Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు కాళ్లు, రెండు చక్రాలు, నాలుగు చక్రాల నుండి
రెక్కల విమానం మీదగా...!
మనిషి కాని మనిషిలోకి నడుస్తున్నామా?
కొత్త మానవుడు వాడు
అయినా
అడుగుల్ని లెక్కలేసుకొని మెతుకుల్ని ఏరుకొనే ప్రయాణం మొదలు
మేఘాల్లో సెల్ఫీ దాకా ఆకలి పొట్లమే కదా విప్పుతాము
బౌండరీ దాటని బంతిలా ఓ ఆలోచన అపుడపుడూ
కపాళం గోడల్ని బద్దలు కొడుతుంది
సిగల్ పడింది
ఆయువు అరవైకి పడిపోయినట్లు అక్కడినుండే మొదలైంది కౌంట్
60,59,58,57,56,55....
నా కాళ్ల చక్రాలకు, నగరం రహదారులకు అనదికారిక పరుగు పందెం
సుదీర్ఘమైన సంచారం
విచారవధన సన్నివేశాల్లో ఇష్టంలేని సహాయక పాత్రల నడుమ దుఖించడం కూడా నటించడమే అవుతుంది
క్లైమాక్స్ దాకా రీటేక్ ఉంటే బాగుండనిపిస్తుంది
నవ్వుని నవ్వులాగే నవ్వడానికి
శోకాన్ని శోకంలాగే శోకించడానికి
ఏవో చేసేసాం అనుకొని ఎన్నో దాటేసామని ఓ అర్ధరాత్రి రోడ్డు పక్కన సిటీ లైట్ వెలుగులో....
ఏమీ చేయలేకపోయాము, ఏదీ దాటలేకపోయామనే నిర్వేదనలో అదే అర్ధరాత్రి, ఆ రోడ్డు పక్కనే సిటీ లైట్ వెలుగులో
ఓ సిగరెట్టుని ఆస్వాదిస్తాము, ఓ టీ ని స్వాగతిస్తాము
దూరంగా చిగురాకుమందం గాలి చిత్తు కాగితాలను పాఠ్య గ్రందాల్లా ఎగరేస్తుంది
వాటినేరుకునే నడి వయసు ఆడమనిషి జుట్టు రాగితీగ రంగులో మెరుస్తుంది, నాట్యంలా రేగుతుంది. ఆ క్షణానికి అదే దశ్యకావ్యం
మన పక్కగా వచ్చి నిల్చున్న కుక్కపిల్ల కొత్తగా స్నేహాలతని అల్లుతుంది
మిగిలిపోయిన ఆఖరి అగ్గిపుల్ల మనతో కాసేపు సంభాషిస్తుంది
కొత్త గీతని బోధిస్తుంది , శోధిస్తుంది ఎంతోకొంత మనల్ని మండిస్తుంది
మిగిలేవి ఇవే!
చివరికి మిగిలేవి కూడా ఇవే!
మధ్యన మనం నడిచేవి, దాటేవి, ఈదేవి ఎండమావి కాలవలేనని కొంత ఆలస్యంగా తెలుసుకొని నవ్వుకుంటాము
అంతే.........!!
- వెంకటేష్ పువ్వాడ, 7204709732