Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నింగికెగసిన రెక్కలు రూపశిల్పి సుగమ్‌బాబు
తెలుగు సాహిత్యం శ్రామిక గొంతు వినిపించే ఓ అక్షర యోధుణ్ని 18 అక్టోబర్ ఉదయం కోల్పోయింది. కవిగా, విమర్శకునిగా, రెక్కలు సాహిత్య ప్రక్రియ రూపశిల్పిగా, పైగంబర కవుల్లో ఒకరైన ఎంకె.సుగమ్ బాబు హఠాన్మరణం ఓ విషాద వార్త. 1944 ఏప్రిల్ 1న గుంటూరు జిల్లాలో సకినాభీ ఫరీద్దాన్ దంపతులకు పుట్టిన సుగమ్‌బాబు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు. ఆయన అసలు పేరు మహబూబ్‌ఖాన్. దిగంబర కవులులాగే పైగంబర కవులూ తెలుగు నాట ఆ రోజుల్లో సంచలన కవిత్వం రాసారు. అన్ని సమాజ రుగ్మతలపై కలంతో విరుచుకుపడ్డారు. 1963లో భారతిలో 'మట్టి బొమ్మ' కవితతో సుగమ్‌బాబు సాహిత్య రంగ ప్రవేశం చేసారు. నాటి 'జ్వాలా' పత్రికలో విరివిగా రాసారు. తరువాత కాలంలో లఘ రూప కవితా వేదిక ద్వారా మిని కవితల్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తరువాత 1970 నాటికి విరసంలో చేరారు. పైగంబర కవులు తమ సాహిత్యంతో యువతలో ప్రత్యేక ఆసక్తి కలిగించారు. పైగంబర కవులు ఐదురుగు. వారు సుగమ్‌బాబు, ఓల్గా, దేవిప్రియ, కిరణ్‌బాబు, కమలాకాంత్. యుగ సంగీతం (1970) యుగచైతన్యం (1970) అనే సంకలనాలు తెచ్చారు. సుగమ్‌బాబు 'సూరీడు' పాటల సంకలనం ప్రఖ్యాతమైంది. తరువాత కాలంలో సుగమ్‌బాబు మద్రాస్ వెళ్ళి కెబి తిలక్, ఆత్రేయ, ఎంఎస్ రెడ్డిల వద్ద పని చేసారు. ఆయన రాసిన కొల్లేటి కాపురం చిత్రంలోని పాటలు బహుజనాదరణ పొందాయి. ఆంధ్రభూమి, మయూరి, డెక్కన్ క్రానికల్‌లో పనిచేసి అనేక వ్యాసాలు, కవితలు రాసారు. 1984లో 'గురజాడ' జీవిత విశేషాల్తో 'అస్తమించని సూర్యుడు' అనే డాక్యుమెంటరీ తీసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బంగారు నంది పురస్కారం విచ్చంది. 2002లో ఆయన తెలుగు సాహిత్యంలో రెక్కలు ప్రక్రియ ప్రవేశపెట్టారు. హిబ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ డేవిడ్ రెక్కల్ని ''వింగ్స్'' పేరున అనువదించారు. ఈ ప్రక్రియను తెలుగు కవులు అందుకొని విస్తృతంగా రెక్కలు రాసారు. రెక్కలపై ఎంఫిల్ పీహెచ్‌డీలు చేసారు. వ్యాసకర్త 'విసురు' పేరిట రెక్కలు కవితా సంపుటి రాయగా అద్దేపల్లి పీఠిక రాసారు. సెలయేరు (1968), విప్లవం (1969), కామ్రేడ్ (1974), సూరీడు - లెనిన్ - లెనిన్ (1988), అంతర్యానం, దారి, చెరుగ్గడ, శిఖరం, మంట, కొత్తనీరు లాంటి సాహిత్య కవితా సంపుటులు వీరి కలం నుండి వెలువడ్డాయి. ఆయన సాహిత్యం సంపుటాలుగా ప్రచురణైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300లకి పైగా కవులు రెక్కలు ప్రక్రియను అందిపుచ్చుకున్నారు. 'రెక్కలు' ప్రక్రియ రాసిన కవులతో శ్రీనివాస్‌గౌడ్ 'జయపతాక రెక్కలు' ప్రచురించారు. రెక్కలు ప్రక్రియలో రెక్కల్లో గీతాంజలి, రెక్కల్లో అమ్మ, రెక్కలు ప్రక్రియలో గీతాదర్శనం (రాజశ్రీ) ఇలా ఎందరో రెక్కలు సాహిత్య ప్రక్రియను విస్తృతం చేసారు. ఒక తరాన్ని లఘు కవితా రూపంలో ప్రభావితం చేసిన పైగంబర కవి సుగమ్‌బాబు అభ్యుదయ సాహిత్యోద్యమ సూరీడు. ఆయనకు అక్షరనివాళి...
- తంగిరాల చక్రవర్తి