Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథలు, కవితలు రాస్తూ, సాహితీ విమర్శలు చేస్తూ, అనువాదాలు చేస్తూ నిత్యం సాహితీ సృజనలో మునిగి ఉండే గొప్ప మానవతావాది పి. శ్రీనివాస్ గౌడ్. ఆయనలో ఉద్యమకారుడూ ఉన్నాడు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న వారిలో శ్రీనివాస్ గౌడ్ ఒకరు. బహుముఖంగా తన ప్రస్తావన కొనసాగిస్తున్న శ్రీనివాస్ గౌడ్ నుంచి వెలువడిన కవిత్వం ధైర్య వచనం.
2012 నుంచి 2020 వరకు రాసిన కవిత్వాన్ని ధైర్య వచనంలో చూస్తాము. సున్నితమైన భావ వ్యక్తీకరణతోనే పదు నైన భావజాలాన్ని పాఠకులకు చేరవేయడంలో కృతకృత్యుల య్యారని చెప్పవచ్చు. పుస్తకంలో 57 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని వైవిధ్యతను చాటే పుస్తకంగా తప్పక నిలుస్తుంది. ఎక్కడా కఠినమైన పదాలు వాడకుండా, చెప్పాల్సిన అంశం నుంచి పక్కకు తొలగకుండా తన భావాలను వ్యక్తీక రించారు. సాధారణ పాఠకులు సైతం సునాయాసంగా చదువు కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక పుస్తకంలోని కవితలను పరిశీలిస్తే...
కవి ఎప్పుడూ బడుగూ బలహీన వర్గాల పక్షమే వహిం చినట్లు స్పష్టంగా అర్ధమౌతుంది. అందుకే ఇలా కవిత్వ మయ్యారు. ''పుడకా పుడకా చేర్చి గూడల్లే పులుగల్లే... / మాటా మాటా కూడదీసుకొని/ గుండె శకలాలు ఒక్కొక్కటి చేరదీసుకొని.. / నాలో నేనే అనుకుంటా / నిర్మించూ... నిర్మించని...''
వ్యవస్థలోని లోటుపాట్లపట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి ఆయన. మనిషి మీద సంపూర్ణ నమ్మకం కూడా ఉంది. చాలాసార్లు వ్యవస్థ బలహీనపడి నప్పుడు మనుషులే దయా దీపాలుగా ఉద్భవిస్తారు. వారే దేశానికి ఆశాలతలంటారు కవి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై ప్రజలు పిట్టల్లా రాలుతున్న కాలం అది. పాలకులు చేష్టలుడిగి కలుగుల్లో దాక్కున్న కాలం కూడా అదే. అంతా స్తంభించిపోయింది. ఎటు చూసినా శూన్యం ఆవరించి ఉంది. ఆ సమయంలో ఎటూ దిక్కు తోచని వలస కార్మికులను వేగంగా చేర వేసే రవాణా వ్యవస్థ లేదు. ప్రాణాలు విడిస్తే సొంత గడ్డపైనే విడవాలనే ఒకేఒక ఆశతో వేలాది కిలోమీటర్లను నడుస్తూ సొంతూరి బాటపట్టారు వాళ్ళు. అటువంటి సమయంలో వారికి అండగా నిలబడి చేతనైన సాయం చేసిన నిజమైన మనుషులకోసం అందమైన కవితను సృష్టించారు.
''తలుపులు కిటికీలు హృదయాలు మూసుకొని / నగరాలు రోడ్డు మీదకు వదిలేస్తే.. / రెక్కలు కొట్టుకుంటూ / వలసపాట పాడుకుం టున్న బక్కకూలిపక్షులకు/ దారిచూపే బాట లవుతారు బావుటాలవుతారు'' శ్రామిక మధ్య తరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి జీవితాల్లోని ఆవేదనను కవితాత్మకం చేస్తారు.
సహజతను ఎక్కడా కోల్పోకుండా అతి జాగ్రత్తగా సామాన్య మైన అక్షరాలలో ఒదిగిపోతారు. అవన్నీ ఉన్నతమైన భావాలను ప్రకటిస్తాయి. మనిషిని అంటుతీగలా అల్లుకొని నిలువెత్తు చెట్టులా నిలబెట్టేది సాహిత్యం మాత్రమేనని నమ్ముతారు శ్రీనివాస్‌గౌడ్.
''నమ్మకం సడలిపోయి/ మనిషి పడావు పడి కూలిపోయినప్పుడు/ నెర్రెలిచ్చిన కళ్ళలో/ ఒక ఓదార్పు చినుకు కోసం/ గుండెనంతా ఒక ఎదురుచూపు చేసి/ దారినిండా పరచి అలమ టిస్తున్నప్పుడు/ అప్పుడు../ అప్పుడు../ అదొక రూపం వెతుక్కుంటుంది/ ఒక మనిషి రూపం తొడుక్కుం టుంది'' అంటారు ధైర్యవచనం అనే టైటిల్ కవితలో. మనుషుల మధ్య అంతరాలన్నీ ఎక్కడో ఓ చోట అంతమవ్వాలని కోరుకుంటారు.
''పాయలు పాయలుగా చెల్లాచెదురై/ చిందర వందరగా పారుతున్న/ చిరుపాయలన్నీ కలవాలి/ మట్టి చేతుల కలలు గెలవాలంటే / ఎక్కడెక్కడి పాయలన్నీ కలవాల్సిందే..'' అంటూ తనలోని ఐక్యతా రాగాన్ని ప్రకటిస్తారు.
ఇలా మట్టి తత్వాన్ని అలవర్చుకుని, మనిషి తనాన్ని కలగనే ఈ కవి రాసిన ధైర్యవచనం సంపుటికి అంతే మట్టి వాసనను శ్వాసించిన మహాకవి మద్దూరి నగేష్ బాబు స్మారక కవితా పురస్కారం 2020 - 2022 కు గాను లభించింది. ఈ నెల 10వ తేదీన విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో సాయంత్రం 5గంటలకు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్‌కు అభినందనలు. అలాగే ఇదే వేదికపై మరో ఐదు స్ఫూర్తి పురస్కార బహుమతులు అందు కోబోతున్న 'నెత్తుటి పాదాలు' - సరికొండ నరసింహరాజు, 'తిప్పుడు పొట్లం' - డా.గూటం స్వామి, 'ధిక్కార ఖడ్గం' -అవనిశ్రీ, 'ఒంటి రొమ్ము తల్లి' - అమూల్య చందు, 'మా నాయిన పాట' - సుంకర గోపాల్ కు శుభాకాంక్షలు.
(మహాకవి మద్దూరి నగేష్ బాబు స్మారక కవితా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..)
- నస్రీన్ ఖాన్
9652432981