Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికే కాదు
భూమికి కూడ చెక్కరొస్తది
అతిసారాలాగనో
క్యాన్సర్ లాగనో కరోనా లాగనో
నీరసమయ్యో
అప్పుడప్పుడు
మనిషిలా భూమికూడ తూలిపడుతది
ఉంటుంటేనే మనిషి కిందపడినట్లు
భూమికూడ పల్టీపడ్డది
పేకమేడల్లా కూలిపోయిన భవంతులు
కాగితాల్లా చినిగిపోయిన రోడ్లు
కూలిపోయిన కొండలు గుట్టలు
పెంటకుప్పలైపోయిన మనుషులు
ఊర్లు స్మశాన వాటికలై రోదిస్తున్నయి
భూమంతా దుఃఖం దుఃఖపు భూకంపం
కళ్లముందటే
ఫిరంగిలా దూసుకొచ్చిన ఉత్పాతం
శిథిలాల కింద కోనవూపిరిలో ప్రజలు
కాళ్ళు రెక్కలు తెగిపోయి
నోట మాటల్లేని మౌనాలు
క్షతగాత్రుల ఆర్తనాదాలు
తుపాకులు
బాంబులు యుద్దాలతో
తెల్లారే కర్కశ మనస్తత్వాలకు
భూకంపాలు ఒక హెచ్చరిక
కన్నీళ్ళెంత ఉప్పుగా ఉంటాయో తెలిపింది
నీటి కత్తికీ ఒడ్డు తెగిపోయినట్లు
నేల గుండెల్ని కోసేసిన మహా విలయం
చెట్టు కూలే చెలెమె పూడిపాయే
కట్టెపుల్లల్లా బతుకులు విరిగిపాయె
రేపటికీ తోవెట్ల? జీవాలకు ఊపిరెట్ల?
బిడ్డలకు పాలెట్ల పశువులకు గ్రాసమెట్ల
భూమి నాదే అన్న మనిషికీ మిగిలిందెంత
ఆకాశపెత్తు భవనాలు
భూమికి అతిబరువన్నది ఎప్పడు తెలిసేది
భూమిని పీక్కతినకండి
భూమిని కాపాడు
భూమి నిన్ను కాపాడుతది
(టర్కీ సిరియా భూకంప మృతులకు
కన్నీటి నివాళులు)
- వనపట్ల సుబ్బయ్య, 9492765358