Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు దశాబ్దాల సాహితీ అనుబంధం తెగిపోయింది. గగనంలోకి కుంచెను మోసుకు మైనా ఎగిరిపోయింది. కొన్ని రంగులద్దిన జ్ఞాపకాలనూ, శిల్పంలా పేర్చిన అక్షరాలనూ మనకొదిలి వీర్రాజు నిష్క్రమించారు.
సాహితీ లోకంలో శిలావిగా ప్రఖ్యాతినొందిన ఆయన 1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించిన ఆయన విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నాటకాలు వెయ్యడం, కథలు రాయడం, బొమ్మలు వేయడంలో విశేష ప్రజ్ఞ చూపారు. 1959లో ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇరవై ఏళ్ళ వయస్సుకే కృష్ణా పత్రికలో ఉప సంపాదకులుగా చేరారు. ఆయన సుభద్రాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా తెలుగు నాట ప్రఖ్యాత రచయిత్రిగా పేరు పొందారు. అనువాద రచనలు చేయడంపై ఆయన ఎంతో మక్కువ చూపారు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖా కార్యాలయంలో అనువాదకునిగా ఉద్యోగం చేసి 1990లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎందరో రచయితల్ని ఆయన తీర్చి దిద్దారు. ఎందరో కవుల, రచయితల పుస్తకాలకు ముఖ చిరతాలు వేసారు. చిత్రకారునిగా పలు చిత్ర కళా ప్రధర్శన శాలలు పెట్టారు. (ఆర్ట్ గ్యాలరీలు) 'మైనా' నవల ఆయనకు విశేష పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. తమ మిత్రుడు గురు సమానుడుగా భావించే సహోద్యోగి ప్రముఖ కవి, వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు పేర ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరుతో ప్రతి యేటా కవులకు 1984 నుండి అవార్డ్లు ప్రధానం చేస్తూ వస్తున్నారు. రావూరి భరద్వాజ గారితో అద్భుత నవల రాయించారు. మాయా జలతారు పేరును మార్చి 'పాకుడు రాళ్ళు'గా విడుదల చేయించారు. 2013లో జ్ఞానపీఠ అవార్డ్ అందుకొంది ఆ నవల. అభ్యుదయ భావాలతో, వామపక్ష సాహిత్య కారులతో, సంఘాలతో సాన్నిహిత్యం కలిగి వుండే వీర్రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాహితీ స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
వెలుగు రేఖలు, కాంతి పూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలు రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్ళీ వెలుగు అనే కవితా సంపుటులు రచించారు. 'కలానికి అటూ - ఇటూ' అనే వ్యాస సంపుటి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.
సమాధి, మబ్బు తెరలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగ మైనస్ ద్వేషం, వాళ్ళ మధ్య వంతెన, మనసులో కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది శీలా వీర్రాజు కథా సంపుటాలు. ఆయనకు పేరు తెచ్చాయి. రచనల్లో సౌందర్యాత్మక భావన, అభ్యుదయ దృక్పథం, చిత్ర కళా నవ్య శైలి శిలావిని పాఠకులకు దగ్గర చేసాయి. కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, బతుకు బాస... రచనల్లో 'కిటికి' స్వీయ చరిత్ర.
ఊరు వీడ్కోలు చెప్పింది, సమాధి, మబ్బు తెరలు కథలు పెక్కు బహుమతులొందాయి. కుందుర్తి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ తొలిగా శిలావి రాసిన ''కొడిగట్టిన సూర్యుడు'' కవిత్వ సంపుటికి దక్కడం విశేషం. వచన కవిత్వ రచనలో కథాప్రక్రియను సమ్మిళితం చేసి 'కొడిగట్టిన సూర్యుడు' సంపుటిని కుందిర్తి ప్రోత్సాహంతో వచన కవిత్వంపై మొగ్గుతో రాసారు శిలావి.
ఆయన కుంచె నుండి లేపాక్షి శిల్ప లేఖా చిత్రాలు జాలువారేయి. అవి చూసిన నందమూరి తారక రామారావు ముగ్ధుడైనారు. తన ముఖ్యమంత్రి పేషిలో శిలావిని, స్క్రిప్ట్ రైటర్‌గా నియమించుకున్నారు. అప్పటికే ఆయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. భీమన్న వచన కవితా పురస్కారం, తెలుగు యూనివర్శిటీ ఉత్తమ కథా పురస్కారం, కొండేపూడి సాహితీ పురస్కారం లాంటివెన్నో ఆయన ప్రతిభకు లభించాయి.
తాను పేద కవి కవితా సంపుటులకు దాదాపు 500కి పైగానే ఉచితంగా (కవర్‌పేజీ) ముఖచిత్రాలు అందించానని ఒకానొక సందర్భంలో శిలావి చెప్పారు. దిగంబర కవిత్వం నుండి నేటి కాలం కవిత్వం - కవులతో సహా కలిసి సాహిత్యోద్యోమాల్లో అడుగులు వేసిన శిలావి తన 83వ ఏట క(పె)న్ను మూసారు. సాహితీ లోకంలో ఆయన జ్ఞాపకాలు అమరం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472