Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ సుగుణారావు రాసిన 'ఆకాశంలో ఒక నక్షత్రం'లో వైవిధ్యమైన కథలున్నాయి. వీటిని చదివితే అగరుబత్తి పొగ అర్రను కమ్మేసినట్లు అనుభూతి హృదయమంతా నిండి ఒక ఊపు ఊపేస్తుంది. ఈ కథా సంకలనంలో వర్ణ వివక్షనూ వర్గ విబేధాలనూ చిత్రీకరించే విభిన్న ఇతివృత్తాల కథలున్నాయి. ఈ కథల్లోని పాత్రలు మనలను వెంటాడుతాయి. ఆలోచింపజేస్తాయి.
కుల వివక్షను అద్దం పట్టి చూపిన కథ కాల భైరవుడు. అబ్రహాం లింకన్ వృత్తిరీత్యా వైద్యుడు. పేరు మూలంగా ఎక్కడా ఇల్లు అద్దెకు దొరక్క అతను ఇబ్బందులు పడుతుంటాడు. అతని అసలు పేరు చెప్పకుండా కవితలు రాసే కలం పేరు చెప్పి తమ బంధువుల ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకిప్పిస్తాడు స్నేహితుడు రమణమూర్తి. ఓ రోజు లింకన్ ఊరి వాళ్లు అతని కోసం రావడం ఇంటి వాళ్లకు అతని కులమేమిటో తెలిసి పోతుంది. లింకన్ కరోనా పేషంట్లను చూస్తున్న కారణంగా తమకు భయంగా ఉందని ఇల్లు ఖాళీ చేయమని వాళ్లతనికి చెప్తారు. కరోనా మూలంగా ఆ ఇంట్లోని పెద్ద మనిషి చనిపోతే వాళ్ల బంధువులెవరూ రారు. శవ దహనంతో పాటు తక్కిన కార్యక్రమాలన్నిటినీ లింకనే ముందుండి నడిపిస్తాడు. దాంతో కులం కన్నా మానవత్వం ముఖ్యమని ఇంటి ఓనరు తెలుసుకుంటాడు.
'ఆపాల పెద్దమ్మ' కథ కూడా కుల వివక్షపై రాసిందే. అనిల్‌కుమార్ ఉన్నతస్థాయి అధికారి. సంఘంలో గుర్తింపూ, గౌరవమూ అతనికున్నాయి. కాని చిన్నప్పటి వివక్ష తాలూకు గాయాలు అతన్ని కల్లోల పరుస్తూనే ఉంటాయి. 'ఓరేరు మొన్న నువ్వు ఇచ్చిన ఆపాలు తిన్నాను. చాలా బావున్నాయి. ఆ విషయమే అమ్మకు చెప్పాను. అమ్మ తిట్టిందిరా ఎప్పుడూ వాడు ఏమిచ్చినా తినకు అంది'.
ఈ మాటల మూలంగా చిన్నప్పుడు అనిల్‌కుమార్ మనసుకు ఏర్పడిన గాయాలు పెద్దయి పెరిగిన తరువాత కూడా సలుపుతూనే ఉంటాయి.
సుగుణరావు తన కథల్లో ఎక్కడా కులవివక్ష, దళితులు, అగ్రవర్ణాలు, మనువాదులు, బ్రాహ్మణీయ భావజాలం వంటి పడికట్టు పదాల్ని వాడలేదు.
'వీడు అబ్రహం లింకన్, మా ఊరోడే. మా కాటమయ్య కొడుకు. వీళ్ళ నాన్న మంచి పనోడండి. ఇంటింటికీ తిరిగి కొలతలు తీసుకుని చక్కగా ఎవరి సైజుకు తగట్టు వారికి చెప్పులు కుడతాడు. అలాగే, పీనుగుల్ని కదిలించేటప్పుడు డప్పు వాయిస్తాడు' అంటూ అప్పలనాయుడు చెప్పగానే లింకన్ కులమేమిటో పాఠకుడికి అర్థమైపోతుంది. ఇలా రచయిత పరోక్షంగా చెప్పాడే తప్ప కులం పేరును ప్రస్తావించలేదు.
రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతంపై రాసిన కథే 'ఆకాశంలో ఒక నక్షత్రం'. ఈ కథను కళాత్మకంగా తీర్చిదిద్దడంలో రచయిత విజయం సాధించారు. రోహిత్ పేరును తొహిరోగా మార్చి కథ నడిపారు.
ఆదివాసీ సర్పంచుల రిజర్వేషన్ దుర్వినియోగాన్ని 'నాయకుడు' అనే కథలో రచయిత కళ్లకు కట్టినట్లు చూపారు. ఆదివాసీలకున్న రిజర్వేషన్‌ను తనకనుగుణంగా మార్చుకోవడానికి బుగత అప్పలస్వామి ఎంత ప్రాధేయపడినా సంతకం పెట్టకుండా నర్సింహ నిశ్శబ్దంగా తిరుగుబాటు చేస్తాడు. తన పెంపుడు కుక్కను వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లిపోతాడు.
'దేవుడిని చూసినవాడు' కథలో నిజాయితీగా పని చేయడం మూలంగా సుదర్శనానికి ఇల్లు వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని అవగారంగా భావించి ప్రజలు అతణ్ని పూజిస్తారు. నిజాయితీగా నిలబడే వారిని బయటివారే కాకుండా ఇంట్లోని వాళ్లు కూడా అర్థం చేసుకోలేరని రచయిత అంటాడు. యధార్థ వాదులు లోక విరోధులు అయితేనేం సత్యం జయిస్తుంది. యదార్థ మార్గం సార్వజనీనం అనే సత్యాన్ని పూజారి పాత్ర ద్వారా రచయిత చెప్పిస్తాడు.
ఒక స్థాయికి ఎదగగానే తన మూలాలను మరిచిపోయిన లక్ష్మిపతిరావుకు ఎలా కనువిప్పు కలిగిందో 'కన్నీరు ఉప్పగా ఉంది' కథలో రచయిత ఆకట్టుకునే విధంగా చిత్రించారు. ఈ కథ ముగింపు పాఠకుల్ని కదిలించేస్తుంది. తన ఊరి వాడే కాకుండా నిజాయితీ పరుడైన డాక్టర్ తన కూతుర్ని ప్రేమిస్తే కోటీశ్వరుడైన లక్ష్మిపతిరావు సహించడు. అతను తన మూలాలను మరిచిపోయాడు. ఉప్పు మడులలో పని చేసి తనను చదివించిన తల్లిదండ్రులను మరిచిపోయాడు. ఉన్న వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోతాడు. ఉప్పు మడులలో పని చేసే వారికోసం తనకన్నా చిన్నవాడైన డాక్టర్ పని చేయడంతో అతనికి కను విప్పు కలుగుతుంది.
ఒక్కో రచయిత ఒక్కోటి ఊతపదంగా ఉంటుంది. సుగుణరావుకు 'పలచని చీకటి' ఊతపదంగా ఉన్నట్టుంది. 'చీకటి తెరలు పలచగా' (క్షమాభిక్ష) 'పల్చటి చీకటి తెరలు' (రెయిన్ డేన్స్) 'పల్చటి చీకటి తెరలు (దేవుడిని చూసిన వాడు) ఈ కథా సంపుటిలో ప్రతి కథా ప్రత్యేకమైందే చదువదగిందే.
- తెలిదేవర భానుమూర్తి, 9959150491