Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు'' అనే రచనలో ''మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు''... ఇది మొదటి వాక్యం. ఇందులో 'పలుకొటం' ఏమిటి? అది 'పళ్ళిక్యూట్టం' అనే తమిళజన్యం అర్థం.. పాఠశాల అని, తమిళనాడుకు చిత్తూరు సరిహద్దు జిల్లా కనుక ఈ పదం ఇటు వచ్చేసింది. ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ జరిగే ఈ ఆదానప్రదానాలు సరిహద్దుల్లో దాదాపు ప్రధానంగా జరిగేవే! పై వాక్యంలో 'గెడారం' అంటే గడియారం. 'గడియారం' అనే మాట మాత్రమే తెలిసిన వాళ్ళు 'అయ్యో! భాష పాడైపోయిందే? ఈ గెడారం ఏమిటి? అని ముక్కు విరుస్తారు. కానీ, అటువంటి పెదవి విరుపులు అవసరం లేదు. ఎందుకని? 'గడియారం' కూడా ఆ లెఖ్ఖన తప్పే! అది వాస్తవంగా. 'ఘటీకారము'. కనుక.. మూలపదంతో పోల్చితే గడియారం ఎంత తప్పొ, గడియారంతో పోలిస్తే గెడారం అంతే తప్పు. నిజం చెప్పుకోవాలంటే, ఏదీ తప్పు కాదు.ప్రజలు మాట్లాడుతున్న రూపాలన్నీ దాదాపు సాధురూపాలే. భాషలో దైనందిన బవన సంఘర్షణలో ఉచ్చారణా వేగంతో చదువుకోని కారణంగా ప్రజలు అలా పలుకుతారు. భాషా శాస్త్రవేత్తలకు ప్రతిపలుకూ శిరోధార్యం.
ఈ కథలోనే నామిని ఓ చోట 'ఇష్యూలు' అంటాడు. ఆంగ్లపదం స్కూలును పలుకలేక ముందు 'ఇ' చేర్చుతారు. ఇది ఉర్దూ సంప్రదాయం. అడవి బాపిరాజు రాసిన 'గోనె గన్నారెడ్డి'లో 'లాక్కుంటూ'కు బదులు 'ఉళాక్కుంటూ' వుంది. దాదాపు గ్రాంథిక భాషకు దగ్గరగా ఉన్న అందులోనే ఇది ఉంది. కారణం ప్రాంతీయ ముద్ర కూడా. అలాగే ఆంగ్లం మాట 'పర్మినెంటు', నామిని భాషలో 'పర్మనెట్టు' ఆయిల్ మిషన్ అనేది ఆయిన్ మిషినీ. నిజమే! టిఫిన్ సెంటర్ను సీమలో చోట్ల 'టిఫినీ' అని అనగా విని రాయగా చూసినవాణ్ణి!
ఇందాకటి వాక్యంలో 'అయ్యోరు' ఉన్నారు. ఆయన అయ్యవారు. అంటే బడిపబంతులు. అయ్యవారు మారిన రూపం దాల్చి అయ్యోరయ్యారు. 'అయ్యో! ఎంత ఘోరం!' అనేస్తారేమో మరలా పండితులు. శ్రామిక జనం తమకు అవసరమైన పద్ధతిలో మూల పదం మార్చుకుంటారు. ఈ కథలోనే 'పెద్దోళ్ళు, వోడు, వోళ్ళు' ఇలాంటి పదాలున్నాయి. ఇవి క్రమంగా 'పెద్దాళ్ళు, వాడు, వాళ్ళు'. మరి... ఈ 'వాడు, వాళ్ళు' సరైనవేనా? కాసేపు పండితుల మాటే అంగీకరిద్దాం. కాదు, అవి క్రమంగా 'అవండు, అవర్గన్' నుండి వచ్చిన రూపాలు. అందుకే పూర్వం 'వాడు'లో 'వా' తరువాత అరసున్నా ఉండి 'డు' ఉండేది. 'వాడు' ఇలా మారాడు. వాడు మారాక వాళ్ళూ మారిపోయారు. ఆ వాళ్ళకు ముందు పెద్ద విశేషణం చేర్చగానే పెద్దోళ్లయిపోయారు చిత్రంగా.
ఈ కథలో 'పిలకాయలు'న్నారు. 'పిల్లలు, పిల్లవాళ్ళు'లో లేని కాయలు రాయలసీమలోఉన్నాయి. పిల్లగాండ్లకు శిష్ట వ్యావహారికంలోని 'ఎండ్రి'కి తెలంగాణలో 'కాయ' చేరలేదూ! (ఎండ్రికాయ) తెలుగువాళ్ళందరి 'తల' అప్పుడప్పుడు 'తల కాయ' కావడం లేదా?
ఇంకో ముఖ్యమైన విషయం నామిని కథలో 'కాకువు' కనిపించడం. చెప్పదలచుకున్న దాన్ని ఒక ఒడుపుతో చెప్పి గొప్పగా భావాన్ని గోచరింపచేయడం ''కాకువు'' ఓ చోట... 'నిజ్జం' అంటాడు. ఇది 'నిజం' కదా! మరి 'నిజ్జం' గా అవతారం ఎత్తిందేమిటి అంటే, 'నిజం' కన్నా 'నిజ్జం' అంటే మరింత వాస్తవం అని. ఇక 'నిజ్జం' అంటే చిత్తూరు ప్రాంత విశిష్టత. 'భయం' అనేదాన్ని మనం సందర్భోచితంగా 'బయ్యం' అనటం లేదూ అడపాదడపా! ఇంకా ''మద్దేనం, గెంట, అచ్చిరాలు, లంబ, ఆకిలి (ఆకలి), మునం పట్టి (మునుం), నీళ్ళు ఎత్తకపోయి (ఎతుకు పోయి)' ఇటువంటి ఉచ్ఛార ణలోని ఒడుపులు అడుగడుక్కీ చూడగలం. 'అబద్ధం' అనే మాట మనందరికీ తెలుసు. నామినిలో అది 'అపద్దం' అంటే 'బ' అనేది 'ప'అయ్యింది. బాపురే! తెలంగాణలో అబద్ధం 'అపద్దం'గా మారింది. 'బ' అనేది 'ప'గా మార్పు చెందింది. భావార్థం ఒక్కటేగా! మరిలాగైతే భాష పూర్తిగా మారిపోతుంది కదా అని ప్రశ్నిస్తే మరి తెలుగు భాషలోని 'ఒకటే' అనే మాటలకు ఏభై రెండు రకాల రూపాంతరాలు ఎందుకూ? ఈ ప్రశ్న నాది కాదు - గిడుగు వంటి వాళ్ళు వేశారు ఎనుకటనే! అదుగో 'వెనుకట' (పూర్వం) అనేది 'ఎనుకట' అయ్యింది. పదం మొదట ఉన్న 'వ'కారం లోపిస్తుంది ప్రజల నోట, ఎందుకూ నండూరి 'వెంకి' పాటలు రాశాడా? 'ఎంకి'యా?
నామిని తన మొదటి రచనలో ఇట్లా 'యెనకా న్నించి, యెంటికలు, యెధవా, యినిపిస్తాయి, ఇచ్చిత్రం'లలో పదానిది వకారలోపం బిరిగిన మాటల్ని ఉపయోగించాడు. అదీగాక 'సిత్తూరు, సెంద్రగిరి, సేతికి, సాటుమాటుగా, సిన్నప్పుడు, సిరంజీవుడు, సోట, అరిసి (అరిచి), మరిసిపోయి (మరిచి), సిన్నతనం'... వీటిలోల చకారం సకారంగా మారిన రూపాలు చూపాడు. అన్నట్టు... అబద్ధం అనే మాట 'అపద్దం' అయిపోతే, చిత్తూరులో 'శబ్దం' అనేది 'శపద్దం'గా వినిపిస్తుంది. ఎంత చిత్రం! శబ్దంలోని 'బ్' అనే పొల్లు 'ప'గా మారిపోవటమే గాక ఒత్తుగా ఉన్న 'ద' చిత్రంగా 'ద్ద'గా పర్యవసించింది.
ఇంకొక మాట 'పెక్కాసి'. ఇది 'ప్రఖ్యాతి' ఎంత మార్పు! ఇలా అనొచ్చా? బెంగాలీలో 'ముఖ్య మంత్రి'ని 'ముక్కొమొంది' (మొంతి)అని అంటారు. అన్నట్టు.. తెలుగులో 'దగ్గర' అనే మాట ఉంది. ఇది శిష్టవ్యావహారికంలో ఇవాళ 'దగ్గెర' అయి కూచుంది. తెలంగాణలో 'దగ్గెర'. చిత్తూరులో 'దగ్గిరికి'. అన్నీ 'దగ్గర'కు దగ్గిర రూపాలే! ఇంకా.. మరాఠీలోని 'జువళ్'కు ఇది దగ్గర అని నా ప్రతి పాదన. ఎలాగంటే 'దగ్గర' అనేది దగ్గర, దగ్గెర, దగ్గిర నే మూడు రూపాల్లో కలిపిస్తున్నది కదా. అది 'దగర' కూడా అయి ఉండాలి. ఈ 'ద'కూ మరాఠీ 'జవళ్'లోని 'జ'కూ సామీప్యం ఎక్కువ. 'సందెవేళ', 'సంజ వేళ'ల్లో 'ద' అనేది 'జ'గా కన్పిస్తున్నది కదా! ఇక... 'దగ్గర'లోని రెండవ అక్షరం 'గ' మరాఠీలో రెండోది 'వ' (జవళ్). గ, వ ... రెండూ పరస్పరం మారుతాయి. ఉదా|| పగలు, పవలు. చివరి అక్షరం 'ర' (దగర). 'మహారాష్ట్రలో 'ళ్' అది హృంతం కనుక దాన్ని ఓమారు 'ళ' అని అజంతంగా చూద్దాం. ఇప్పుడు తెలుగు చివరి 'ర' (ఱ), మరాఠీ ఆఖరి 'ళ' చాలా దగ్గర. ఈ రెండూ మారుతుంటాయి. ఎవరు, ఎవలు...లో 'రు' అనేది 'లు'గా కనిపిస్తున్నది కదా! భాషాదృష్టి అలవడినపుడు మనకు పదాల మధ్య సాజాత్య సారూపాలు తెలిసే వీలు కలుగుతుంది.
నామిని కథల్లో నేటివిటీ బాగా కన్పిస్తుంది. 'సంగటి' రాయలసీమదే కదా! దానిలోని కలుపు కునే 'గోగాకు ఊరుబిండి అక్కడిదే! గోగాకు అంటే గోగుచెట్టు ఆకు. ఆ చెట్టువి గూగుపూలు. ఆ గోగాకులతో చేసిన పచ్చడి 'గోంగూర'. అది బహుశ సిత్తూరులో 'గోగాకు వూరుబిండి'.
ఓ చోట 'అవీట్ని' అని ఉంటుంది. శిష్టభాషలో దాన్ని 'వాటిని' అని అంటారు. 'అవీట్ని' చాలా ప్రాచీనం. వ్యాకరణ పరిభాషలో దీన్ని అమహద్వాచక బహువచన సర్వనామం అంటాం. అవి కి 'ని' (ద్వితీయా విభక్తి) కలిపితే 'అవీట్ని' అవుతున్నది. ఇది తెలంగాణలో 'అవ్వీటిని'గా ఉంది. ఇదే.. మళయాళంలో 'అవట్టగళె'. తమిళంలో 'అవట్రైగళై' ఇవి తెలియనివాళ్ళు 'వాటిని' అనాలిగానీ, 'అవీట్ని' ఏమిటి అని మరలా ఎగతాళి చేస్తారు. కానీ మూలరూపానికి దగ్గరైన పదాలు వెనకబడిన ప్రాంతాల్లోనే ఉంటాయని గమనించాలి. ఇదే మొదటి కథలో 'రాబో, తేబో' అనే మాటలున్నాయి. ఇవి 'రాపో, తేపో' వరుసగా సంస్కృత 'అబద్దం'లో 'బ' 'ప'గా అపద్దంలో కనిపిస్తుంటే, తెలుగు 'పో' చిత్తూరులో 'బో' అయ్యింది.
'యాష్టపోతుంది' (విసుగు చెందుతుంది), 'అసోబుసో మని గసపోసుకుంటూ' (రొప్పుతూ రోజుయా), 'కలుపు పెరకతా' (కలుపు తీస్తూ / పీకుతూ), 'వరపడినానా?' (వరం అడిగినానా?' 'పట్టూ పరుగు' (ఒకటే పరుగు) 'ఏం వారుకున్నాను (ఏం బావుకున్నాను)... ఇట్లా ప్రాంతీయ పరి మళం నామని కథల్లో అంతటా ప్రసరిస్తది. 'కూలిపోయిన దేముడా!' 'నా బట్టా' మొదలైన చిత్తూరు చీవాట్లు విన్పిస్తాయి చెవులకింపుగా. 'ఉండాయి' అనే క్రియా పదం ఎంతో ప్రాచీనం. మరలా తెలియని వాళ్ళు 'ఉన్నాయి' కదా ఉండా ల్సింది అంటారు. 'ఉండాయి' అనేదే మూలం. అది క్రమంగా 'ఉన్నాయి' అయ్యింది. తెలుగులో 'మిన్నకుండి పోయాను' అని ఓ క్రియ ఉంది. అంటే మౌనంగా అని. ఇది 'మిన్నక' కాదు, 'మిండక'. ఈ 'మిండక' తెలుగు నిఘంటువు లోనే ఉండదు. కానీ మలయాళంలో ఉంది. అక్యత 'మిండాతె ఇరిక్కూ' అంటే 'మిన్నక ఉండు' అనీ అర్థం.
నామిని ఈ మొదటి రచనలో ఓ చోట 'నన్ను తోడుకొని' అంటాడు. అదే మూలం. తృతీయా విభక్తులు తెలుగులో 'చేతన్, చేన్, తోడన్, తోన్'లు. ప్రాచీన పద్యం భాషలో 'తోడ్కొని' అని ఉంటుంది. ఈ 'తోడుకొని' అంతేగానీ 'తీసికొని' వేరు. ఈ చిత్తూరు 'తోడుకొని' అనేదే తెలంగాణలో 'తోలుకొని'.
'అన్నాక, చెప్పినాక'... ఇటువంటివి వాస్తవంగా 'అన్న వెనుక, చెప్పిన వెనుక'ల నుంచి మారిన బాబతు. ఇవే తెలంగాణలో 'అన్నంక, చెప్పినంక'లుగా ఉంటాయి. 'నిజ్జంతో పచ్చ నాకు సత్తెంగా' చెబుతున్నాను. నామిని భాషలో జీవం ఉంది. శిష్టవ్యావహారికం మరో గ్రాంథికంలా శిలాసదృశం కారాదు. ఎవరి భాషలో వాళ్ళు రాస్తేనే అందులో జీవితమూ ఉంటుంది. జీవమూ ఉంటుంది.
- నలిమెల భాస్కర్ 9704374081