Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరంతరం ప్రవహించే నదీ పాయలు
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నాయి!
వేయిరేకల వెన్నెల పువ్వు
నేల వైపు వాలుచూపు చూస్తోంది!
సప్తవర్ణాలు లుప్తమైన ఇంద్రధనుస్సు
వివర్ణమై ఆకాశాన్ని వీడుతోంది!
నడిచి వచ్చిన నిన్నటి పాదముద్రలు
నానాటికీ చెదిరిపోతున్నాయి!
వివిధాలను విభిన్నాలను
వివాదాస్పదం చేయడం సులువైన విద్యే
యదార్థాన్ని గ్రహించే లోపే
జరగరాని ఘోరం జరిగిపోతుంది
మూతులుకుట్టేసి చేతులుకట్టేసి
విద్వేషాగ్నుల్ని రగిలించడం ఎంతసేపు?
సంయమన సాధనా! దాని ఫలితం
అంత సులభం కాదుకదా!
ఆకలీ అవసరం అమాయకత్వాలు
శాశ్వతత్వాన్ని ఆపాదించుకున్న మైదానంలో!
చేయితిరిగిన ఆటగాళ్ళు చెలరేగిపోరూ?
అచ్చోసిన ఆంబోతులకు
ముకుతాళ్ళు బిగించకపోతే
మంకుతనంతో రంకెలు వేయవూ?
వేటాడటం నిషేధించబడినా
వేటమీద పడుతున్న వేటగాళ్లు!
వీళ్ళు మనుషులా?మనుషుల్ని తినే పులులా?
దంతాలున్న ఒక పిచ్చి ఏనుగు!
దానిపై చెదలు పట్టిన అంబారీ!!
చోద్యాలు చూసే మావటీలు!!!
- కరిపె రాజ్ కుమార్, 8125144729