Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం ఉదయం వీధుల్లో
విధి నిర్వహణలో ఉదయిస్తుంటారు
చెత్తాచెదారంతో ముద్దుముద్దుగా
ముచ్చటిస్తుంటారు..
నగరం నిద్రలేవగానే దర్శనమిస్తారు
దుమ్ము ధూళితో అస్పష్టంగా
సూర్యోదయం కంటే ముందే
వీధులను దర్శించుకుంటారు
అందుకే ఓ తల్లిగా ఆదరిస్తూ
చీపుర్ల ఊడ్పుతో నిట్టూర్పు సెగలతో
చెలరేగిన దుబ్బతో అందరికీ
చేయూతకు చేరువై ఉంటారు
కరువు వచ్చినా
కాలం మారినా,కడుపు కాలినా
తప్పని తిప్పలు ఈ కార్మికులు
మైలపడ్డ వీధులన్నీ కొత్త వ్యాధులకు
దారితీసే దారుల్లో మురిపించే
విధంగా చేసి
ముప్పై ఏడేళ్ల విధి నిర్వహణలో
వీధులకు అంకితమై
అనుభవాల్ని,అనుబంధాల్ని పెంచుకొని
వీధులతో పంచుకొని వ్యాధులన్నీ తొలిగించే డాక్టర్ గా తమలోని సహనంతో ఓర్పుతో సాగుతారు..
స్వచ్చంగా వీధులన్నీ
పులకించిపోయేది
ఎందరు చీదరించుకున్నా
చీపురుతో సమాధానం
ఎందరు ఈసదించుకున్నా
చూపులతో సమాధానం
సహృదయ సంపన్నులు..
వీరివలనే ఓ కొత్తలోకం స్వచ్చత దేశం
ఏ చౌరస్తాలోనైనా చైతన్యగా కనిపిస్తారు
అస్తవ్యస్తమైన వీధులన్నీ
స్వచ్చంగా మారుతాయి
మానసికంగా మధనపడే వీధులన్నీ
అంతరంగమంతా ఓ కాంతిమయమే
ఓ కాంతి పుంజమే
వీరిని ఎంత ప్రశంసించినా తక్కువే..
తెలియని లక్ష్య సాధనవైపే..
అకుంఠిత మనోదీక్షకు నమస్కరించాలి
అసలైన సేవాతప్తహృదయాలు
నిత్యం ఓ ఉక్కు సంకల్పబలంతో
అనునిత్యం యుద్దానికి సిద్ధంగా ఉంటారు
దిగజారిన దారుల్లో నైనా
ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా
సమగ్ర ఆయుధాలతో సాగుతారు
అందుకే వీరిలోనే స్వచ్చత
వీరిలోనే అందమైన ఊహలు నిండుకున్నాయి
ఒక్కరోజు వీరు వీధుల్లోకి వెళ్లకపోతే
రోజురోజుకు రోడ్లపై కొత్తపోకడతో
కుళ్ళు కుతంత్రాల చెత్తాచెదారం నిండుతుంది
నిత్యమనుషులను కలుషితం చేస్తాయి
మురికితనంతో ఉరకలేస్తాయి
దుర్భర దుర్వాసనతో నిండిపోతాయి
నిజమైన నగర సేవకులు
ఈ కార్మికులు!!..
- అంబటి నారాయణ
7386699113