Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హేతువాద, మానవవాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి మరణం మానవాళికే తీరని లోటు. ఎందుకంటే ''హేతువాదం'' అనే ఒక్క పదంపైన ఆయన రాసినంత విస్తృతంగా, లోతుపాతులతో - వాసిలోనే కాదు, రాశిలోనూ విస్తారంగా రాసిన రచయిత, నిత్య గమనశీల కార్యకర్త వెంకటాద్రి కాకుండా ప్రపంచంలో మరెవ్వరూ లేరు. వారు హేతువాద ఉద్యమానికి మానవవాద మలుపును ఇచ్చిన తాత్వికులు. కేవలం హేతువాదం అంటే నాస్తికత్వం అని, ప్రతి విషయాన్ని నిర్వ్ధందంగా వ్యతిరేకించే వారని, మూఢనమ్మకాల నిర్మూలనకు మాత్రమే పరిమితమైనవారని అప్పటివరకు ఉన్న అపోహను, అపార్థాలను తొలగించడం కోసం వారు పడ్డ ''శ్రమ'' అసామాన్య మైనది. రచయితగా, కార్యకర్తగా, ఉద్యమ సారథిగా, పబ్లిషర్‌గా ఇలా రావిపూడి వెంకటాద్రి అనేక ఇబ్బందులతో అనేకమైన బాధ్యతలు దశాబ్దాలుగా మరణానికి 20 రోజుల ముందు వరకూ నిర్వహిస్తూనే వచ్చారు.
రావిపూడి వెంకటాద్రి ఫిబ్రవరి 9,1922 జన్మించారు. 1943 ఏప్రిల్ 5 న కవిరాజాశ్రమం - నాగండ్లలో స్థాపించి, 1946 నుంచి హేతువాద మానవవాద రచయితగా, ఉపన్యాసకులుగా కొనసాగారు.
1956-96 మధ్య నాగండ్ల గ్రామ సర్పంచ్‌గా గ్రామస్తుల కోరిక మేరకు పని చేశారు.1979 - 1989 మధ్య ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ భారత హేతువాద సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. తానే వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన మాస పత్రిక ''హేతువాది''కి 1982 సెప్టెంబరు నుంచి 2023 జనవరి వరకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. అంత ేకాకుండా హేతువాద మానవవాద ఉద్యమానికి ఒక చిరునామా కోసం 1991లో రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్, ఇంకొల్లులో స్థాపనకు మార్గదర్శిగా నిలిచి ఉద్యమకారులకు ఒక గొడుగుగా మారారు. అమెరికా, యూరప్‌లలో పర్యటించిన అంతర్జాతీయ హేతువాది, రావిపూడి వెంకటాద్రి. 1993లో ''హేమా పబ్లికేషన్స్'' స్థాపించిన ఆయన ఇప్పటి వరకు 200 పుస్తకాలు ప్రచురించారు. అందులో వంద పుస్తకాలు తనవి కావడం ఒక విశేషమైతే తోటి ఉద్యమకారులను రచనా వ్యాసంగం వైపు మళ్ళించి వారి రచనలకు అవసరమైన సూచనలు చేసి, స్వయంగా తానే ఫ్రూపులు దిద్ది పుస్తకాలు ప్రచురించడం మరో విశేషం.
పేరు కోసం ప్రాకులాటలు, అవార్డుల కోసం ఆరాటం ఎంతమాత్రం లేని వెంకటాద్రికి 1996లో కవిరాజు త్రిపురనేని ట్రస్టు నుంచి కవిరాజు త్రిపురనేని రామ స్వామి స్మారక జీవిత సాఫల్య అవార్డుతో మరెన్నో అవార్డులు వరించాయి. 1999లో ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ మాన వవాద నైతిక సంఘ అంతర్జాతీయ సదస్సులో ''బుద్ధుడు- హ్యూమనిస్ట్ దృక్పథం'' అంశం మీద ఉపన్యాసం చేసి అంతర్జాతీయ వేదికలపై ఎందరినో ఆలోచింపజేశారు.
వందలాది అధ్యయన తరగతుల్లో ఉపన్యాసకు లుగా, పర్యవేక్షకులుగా శిక్షణ ఇచ్చిన ఉద్యమ మార్గదర్శి రావిపూడి. హేతువాద, మానవవాద సాహిత్యం పరిచయ మయ్యాక, యం.యన్.రారు భావాల ప్రభావంతో వచన రచనకు ఉపక్రమించాడు.
''అనంత విశ్వం'' పేరుతో ఐదు భాగాల పుస్తక రచ నను ఆరంభించి ''విశ్వాన్వేషణ'' ''విశ్వతత్వం'' గ్రంథాలు పూర్తి చేశారు. విశ్వాన్వేషణ గ్రంథ రచనతో ఆరంభించి ''పురాణం - ధృవుడు'', ''జీవమంటే ఏమిటి?'', ''మార్క్సిస్టు భౌతిక వాదం'', ''మానవుడు- సమాజం- ప్రకృతి'' తదితర హేతువాద మానవవాద గ్రంథ రచనలను యుక్త వయసులోనే పూర్తి చేసి ప్రచురించాడు. ఎం.ఎన్.రారు - భారత కమ్యునిజం, శాస్త్రం - అశాస్త్రం, ఆది శంకరా చార్య వ్యక్తిత్వం - తత్వం, మార్క్సిజం, హ్యూమనిజం, నాస్తికత్వం, ఔనా! వేదాల్లో అన్నీ ఉన్నాయా?, మత జాఢ్యాల మచ్చు తునకలు, మనుస్మృతి మైనస్ అశుద్ధం, హ్యూమనిస్ట్ సమీక్షలు, వాస్తువు శాస్త్రమా?, అడుగు జాడలు, మనం ఏమి చేయాలి?, స్వామినేని - త్రిపురనేని, హేతువాదం - నైతిక విప్లవం, నేను నా రచన వ్యాసంగం... ఇలా వారి రచన వ్యాసంగం కొనసాగింది. తన చాలా పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువాదం కూడా చేసుకున్నారు.
నిజానికి వెంకటాద్రి గొప్పతనం ఏమిటంటే వారు నిరంతరం తనకు ఉన్న జ్ఞానస్థాయిని అప్డేట్ చేసుకుంటూ జీవితాంతం హేతువాద, మానవవాద ఉద్యమానికి లైట్ హౌస్ గా వేలాది మందికి స్ఫూర్తిని కలిగించారు, ప్రేరణ రగిలించారు. ఆయన కలం తాకని అభ్యుదయ అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్రాసిన రచనలు దాదాపు 7000 పేజీల ప్రింట్ రూపంలోని సాహిత్యం రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ - ఇంకొల్లు ప్రాంగణంలో ఉంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ''ప్రపంచ భావగమన చరిత్ర''లో ఆయన మస్తిష్కం వెలువరించిన భావాలు చిరంతరంగా నిలిచే ఉంటాయి.
- కె శ్రీనివాసాచారి, 7780664115
ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర హేతువాద సంఘం