Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిని బుగ్గి చేయాలంటే అగ్గే పెట్టనక్కర లేదు
తనదైన సంస్కృతిని భాషని ధ్వంసంజేస్తే చాలు
ఆత్మను కోల్పోయాక .. యివాల అడవి అడవిలా లేదు ..
అక్కడ మనిషి మనిషిలా లేడు !
కట్టూ బొట్టూ చెరిపేసుకొని
శిలువముందు మోకరిల్లింది జాకరమ్మ
సువార్తల సందళ్లలో కందికొత్తలు కునారిల్లిపోయాక
పాతబడిపోయేయి పరుబు బయమాలు పండగలు
బాప్తిస్మంలో మునకలేసీ
తెల్లని ముసుగుతో తలదించుకున్నాయి పచ్చని కొండలు
గూడేం చుట్టూ గౌలీలై కాపాడాల్సిందిపోయి
రెక్కలు తెగిన జటాయువై పోయేడు జన్నోడు
పెళ్లిళ్లలో వేదమంత్రాల మాటున
కానికదీసిన కోడిపెట్టై కునుకుతున్నాడు యజ్జరోడు
చెట్టుముహూర్తాలు చెల్లిపోయాక .. దీసరోడ్ని జూసీ
పగలబడి నవ్వుతోంది బాపనీధి పంచాంగం !
అనివార్యంగా పల్లం ముందు మోకరిల్లింది
సనాతన ఆదిమ సంస్కతి
తడబడుతున్నాయి నెమలి పిట్టల థింసా అడుగులు
డీజె కూతలు కూస్తున్నాయి అడవి కోయిలలు
జీలుగు జీవధార తాగి మొహం మొత్తిందేమో ..
చీల్డ్ బీరై పొంగుతోంది గూడ
విషగాలులకు కొండగాలి కలుషితమైపోయింది
పిట్ట కట్టుకున్న గూడు పిట్టకే ఇరుకైపోయింది
అడవి మాయమై యివాల అంగడి వచ్చింది !
పరాయి కూత ముందు చిన్నబోయింది తరాల జీవద్భాష
యిది బతుకు పచ్చనితనాన్ని కోల్పోయిన అడవి ఆత్మ ఘోష
అస్థిత్వాన్ని కోల్పోయాక ..
ఆసాంతం నేలపొరల్లోకి చొచ్చుకుపోయిన మా మూలవేళ్లు
ఒక్కటొక్కటిగా తెగిపోతున్న చప్పుడు
గుండె గుట్టనెవరో..
కనిపించని గడ్డపారతో తవ్వుతున్న పచ్చిదుఃఖం !
అన్ని దిక్కుల్నీ ముంచేస్తూ
పల్లం మీంచి కొండల మీదకి పోటెత్తింది రంగుల వరద
పుట్టలు కరిగిపోతున్నాయి.. చెట్లు కూలిపోతున్నాయి
గూడేలకి గూడేలు వరదలో కొట్టుకుపోతున్నాయి
కళ్ల కడవల నిండా భయంకరమైన కలలు
గతం పూసిన స్మృతులు రాలిపోయి
పొదల మాటున బుసలు గొడుతున్నాయి
కార్పోరేట్ కాలసర్పాలు !
తొలిసారిగా అడవిలో..
ఏదో తెలియని ఒంటరితనం..
ఒక సామూహిక ఏకాకితనం
పిట్ట అలికిడిలేదు.. పిల్లంగోవి పాటలేదు
ఎల్టిమేక అరుపులేదు.. కొండవాగు పిలుపులేదు
ప్రతి శబ్దం ఒక ఉలికిపాటుకు గురిజేస్తోంది
ఎవడి నీడ వాడినే భయకంపితుడ్ని జేస్తోంది
అడవి నాగరికతను హత్తుకుందో.. లేదూ
నాగరికతే అడవిని ఆవాహన జేసుకుందో గానీ..
పచ్చని కొండల మీంచి దుఃఖం మాత్రం
యివాల పాయలు పాయలుగా ప్రవహిస్తోంది !!
- సిరికి స్వామినాయుడు, 9494010330