొందరగా ముందుకి పోనివ్వదు. ఆ కేబిన్‌లో ఉన్నప్పుడు విన్న శబ్దాలను, ఒంటరితనంలోని సౌందర్యాన్ని, తన వద్దకి వచ్చిన మనుషుల గురించి, తను పెంచిన బీన్స్ తోట గురించి, ఇతరుల్ని బాధించి ఆనందించే పొరుగు వారి గురించి, వివిధ రుతువుల్లో మారే ప్రకతి గురించి, పక్షుల గురించి ముఖ్యంగా వాల్డెన్ చెరువు గురించి ఇలా అనేక అంశాల గురించి ఈ పుస్తకంలో అతి సూక్ష్మ చిత్రణ చేశాడు.
థోరో మొత్తం తన జీవితకాలంలో రాసిన వ్యాసాలు, కవితలు ఇతర పుస్తకాలు అన్నీ కలిపి 20 వాల్యూంల వరకు ఉంటాయి. బానిస చట్టాలకి వ్యతిరేకంగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. పౌరులకి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుందని ప్రభోదించాడు. సివిల్ డిసొబిడియన్స్ అనే మాటకి పర్యాయ పదంగా ఈయన పేరుని చెబుతారు. లియో టాల్‌స్టారు, గాంధీజీ, డా. మార్టిన్ లూథర్‌కింగ్ వంటి వారు హెన్రీ డేవిడ్ థోరో నుంచి ప్రేరణ పొందారు.
280 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో ఇంకా ఎంత చరిత్ర ఉందో చదివిన వారికే తెలియగలదు. ఒక ఎన్సైక్లోపీడియా మాదిరిగా ఎన్నో విషయాల్ని ప్రస్తావించాడు. మొదట్లో ఈ పుస్తకం 2000 కాపీలు వరకు అమ్ముడైంది. ఆ తర్వాత కాలక్రమేణా అనేకమంది రివ్యూల ద్వారా ప్రఖ్యాతి పొంది అమెరికన్ క్లాసికల్ సాహిత్యంలో ఒక మణిపూసగా పేరుపొందింది. చాలా ముద్రణలు పొందింది. ముఖ్యంగా రాబర్ట్ ఫ్రాస్ట్ దీని గురించి రాయడంతో అందరి దష్టి వాల్డెన్పై ప్రసరించింది. 1968లో దీని ఆధారంగా జొనాస్ మెకాస్ అనే సినిమా వచ్చింది.
"To be a philosopher is not merely to have subtle thoughts,nor even to found a school, but to love wisdom as to live according to its dictates,a life of simplicity, independence, magnanimity and trust." అంటూ తాత్వికతకి తనదైన భాష్యాన్ని చెప్పి దానికి అనుగుణం గా జీవించిన హెన్రీ డేవిడ్ థోరో బోస్టన్‌కి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న Concord, Massachusetsలో జన్మించి, ఎక్కువ కాలం అక్కడే జీవించి మరణించారు.
- మూర్తి కెవివిఎస్ 7893541003