Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం మనుష్యులం కాదు
మనకు ఏవో పేర్లు ఉన్నాయి
అవీ కాదనీ
తోకలు తొడిమెలు ఓ గంప నిండేటన్నీ ఉంటాయి.
మనిషిని మనిషనీ పిలిచే కాలం కాదు.
ప్రాధాన్యతకు కులం
గౌరవాలకు తోకలు
రాజులు మహారాజులు
పదవులు పట్టాలు ఇంకేవేవో ఉంటాయిలే.
పేరుబెట్టి పిలిస్తే
మానాలకు మానభంగం జరిగిపోయినట్లే.
పేరు చివర కులం తోక లేకపోతే
వాడికి జీవితమే లేదు
వాడు సచ్చిన శవంకన్న హీనం.
ఇప్పుడు ఇక్కడ మనుష్యులు లేరు
డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు కంట్రాక్టర్లు
ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు..
కూలీలు పేదలు నిరుపేదలు అలగా జనాలు
ఇంకా మనుష్యులెక్కడున్నారు.
మనిషిలోని ఇరుకుతనమే
మనిషిని మనిషిగా పిలవనివ్వదు.
ఇప్పుడు
మనిషిని మనిషిగా చూసే కాలం కూడా కనుమరుగైంది.
ఇదే ఇప్పుడు
ఈ భూమిమీద అతిగొప్ప నాగరికత.
- అవనిశ్రీ, 9985419424