Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యం వాక్యాలను తొవ్వుకున్నప్పుడల్లా
తుమ్మ ముండ్లను దాటి ముందుకు వస్తున్నట్లుంది...
ఒక్క వాక్యం గుర్తొచ్చినా బాధ
ముళ్ళు నొప్పి తెలియకుండా నాటుకుంటుంది
ఇప్పుడు...
పొద్దంతా
ఆ ఎగరని ఈతపుల్లల గాలిపటాలతో
మందు సంచుల దారాలు కట్టుకొని
వీధుల పొంటి పొలాల వెంట తిరుగుతాడు
జ్వరంతో పొద్దూకి మూలుగుతుంటాడు
ఏం పిల్లాడో ఏమో.....
ముసురు తేనీగా శబ్దంలా అమ్మ మాటలు...
లేవ్ రా చిన్నా లేవ్ మీదికి చారు తాగుదువు..
అసంతృప్తితో
అమ్మ... నేను నాలుగుసార్లు
గాలిపటం ఎగరేసా తెలుసా...
డికాసినలో నువ్వుల జొన్నరొట్టె అద్దుకొని
తింటూ ములుగుతు నేనూ.....
ప్రతి సంక్రాంతికి
బడి సెలవులు ఉండే ఆ నాలుగు రోజులు
అమ్మ నేను రాత్రికి మాటల తూటాలను
గాలిపటాలలా ఎగరేస్తాం....
అమ్మ మాటలను రాత్రి
ముద్ద ముద్దకు మూలుగుతూనే..
పొద్దున్నే గాలిపటాల మరమ్మత్తుల సోకులో
మరిచిపోవడం వెన్నతో విద్యా
గాలిపటం అంటే అంత ఇష్టం నాకు...
మా ఇంటి మీద నుండి
గాలికి కొట్టుకొచ్చిన రంగుల గాలిపటాలు దొరికితే
ఎన్ని మరమ్మతులు చేసేవాడ్నో
సొప్ప పుల్లలతో ఈత పుల్లలతో
పేపర్ గాలిపటాలను..
అన్నం మెతుకులతో అంటించుకునేవాడ్ని
న్యూస్ పేపర్లతో గాలిపటం చేసే
ఇంజనీర్‌ను మరి నేను...
రంగుల గాలిపటం ఇప్పించే నాన్న
చిన్నప్పుడే అమ్మ నుండి దారం తెంచుకొని
గాలిపటంలా ఎగిరిపోయిండు
పేపర్ గాలిపటాలను
ఎన్నిసార్లు ఎగిరేసానో అందనంత ఎత్తుకు...
ఎగుర గలిగేంత దూరం ఎగిరేయడానికి
దారం లేదని తెలిసి ఆగిపోయేవాడిని....
ఆరోజు కూడా
పొద్దంతా గాలిపటం ఎగిరేసే వాడ్ని
కాని నాలుగు సార్లే ఎగరేసా...
ఈత పుల్లలతో తయారు చేసిన ఆ గాలిపటం
ఎగిరినట్టే ఎగిరి మా వీధులన్ని నన్ను పరిగెత్తించింది
ఆ పరిగెత్తే క్రమంలోనే
పొద్దున్నే తెచ్చిన ఈత కొమ్మల ముల్లులు
కాలికి నాలుగు చోట్ల దిగాయి
అలాగే పరిగెత్తా గాలిపటం సుడిగుండాలు తిరిగింది
అందరి రంగుల గాలిపటాలు పైపైకి ఎగిరినా
నా గాలిపటం ఎగరలేదు
మూలుగుతూ పడుకున్న...
పేదరికం కలలో రంగులా గాలి పటాలను స్వేచ్ఛగా
ఎగిరేస్తున్న రాజకుమారుడిలా
ఆ రాత్రంతా ముల్లు గాయం మర్చిపోయా
ఇక పొద్దున్నే లేవలేదు...
మళ్లీ ముసురు తేనీగా శబ్దం
నా చెవిని తోలుస్తుంది
ఈసారి అమ్మ కాదు
వరి మొల్క మండ అలికినాం
ఇత్తులు సల్లిన రోజు
ఇంట్ల నుండి పైసలిస్తే అరిష్టం
అందుకే ఇంటికొచ్చి ఇస్తున్నా
ఇంటికి వచ్చి ఉట్టి కొంగుతో వొస్తివి
నారెయ్యడానికి రావాలి చూడు బిడ్డ
పో పిల్లగాడు చానా కాలుతుండు
దవాఖానాకి పో అని గొంతు నిమురుతున్న
ఇంటి పక్కలి అవ్వ...
నేనేమో పడుకున్నట్లే ఉంది
కాని ప్రయాణం...
అమ్మ చీర కొంగు నెత్తికి తాకుతుంది
గాలికి ఎగురుతుంది
బహుశా కలలో గాలిపటం
ఎగరేస్తున్నా అనుకున్నా...
కలల ప్రయాణం అమ్మ కన్నీళ్ళతో
వీపుల మీద వర్షం చినుకుల్లా పడుతుంటే
తేరుకుంటున్నా ...
దవాఖానా అంటే భయం
కాని ఈ సారి నాకు తెలియకుండానే
చికిత్స అయిపోయింది
రోడ్డు పక్కలా ఆటో బండికాడికి పోతుంటే
నా కాలికి తెల్లని పట్టి కనిపిస్తుంది
అచ్చం గాలిపటం దారం లానే
రోడ్ పక్కలా చారు బండినే
మొదట చూసా నోరు గుంజింది
అమ్మ నడిగేసా
'అమ్మ ఆకలైతుందే'
బొగ్గుల బండి కాడి చారు డబల్ రొట్టె కావాలే
నేను చారు తాగి గాలిపటం
ఎగరేస్తా..
ఎలాగైతేనేం నా మాట దారం
నోట్లో నుండి బయటకి రాగానే
అమ్మ నవ్వు గాలిపటంలా ఎగిరింది
- దండు వెంకటరాములు
6303163202