Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిక్కులన్నీ శూన్యమైన వేళ
చెరువే పెద్దదిక్కయ్యింది,
నన్ను నేను చేరుకోడానికి
చెరువుగట్టు విలువైన దారినిచ్చింది!
అడుగులు క్షణాలతో బాటు
కలగలసి నడుస్తున్నాయి,
ఏ ఒక్క క్షణాన్ని వృథా చెయ్యకుండా
అన్నీ ఒకేవైపు పయనించాయి!
ఎగసిపడే ఆలోచనా కెరటాలు
తీరాన్ని దాటాలని చూసినా,
చెరువు గుండె కరిగిపోయి
చేయందిస్తూ అక్కున చేర్చుకుంది,
గట్టు దాటి వెళ్ళలేవని
అమ్మ కొంగులాంటి ఓదార్పునిచ్చింది!
ఒడ్డున పడ్డ మనసుచేపను
తన ఒడిలోకి తీసుకుంది,
అలజడిని అల్లకల్లోలాన్నీ
తనలోకి చల్లగా కలుపుకుంది!
ఎర్రబడ్డ సూర్యుడు నీడనిస్తూ
మెల్లగా జారిపోయాడు,
మబ్బులు కమ్ముకుంటూ
పగలు రాత్రి ఒకటని ఏకం చేసింది,
వెలుగైనా చీకటైనా
పంచుకుంటేనే అందమనీ
విడమరచి చెప్పింది!
ఒక్కోసారి చెరువు
మనకు ఎదురుగానే కాదు,
కళ్ళలో కూడా చేరుకుంటుందని
పలుమార్లు నిరూపించింది!
ఇప్పుడు చెరువు ఒక్కటే కాదు
శూన్యం ఎక్కడున్నా
నన్ను నేను ముక్కలు చేసి విసిరేస్తాను
మళ్ళీ ఒక్కటై నాలోకి చేరుకుంటాను!
- పుట్టి గిరిధర్, 9494962080