Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహితి, నవంబర్ నెలలో 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు లిటరరీ - ఫెస్ట్-2022 పేరుతో ''పాటకు జేజేలు'' అనే అంశంపై నిర్వహించిన సదస్సు ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇంత ఉత్సాహం గా, సందడిగా ఈ మధ్యకాలంలో ఏ సాహితీ సభ జరగలేదని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కె. ఆనందాచారి ప్రధాన సంపాదకత్వంలో 'సినీగీతా వరణం' శీర్షికతో పుస్తకం తీసుకువచ్చారు. తెలంగాణ సాహితి పాటకు జేజేలు అన్నది..
కవులు వచ్చారు.. సినీ రంగం నుంచి గీత రచయితలు వచ్చారు.. ప్రజాగాయకులు, యువ గాయకులు హాజరయ్యారు.. పాటకు స్పందించే వారు.. అక్షరాన్ని ప్రేమించేవారు.. ప్రముఖులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు వచ్చారు. అందరికీ కాకున్నా కొందరిలోనైనా అసలు పాటకు, కవితకు తేడా ఏమిటి అన్న సందేహం, ఉద్విగత ఎక్కడో ఓ మూల పుడుతుంది. తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస శ్రోతలకు ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. పాట, కవిత రెండూ సాహిత్య సృజనాత్మక కళారూపాలే. కవితను సాధారణంగా చదివి వినిపించవచ్చు, ఆలాపించవచ్చు. కానీ సినీపాట సంగీత స్వరాలకు అనుగుణంగా కూర్చ బడాలి. పాటల సాహిత్యంలో సంగీతం సహచరి గా ఉంటుంది. ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో కవి సమ్మేళనాలు జరుగుతూనే వున్నాయి. పాటలకు సంబంధించి ఎక్కడా సభలు, సమావేశాలు జరిగిన సందర్భాలు కానరాలేదు. అలాంటి సమయంలో పాటకు జేజేలు పలుకుతూ మూడు రోజుల సమావేశాలు జరపడమే గాక దాదాపుగా ఎనభై ఐదుగురు కవుల సినీ గీత రచనలను ప్రస్తావిస్తూ వారి సినీ సాహిత్య ప్రయాణాన్ని స్థూలంగా స్పర్శిస్తూ 'సినీగీతావరణం' తేవడం ప్రయాసతో కూడిన ఒక గొప్ప ప్రయత్నం. సినీ గీతాల గురించి తెలుసు కోవాలనుకునే భిన్న వర్గాల పాఠకులకు ఒక కరదీపికలాంటిది. ఈ ప్రస్తావనలో తొలి తెలుగు సినీగీత రచయిత చందాల కేశవదాసు నుంచి ఈనాటి సినిమాల గీత రచయిత తుమ్మూరి రామ్మోహనరావు వరకు వున్నారు.
ఈ మధ్య కాలంలో సాహిత్య సందర్భాలలో మత సామరస్యం మీద చర్చలు బాగా జరుగు తున్నవి. సీనియర్ సముద్రాల 'గృహలక్ష్మి'(1936) సినిమా కోసం సామాజిక చైతన్యాన్ని కలిగించి ఉద్యమాలలో మత సామరస్యాన్ని ప్రతిభింబించే విధంగా అప్పట్లోనే పాట రాశారు.
''వందే వందే భారత మాత
వర్ణ విభేదము కల్పితమైన
అందరు మానవులు ఒకటే అయినా
మాకీ కర్మలు తప్పదు
లేదు గీత
ముస్లిం హిందూ హరిజన మాత సమస్త జగతి శీత
మాలల మేలుకు ప్రాణము లేరా
దాస్య విమోచన మార్గమిదేరా
హరి జనసేవయే హరి సేవ రా!' .. అంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కుల మత వివక్షలు కళ్ళకు కట్టినట్లు చూపారు సముద్రాల. అలాగే తాపీ ధర్మారావు మాలపిల్ల సినిమా కోసం రాసిన పాటను కూడా మనం చెప్పుకోవచ్చు.
'మాలలు మాత్రమే మనుషులు కారా! భారత పుత్రులు లేరా!
ఏడు కోట్ల హరిజనులు తొలిగినా భేదము మతమని కనరా
మాలను కోసిన రక్తము రాదా? నీలో వున్నది పాలా!
ఈ భేదమేల సుజనులారా ..' మతం కారణంగా మనుషుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని మనుషులు అందరు సమానమే నని ఆనాటికే చెప్పగలిగిన సామాజిక అవగాహన సినీ సాహితీ కారులకున్నదని తాపీ వారి పాట తెలుపు తుంది. సినిమా, సినిమా పాటలు సంగీతం ప్రధానంగా వినోదం కోసమేననేది కాదనలేని సత్యం. కానీ అప్పటి సినీ రచయితలు సామాజిక సమస్యలను, దేశ భక్తిని రంగరించి, మతసామరస్యాన్ని కూడా ప్రభో దించే సాహిత్యాన్ని తమ పాటల్లో చూపేవారు. అదే దారిలో సి.నారాయణరెడ్డి ప్రకృతికి లేని కులమత భేదాలు మనుషులకు ఎందుకు అని ప్రశ్నిస్తూ సామాజిక అంశాన్ని, సమాజంలోని అసమానతలను తన గీతాల ద్వారా వివరించారు.
'గాలికి కులమేది ఏదీ
నేలకు కులమేదీ..
వీరులకు ఎందుకు కుల భేదం
అది మనసుల చీల్చెడు మతభేదం' అనే ఈ పాటలో పై విషయం మనకు అవగతమవు తుంది. వెలుగు నీడలు సినిమాలోని 'కల కానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న శ్రీశ్రీ పాట వ్యక్తిత్వ వికాసానికి, మూర్తిమత్వాన్ని పరాకాష్టగా చూపేదిగా నిలబడు తుంది. ప్రకృతి నేపథ్యంతో కృష్ణశాస్త్రి సాహిత్యం, మనసు మూల సూత్రంగా వుంటూ సాగే మన సుకవి ఆత్రేయ పాటలు చెప్పుకోదగ్గవి. అలా ఒక్కొక్క కవి తనదైన ప్రత్యేక బాణీని, శైలిని, ముద్రను చిత్ర పరిశ్రమలో సుస్థిరపరుకున్నారు. విషయ విస్తృతితో వున్న ఈ పుస్తకం మొత్తం చదివితే మనకీ విషయం తెలుస్తుంది. వీటూరి, రాజశ్రీ, వేటూరి, సిరివెన్నెల, సుద్దాల అశోక్ తేజ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తెర మీదకి వస్తారు. గద్దర్, వంగపండు, గూడ అంజయ్య వీరిది ఒక విలక్షణ మైన విప్లవ పాయ. ఈ సంపుటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినీ సాహిత్యంలోకి ఎగిసి వచ్చిన అలలు గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి ఇంకా ఇతర యువ గాయకులున్నారు. హైద్రాబాద్‌లోని శాలిబండకు చెందిన రాచపల్లి ప్రభు రాసిన పాట 'నాంపల్లి టేషను కాడి రాజాలింగో రాజా లింగా రామరాజ్యం తీరూ జూడూ శివా శంభులింగా ...' సమాజంలో పేరుకు పోయిన అవినీతిని దృశ్యం కడుతుంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భానూరి సత్యనారాయణ 'ఎర్ర మల్లెలు' సినిమా కోసం రాసిన పాటలు 'బంజారే బంజో ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా', శ్రమ సౌందర్యాన్ని చూపుతుంది. 'ఎవున్నదక్కో ఎవున్న దక్కా ముల్లె సదురుకున్న ఎల్లిపోతా వున్నా..' పాట ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి వున్నది.పాటలు గుర్తున్నా పాటల రచయితలెవరన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ పుస్తకం చదివితే అద్భుత పాటలను సృష్టించిన అనేక సినీ కవుల గీతాల గురించి, వారి సినీ ప్రస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఆనందాన్ని, ఆహ్లా దాన్ని, వినోదాన్ని కలిగించే ప్రేమ, విరహం, శృంగారం, భక్తి, విషాదం, హాస్యం, అల్లరి పెట్టే పాటలతో పాటు మత సామరస్యానికి, వ్యక్తిత్వ వికాసానికి పట్టం కడుతూ, దేశభక్తికి ప్రేరణగా, కుటుంబ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేయగల, ఘన చరిత్ర గల అప్పటి సినీ సాహిత్యం నేటి వర్తమాన సమాజానికి కూడా అద్దం పట్టి చూపగలిగే సాహితీ విలువలతో ఉండడం తెలుగునేల గర్వించదగిన విషయం. అలాంటి కవులుండడం మన అదృష్టం. చందాల కేశవదాసు నుంచి ఇప్పటి తరానికి చెందిన సినీ గీత రచయితలు చరణ్ అర్జున్, శ్రీమణి, కృష్ణ చైతన్య ఇంకా పింగళి చైతన్య, విస్వైక లాంటి రచయిత్రులను పరిచయం చేశారు. వీరే గాక ఉత్సహాంగా అద్భుతమైన సాహిత్య సృష్టి చేస్తున్న యువ రచయితలు ఇంకా ఉన్నారు. వీరిపై వ్యాసా లకు సీనియర్ రచయితలతో పాటు పరిశోధక విద్యార్థులను కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేయడం అభినందించదగిన విషయం.
వర్తమానంలోని మారుతున్న ఆధునికత, ఎదుగుతున్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి నేపథ్యం లో సరదాలు, వినోదాలు వెతుక్కునే దారిలో కొంత విలువల తగ్గిన సాహిత్యం రావడం సహజమే. వ్యాపార దృక్పథం ప్రధానమైనపుడు సాహిత్యం సన్నగిల్లడం జరుగుతుంది. సినీగీతాల ఆవరణం లో మతసామరస్యం, సామాజికాంశాలే కాకుండా భిన్నమైన వస్తువైవిధ్యాలను కూడా వ్యాస రచయితలు ప్రస్తావించారు. ఏది ఏమైనా అద్భుతమైన సినీసాహితీ సంపదను అందించిన ఘనత కవులది. స్థూలంగానైనా అనేకుల వివరా లను, విషయాలను ఈ తరానికే గాక పాత తరం వారిని కూడా తిరిగి తమ జ్ఞాపకాల్లోకి మళ్లించిన 'సినీగీతావరణం' : సినిమా పాటల్లో సాహిత్యం - ఓ విశ్లేషణగా ఒక బృహత్కార్యాన్ని భుజాలకె త్తుకొని విజయవంతంగా సమాజానికి అందించిన తెలంగాణ సాహితికి, సినీ గీతావరణం సంపాదక బృందానికి అభినందనలు.
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
9908840186